మునుగోడు లో అలజడి వెనక అదృశ్య హస్తం ఎవరిది?

ఆర్.ఆర్.ఆర్ అలైన్మెంట్, రాచకొండ ఎత్తిపోతల పథకం, శివన్న గూడెం నిర్వాసితుల ఆందోళనలు

Update: 2025-09-30 09:30 GMT

-పి చైతన్య

 

రాజగోపాల్ రెడ్డి దారి ఎటు ?

నల్లగొండ జిల్లాలోని మునుగోడు (Munugode) శాసనసభ నియోజకవర్గంలో రాజుకుంటున్న ఉద్యమాల వెనుక హస్తం ఎవరిది అనే అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్, రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, శివన్నగూడెం నిర్వాసితుల పునరావాసం పై ప్రారంభమైన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చితే ప్రభుత్వం తీర్పున పడే అవకాశం ఉంది. ఫ్లోరైడ్ సమస్యపై జాతీయస్థాయిలో ఉద్యమాన్ని నడిపిన అనుభవం  మునుగోడు ప్రాంత ప్రజలకు ఉంది. తమ సమస్యలపై రాజీలేని పోరాటం చేయటం ఈ ప్రాంత ప్రజల నైజం.

కొత్తగా పురుడు పోసుకుంటున్న ఆందోళనలు ఎక్కడికి దారితీస్తాయో అనే ఉత్కంఠ జిల్లా రాజకీయ వర్గాలలో నెలకొంది. అధికార పార్టీకి చెందిన మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఈ ఉద్యమాలకు బహిరంగంగానే మద్దతు తెలపటం విశేషం.

ప్రతిపక్ష పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి (BRS) నాయకులు సైతం ఈ ఉద్యమంలో పాల్గొంటూ సంఘీభావం తెలుపుతున్నారు. కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ, సిపిఎం నాయకులు ఈ ఉద్యమాలకు నాయకత్వం వహించడానికి పోటీపడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ఉద్యమాలు ప్రజా పోరాటాలుగా రూపాంతరం చెంది ప్రభుత్వానికి రాజకీయ క్లిష్ట పరిస్థితిని సృష్టించే అవకాశం ఉంది.

మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో రాజగోపాల్ రెడ్డి గత కొన్ని నెలలుగా తన నియోజకవర్గ సమస్యలపై అసంతృప్తి గళం వినిపిస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో జరిగిన రీజనల్ రింగ్ రోడ్ (RRR) నిర్వాసితుల సభకు రాజగోపాల్ రెడ్డి హాజరైన మరుసటిరోజే ఆ ప్రాంత ప్రజలు హైదరాబాదులోని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్.ఎం.డి.ఏ ) కార్యాలయం ముందు భారీ నిరసన ప్రదర్శనను నిర్వహించారు.

ఆర్.ఆర్.ఆర్ అలైన్మెంట్ మార్పుపై రాజగోపాల్ రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ దుమారాన్ని లేపాయి. కొన్ని ప్రైవేటు కంపెనీల భూములను కాపాడానికే ప్రభుత్వం దక్షిణ భాగంలో ఆర్.ఆర్.ఆర్, ఔటర్ రింగ్ రోడ్ మధ్య దూరాన్ని చౌటుప్పల్ నుండి తీవ్రంగా తగ్గించారని, ఇది కొన్ని ప్రైవేట్ కంపెనీల భూములు కాపాడే ప్రయత్నంలో భాగమని ఆయన ఆరోపించారు.

2013 సంవత్సరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి మునుగోడు శాసనసభకు ఉప ఎన్నికలు తెచ్చి గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఇరుకునబెట్టి దేశ రాజకీయాల దృష్టిని ఆకర్షించారు. ఉప ఎన్నికలు మునుగోడులో రాజకీయ రణ రంగాన్ని తలపించింది. మళ్లీ ఇప్పుడు పార్టీ, ప్రభుత్వం పదవి కంటే ప్రజలే ముఖ్యం అంటూ ప్రకటనలు చేస్తూ తనకు ఇచ్చిన మంత్రి పదవి హామీని అమలు చేయని కాంగ్రెస్ అధిష్టానానికి తీవ్ర సంకేతాలను పంపుతున్నాడు. మళ్లీ ఆయన ఆగ్రహించి రాజీనామా చేస్తే మునుగోడుకు మళ్లీ ఉప ఎన్నికలు తప్పవా అనే అంశం రాజకీయ వర్గాలలో మీడియాలో చర్చనీయాంశంగా మార్చడంలో రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారనే చెప్పవచ్చు.

మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో సాగునీటికి నోచుకోని సంస్థాన్ నారాయణపూర్ మండలం, చౌటుప్పల్ మండలంలోని పడమర ప్రాంతానికి చెందిన గ్రామాల రైతులకు సాగునీటి సదుపాయం కల్పించేందుకు రాచకొండ ఎత్తిపోతల పథకంల చేపట్టాలని మరొక ఉద్యమం ప్రాణం పోసుకుంటుంది. శివన్న గూడెం రిజర్వాయర్ నుండి నీటిని ఎత్తిపోయడం ద్వారా చెరువులు నింపినట్లైతే నారాయణపూర్, చౌటుప్పల్ మండలాలలో భూగర్భ జలాలు పెరిగి ఆ ప్రాంత ప్రజలకు ప్రయోజనంగా ఉంటుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ రైతు సంఘం నాయకుడు కె యాదవ రెడ్డి మాట్లాడుతూ " రాష్ట్ర ప్రభుత్వం గోదావరి జలాలతో మూసిని నింపాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాచకొండ ఎత్తిపోతల పథకంలో భాగంగా చర్లగూడెం నుంచి చౌటుప్పల్ వరకు పైప్ లైన్ నిర్మించినట్లయితే రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి జలాలతో చర్లగూడెం రిజర్వాయర్ ను కూడా నింపే వెసులుబాటు కలుగుతుంది,"అని  అన్నారు.

శివన్న గూడెం రిజర్వాయర్ నిర్వాసితులు సైతం తమకు ఇంకా పూర్తి న్యాయం జరగలేదని, మిగిలిన కుటుంబాలకు కూడా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఒకేసారి మూడు సమస్యలపై ఉద్యమాలు ప్రారంభం కావటం వెనక అదృష్ట హస్తం ఏమన్నా ఉన్నదా అనే అంశం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది.

మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి తన పాత ఎత్తుగడకు మళ్లీ పదును పెడుతున్నాడా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తన అనుచరులతో 70 వాహనాల తో కూడిన కాన్వాయ్ తో సహా చౌటుప్పల్ నుండి గుంటూరులో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లి రాజగోపాల్ రెడ్డి తన బలాన్ని ప్రదర్శించడం సైతం అనేక సందేహాలకు దారితీస్తుంది.

తెలంగాణ మంత్రివర్గ రెండవ విస్తరణ తర్వాత మునుగోడు రాజకీయాల్లో భారీ సంచలనాలు చోటుచేసుకున్నాయని ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.  అపుడు రాజగోపాల్ మంత్రి పదవి దక్కలేదు. మరొకవైపు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మునుగోడుపై తన మరువని ముద్రను వేయడానికి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.


Tags:    

Similar News