ఐటీ ఉద్యోగులకు శుభవార్త..ఐటీ కారిడార్‌లో టీజీ ఆర్టీసీ కొత్త బస్సులు

హైదరాబాద్ ఐటీ కారిడార్, పల్లె ప్రాంతాల్లో ప్రయాణికులకు టీజీ ఆర్టీసీ శుభవార్త వెల్లడించింది.వారం రోజుల్లో కొత్తగా 450 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని నిర్ణయించారు.

Update: 2024-07-08 02:03 GMT
తెలంగాణలో త్వరలో రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ బస్సులు

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని టీజీఆర్టీసీ తాజాగా నిర్ణయించింది.ఐటీ కారిడార్‌లోని మెట్రో స్టేషన్‌లు,బస్ స్టేషన్‌లు వర్క్‌ప్లేస్‌లలో ఐటీ ఉద్యోగుల డిమాండుకు అనుగుణంగా కొత్త బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులు తాజాగా నిర్వహించిన సర్వేలో తేల్చారు.

- హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్‌టిసీ) గత ఆరు నెలలుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారిడార్‌లో కొత్త బస్సు మార్గాలను ప్రవేశపెట్టింది.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బస్సు సర్వీసుల సేవలు
ఆల్విన్ 'ఎక్స్' రోడ్డు, కొత్తగూడ, గచ్చిబౌలి మీదుగా మియాపూర్ నుంచి నార్సింగి మార్గం అత్యంత రద్దీగా ఉంటోంది. ఈ మార్గంలో ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు నడుస్తుంది.గచ్చిబౌలి నుంచి నార్సింగి చేరుకోవడానికి మియాపూర్, బీహెచ్ఈఎల్, హఫీజ్‌పేట్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బస్సు సర్వీసుల సేవలు అందించనున్నారు.

రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు
బాచుపల్లి, ప్రగతి నగర్, మియాపూర్ వంటి ప్రాంతాల్లో ప్రయాణీకుల రద్దీని గుర్తించి, ఆర్టీసీ ఈ రూట్లలో మరిన్ని బస్సులను నడపాలని నిర్ణయించింది. జెఎన్‌టియూ మైండ్‌స్పేస్ ద్వారా బాచుపల్లి, వేవ్‌రాక్‌ని, అలాగే మెహిదీపట్నం నుంచి నానక్‌రామ్‌గూడ, విప్రో మీదుగా గోపన్‌పల్లికి అనుసంధానించే మార్గాల్లో ఎయిర్ కండిషన్డ్ బస్సు సేవలు ప్రవేశపెట్టనున్నారు.బస్సు ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ఏసీ బస్సులను నడపనున్నారు.క్యాబ్‌లు,ఆటో-రిక్షాలు,మెట్రో, బైక్ రెంటల్ ఏజెన్సీల నుంచి ఆర్టీసీ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ప్రయాణికులు బస్సు కోసం వేచి ఉండడానికి బదులుగా అందుబాటులో ఉన్న ప్రత్యామన్నాయ రవాణాను ఎంచుకుంటున్నారు.

సైబర్ లైనర్స్ మినీ బస్సులు
ఆర్టీసీ రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి కొత్తగా ప్రారంభించిన యూఎస్ కాన్సులేట్‌కు సేవలను అందించడానికి సైబర్ లైనర్స్ మినీ బస్సులు ప్రవేశపెట్టింది. ఈ వజ్ర ఏసీ మినీ బస్సులు స్టేషన్‌ నుంచి డీఎల్ఎఫ్, వేవ్ రాక్, జీఏఆర్ లకు లింక్ చేశారు. ఐటీ కారిడార్‌లోని ఉద్యోగులకు కనెక్టివిటీని మెరుగుపరచనున్నారు.

ఐటీకారిడార్ లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు
హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వైపు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. రోజూ ఉదయం వేళల్లో ఫ్లై ఓవరుకు రెండు వైపులా వాహనాలను అనుతించాలని నిర్ణయించారు. ఐటీ ఉద్యోగులను నగరంలోని వారి నివాస ప్రాంతాల నుంచి వారి కార్యాలయాలకు తరలించడానికి కేంద్రీకృత రవాణా వ్యవస్థను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు.ఐటి క్లస్టర్‌లోని కంపెనీల్లో 8-10 లక్షల మంది ఐటి ఉద్యోగులు పనిచేస్తున్నారు.సైబరాబాద్‌లో ట్రాఫిక్ ని తగ్గించడానికి,చుట్టుపక్కల ఉన్న అన్ని ఐటీ పార్కుల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో కొంతమంది సెక్యూరిటీ మార్షల్స్‌ను నియమించాలని అభ్యర్థించామని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.

వారం రోజుల్లో పల్లెల్లో ఆర్టీసీ విద్యుత్ బస్సులు
తెలంగాణ రాష్ట్రంలో వారం రోజుల్లో పల్లెల్లో ఆర్టసీ విద్యుత్ బస్సులు పరుగులు తీస్తాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ లో పోస్టు పెట్టింది.ఈ మేరకు రాష్ట్ర రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పోస్టు చేశారు. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడంతో బస్సుల్లో మహిళల రద్దీ పెరిగింది. దీంతో బస్సుల సంఖ్యను పెంచడంతోపాటు కొత్త బస్సులను కొనుగోలు చేయనుంది. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రాజెక్టు కింద తెలంగాణ ఆర్టీసీకి 450 బస్సులు రానున్నాయి.దీంతో హైదరాబాద్ నగరంతోపాటు పల్లెల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులు రయ్ మంటూ తిరగనున్నాయి.


Tags:    

Similar News