‘బీజేపీ తన సత్తా మరోసారి నిరూపించుకుంది’
స్వతంత్ర భారతదేశంలో 48 ఏళ్లు ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్. వారు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు బీసీల జనగణన చేపట్టలేదని గుర్తు చేశారు.;
దేశమంతా కులగణన చేయపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. దేశంలోని అణగారిన కులాల వారిని ఆదుకునే సత్తా తమకు మాత్రమే ఉందని మరోసారి బీజేపీ నిరూపించుకుందన్నారు. ప్రతి కులం వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే కులగణనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, కులగణను ఎలా చేస్తే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని, ఎటువంటి అవకతవకలు లేకుండా పూర్తి పాదర్శకత్వంలో దీనిని ఎలా నిర్వహించాలి అన్న అంశాలపై స్పష్టత వస్తూనే ప్రకటన విడుదల చేసిందని ఆయన చెప్పుకొచ్చారు.
‘‘స్వతంత్ర భారతదేశంలో 48 ఏళ్లు ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్. వారు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు బీసీల జనగణన చేపట్టలేదు. అణగారిన వర్గాలకు ఛాంపియన్ అని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు కొల్లగొట్టారు. అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ముసలికన్నీరు కారుస్తున్నారు. బీజేపీ 2014 లో ఒక ఓబీసీ బిడ్డను ప్రధానమంత్రిని చేసింది. కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలను, 12 మంది ఎస్సీలను, 8 మంది ఎస్టీలను, 5 మంది మైనారిటీలకు స్థానం కల్పించారు. 60 శాతం మంది ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి గౌరవం ఇచ్చారు’’ అని చెప్పారు.
‘‘2014 లో ఒక దళిత బిడ్డను, 2021 లో ఆదివాసి అడవి బిడ్డను రాష్ట్రపతులను చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ముసలికన్నీరు కార్చే కాంగ్రెస్ కి చెంపపెట్టు లాగా దేశంలో కులగణన చేపట్టనుంది. ఇది హర్షణీయం. ఓబీసీలకు గొప్ప గుర్తింపు. రాజకీయ సామాజిక విద్య ఉద్యోగాల పరంగా ఓబీసీలకు అవకాశాలు మరింత పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము’’ అంటూ మోదీకి మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ ఒక్కటే అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని ఇది నిరూపించిందని పేర్కొన్నారు.