యూట్యూబర్ ఆత్మహత్య.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
మంజీరా నదిలోకి దూకి మంగళవారం మధ్యాహ్నం ఆత్మహత్య.
సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండలం శివంపేట బ్రిడ్జ్ దగ్గర ఓ యూట్యూబర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం మధ్యామ్నం కారులో వచ్చిన యూట్యూబర్.. బ్రిడ్జ్‌పై తన వాహనాన్ని ఆపాడు. అనంతరం కారులో నుంచి బయటకు దిగి వెంటనే రైలింగ్ పై నుంచి నదిలోకి దూకాడు. ఈ ఘటన అంతా కూడా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కారును సీజ్ చేసిన పోలీసులు.. యువకుడి మృతదేహం కోసం గాలింపులు చేస్తున్నారు. గజఈతగాళ్ల సాయంతో నదిలో మృతదేహం కోసం గాలింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో మృతుడు లోకేష్ అనే యూట్యూబర్‌గా తేలింది. కాగా అతడి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? అనే కోణం దర్యాప్తును ముందుకు కొనసాగిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.