ఓయూ, స్టాన్ ఫర్డ్-ఆక్సఫర్డ్ అయిపోయిందా ?

బుధవారం ఓయూలోకి రేవంత్ రెడ్డి అడుగుపెట్టాడు కాబట్టే మంగళవారం వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రభుత్వం జీవో జారీచేసిందా ?

Update: 2025-12-10 10:47 GMT
Revanth in Osmania University

పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఉస్మానియా యూనివర్సిటీ నానారకాల బాధలు పడుతోంది. సమైక్యాంధ్ర పాలకుల ఏలుబడిలో తెలంగాణ నిర్లక్ష్యానికి, దోపిడికీ గురైందని గోలచేసి విద్యార్ధుల్లో కేసీఆర్ తదితరులు సెంటిమెంటును రగిల్చారు. ఫలితంగా ఓయూ విద్యార్ధులు వేలాదిమంది రోడ్లపైకి రావటంవల్లే(Telangana Movement) తెలంగాణ ఉద్యమానికి పెద్ద ఊపొచ్చింది. అధికారంలోకి రాగానే(Osmania University)ఓయూని అలాగ చేస్తాము..ఇలాగ చేస్తామని చాలా హామీలిచ్చారు. ప్రత్యేకతెలంగాణ సాధించుకున్న తర్వాత అంతకుముందు కేసీఆర్(KCR) తదితరులు చెప్పినట్లుగా ఓయూ బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయిందా ? సమస్యలన్నీ పరిష్కారమైపోయాయా ? 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ఓయూకి ఇచ్చిన హామీలను నెరవేర్చారా ? రేవంత్ ప్రకటన ప్రకారమే ఓయూని(Stanford University)స్టాన్ ఫోర్డ్, ఆక్స్ ఫోర్డ్(Oxford University)యూనివర్సిటీల సరసన చేర్చేందుకు చర్యలు మొదలయ్యాయా ?

ఇదే విషయమై ఓయూకి చెందిన కొందరితో ‘తెలంగాణ ఫెడరల్’ ప్రతినిధి మాట్లాడితే ఆశ్చర్యకరమైన సమాధానాలు వినిపించాయి. తెలంగాణ ఉద్యమంలో స్టూడెంట్ల ఆవేశాన్ని ఉపయోగించుకున్న కేసీఆర్ తదితరులు తర్వాత యూనివర్సిటీలోకి అడుగు కూడా పెట్టలేదు. సమైక్యపాలనలో భర్తీఅయిన పోస్టులే చివరి అపాయిట్మంట్లు. వివిధ డిపార్టమెంట్లలో వేలాది టీచింగ్ పోస్టుల ఖాళీలతో సరిగా చదువుచెప్పేవాళ్ళులేక విద్యార్ధులు నానా అవస్తలు పడుతున్నారు. పరిశోధనలకు ప్రోత్సాహంలేదు, హాస్టల్ బిల్డింగుల్లో సౌకర్యాల లేమి, అకడమిక్ బిల్డింగులు సరిపోవటంలేదు. నాన్ టీచింగ్ పోస్టింగులు భర్తీ కాకపోవటం మరో దురవస్ధ. వెరసి సమైక్య పాలనలోనే యూనివర్సిటి పరిస్ధితి ఎంతో కొంతనయంగా ఉండేదని కొందరు విద్యార్ధుల భావన.

ఇక 2023లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ మొదటిసారి ఆగష్టు నెల 25వ తేదీన యూనివర్సిటీకి వచ్చాడు. అప్పుడు ఓయూ అభివృద్ధికి వెయ్యి కోట్లరూపాయలు ఇస్తానని ప్రకటించాడు. ఓయూని స్టాన్ ఫోర్డ్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీల స్ధాయిలో డెవలప్ చేస్తానని ప్రకటించాడు. అయితే అప్పుడుచేసిన ప్రకటన అలాగే ఉండిపోయింది. ఎందుకంటే యూనివర్సిటీ డెవలప్మెంటుకు ఇస్తానన్న వెయ్యికోట్లరూపాయలు ఇప్పటివరకు ఇవ్వనేలేదు. బుధవారం యూనివర్సిటీలోకి రేవంత్ రెండోసారి అడుగుపెడుతున్నాడు కాబట్టి హఠాత్తుగా 9వ తేదీరాత్రి ఓయూకి వెయ్యికోట్లు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీఅయ్యాయి. మంగళవారంరాత్రి జారీచేసిన ఉత్తర్వలను ప్రభుత్వం వ్యూహాత్మకంగా బుధవారం మధ్యాహ్నాం బయటపెట్టింది. వెయ్యికోట్ల మాటేమయ్యిందని ఎవరైనా యూనివర్సిటీలో అడిగితే జవాబు చెప్పాలి కాబట్టి అర్జంటుగా నిధులు మంజూరుచేసినట్లు ఉత్తర్వులు జారీఅయ్యాయనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బుధవారం ఓయూలో రేవంత్ పర్యటన లేకపోయుంటే వెయ్యికోట్లు మంజూరుచేసినట్లు జీవో రిలీజ్ అవ్వటం డౌటేనా ?

కేసీఆర్ అడుగు పెట్టలేదు : వంశీ

ఓయూ పరిస్ధితిపై యూనివర్సిటీలోని కొందరు అధ్యాపకులు, విద్యార్ధులతో తెలంగాణ ఫెడరల్ మాట్లాడింది. పిజిక్స్ డిపార్ట్ మెంట్ విద్యార్ధి దొనికెన వంశీ మాట్లాడుతు ‘‘తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో కేసీఆర్, మంత్రులు ఓయూలోకి అడుగే పెట్టలేదు’’ అన్నారు. ‘‘ఉద్యోగాలు ఇస్తామని, నిధులు మంజూరుచేస్తామని హామీలిచ్చిన కేసీఆర్ యూనివర్సిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు’2 అని ఆరోపించాడు. మెస్ ఛార్జీలు రద్దుకాలేదని, ఫీజు రీఎంబర్స్ మెంట్ కూడా చేయలేదన్నాడు. ‘‘యూనివర్సిటీలోని 70కి పైగా విభాగాల్లో వేలాది టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి’’ అని చెప్పాడు. ‘‘యూనివర్సిటీలో ఉండాల్సిన 2వేల టీచింగ్ పోస్టులకు 700 మందికూడా లేరు’’ అని ఆరోపించాడు. ‘‘యూనివర్సిటీలో జరిగిన టీచింగ్ పోస్టుల నియామకాలు 2013లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేసినవే’’ అని గుర్తుచేశాడు. ‘‘బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ తొమ్మిదన్నరేళ్ళలో ఒక్క అపాయిట్మెంట్ కూడా చేయలేదు’’ అన్నాడు. ‘‘కావాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ యూనివర్సిటీలను నిర్లక్ష్యంచేసింది’’ అని మండిపడ్డాడు.

రేవంత్ పాలనగురించి మాట్లాడుతు ‘‘ఎన్నికలకు ముందు జాబ్ కాలెండర్ అని చెప్పి తర్వాత మరచిపోయాడు’’ అని ఎద్దేవాచేశాడు. ఫ్రీ ఎడ్యుకేషన్ హామీని కూడా రేవంత్ తుంగలో తొక్కేసినట్లు మండిపడ్డాడు. ‘‘ఆగస్టులో రేవంత్ ప్రారంభించిన రెండుభవనాలు కేసీఆర్ హయాంలో కట్టినవే కాని రేవంత్ ప్రభుత్వంలో ఏమీ కట్టలేదు’’ అన్నాడు. ‘‘విద్యార్ధులందరికీ సరిపడా హాస్టల్ భవనాలు లేవని, పరిశోధనలకు ప్రోత్సాహం కరువైంద’’ అన్నాడు. ‘‘రీసెర్చ్ స్టూడెంట్లకు ఇవ్వాల్సిన స్టైఫెండ్ కూడా ప్రభుత్వంనుండి సరిగా అందటంలేదు’’ అని చెప్పాడు. ‘‘పంచాయితీ ఎన్నికలున్నాయి కాబట్టే ఓట్లకోసం ఇపుడు రేవంత్ యూనివర్సిటీలోకి రెండోసారి వచ్చాడు’’ అని వంశీ ఎద్దేవాచేశాడు.

ఏళ్ళ తరబడి నియామకాలే లేవు : సంతోష్

ఆర్గానిక్ కెమిస్ట్రీ పీహెచ్డీ స్కాలర్ డాక్టర్ గుడిదేవిని సంతోష్ కుమార్ మాట్లాడుతు ‘‘యూనివర్సిటీలో నాన్ టీచింగ్, టీచింగ్ లో ఏళ్ళనుండి ఉద్యోగాలను పర్మినెంట్ చేయలేదు’’ అన్నాడు. ‘‘స్టూడెంట్ల హాస్టల్ పీజులు రీఎంబర్స్ కావటంలేదని, హాస్టల్ సౌకర్యాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నయి’’ అని చెప్పాడు. ‘‘ప్రభుత్వం తరపునుండి పరిశోధనలకు సరైన ప్రోత్సాహకాలు లేకపోవటంతో పరిశోదనలవైపు విద్యార్ధులు ఆసక్తిచూపటంలేదు’’ అని చెప్పాడు. ‘‘వెయ్యికోట్లు ఇస్తామని చెప్పటం వేరు ప్రకటించిన నిధులు ఇవ్వటంవేరు’’ అని సంతోష్ చెప్పాడు. ‘‘పంచాయితీ ఎన్నికలు ఉన్నాయికాబట్టే రేవంత్ మళ్ళీ యూనివర్సిటీలోకి వచ్చాడు’’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ‘‘2023 ఎన్నికలకు ముందు అందెశ్రీ, కోదండరామ్ లాంటి వాళ్ళొచ్చి కాంగ్రెస్ ను గెలిపిస్తే ఉద్యోగాలు, సమస్యలు పరిష్కరామవుతాయి’’ అని చెప్పినట్లు గుర్తుచేశాడు.


‘‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళెవరూ ఓయూలోకి అడుగుపెట్టలేదు’’ అని నిష్టూరంగా అన్నాడు. ‘‘అందెశ్రీ ఇపుడు లేరని అయితే ఉన్న కోదండరామ్ ను విద్యార్ధులు నమ్మటంలేదు కాబట్టే ప్రొఫెసర్ అడుగుపెట్టడంలేదు’’ అని చెప్పాడు. ‘‘టీచింగ్ పోస్టులు సుమారుగా వెయ్యికి పైగా ఖాళీలున్నా వాటి భర్తీపై పభుత్వాలు ఆలోచించటంలేదు’’ అని ఆరోపించాడు. ‘‘సంవత్సరాల తరబడి తాత్కాలికంగా పనిచేస్తున్న వారినే పర్మినెంట్ చేస్తే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు. ‘‘హాస్టళ్ళల్లో సౌకర్యాలు కూడా సరిగాలేవని, గోదావరి, యమున హాస్టళ్ళు మూతపడ్డాయి’’ అని చెప్పాడు. ‘‘ఎక్కువమంది విద్యార్ధులు టెక్నికల్ విద్యవైపు వెళుతుండటంతో మామూలు కోర్సులు చదివే విద్యార్ధులు తగ్గిపోతున్నారు’’ అన్నాడు. ‘‘సీఎం అయిన తర్వాత కేసీఆర్ ఒక్కసారికూడా అడుగుపెట్టలేదని, రేవంత్ రెండుసార్లు వచ్చాడు’’ అని చెప్పాడు. ‘‘పీజీ చదవినంత మాత్రాన ఉద్యోగాలు రావని స్కిల్స్ డెవలప్ చేసుకుంటేనే ఉద్యోగాలు తొందరగా వస్తాయి’’ అని సంతోష్ చెప్పాడు.

యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటోంది : శంకర్

పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అజ్మీరా శంకర్ మాట్లాడుతు ‘‘యూనివర్సిటీలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి’’ అని చెప్పారు. ‘‘2013లో జరిగినవే యూనివర్సిటీలో చివరినియామకాలు అని’’ అన్నారు. ‘‘ఆగస్టులో మొదటిసారి యూనివర్సిటీకి వచ్చిన రేవంత్ రెండోసారి బుధవారం అడుగుపెట్టడం సంతోషంగా ఉంది’’ అన్నారు. అయితే ఆగస్టులో ఇచ్చిన హామీ ప్రకారం వెయ్యికోట్లు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ‘‘యూనివర్సిటీ అభివృద్ధికి కీలకమైన ప్రొఫెసర్ల కొరత పట్టిపీడిస్తోంది’’ అని చెప్పారు. ‘‘ఒప్పంద, పార్ట్ టైమ్ ఆచార్యులకు 12 నెలలుగా జీతాలు లేవు’’ అని చెప్పారు. ‘‘2023 ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీఇచ్చినట్లుగా ఉద్యోగ భద్రత, యూజీసీ నిబంధనల ప్రకారం వేతనాలు ఇవ్వాలి’’ అని గుర్తుచేశారు. ‘‘పాతకాలపు భవనాలు, హాస్టళ్ళ శిధిలభవనాలతో విద్యార్ధులు అవస్ధలు పడుతున్నారు’’ అని చెప్పారు. ‘‘డిజిటల్ క్లాస్ గదులు, అంతర్జాతీయస్ధాయి లైబ్రరీ తదితరాల హామీలను రేవంత్ నిలబెట్టుకోవాలి’’ అని గుర్తుచేశారు. ‘‘పరిశోధనలకు సరైన ప్రోత్సాహం లేకపోవటంతో యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటోంది’’ అని శంకర్ అన్నారు.

‘‘పరిశోధనల్లో ఆధునీకరణ, అవసరమైన నిధులు మంజూరు కాకపోతే జాతీయస్ధాయిలో యూనివర్సిటి పోటీపడలేందు’’ అని గుర్తుచేశారు. ‘‘పెండింగులో ఉన్న కోట్లాదిరూపాయల ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు వెంటనే విడుదలచేయాలి’’ అని డిమాండ్ చేశారు. ‘‘ప్రభుత్వం గనుక యూనివర్సిటీకి మద్దతుగా నిలబడితే పూర్వవైభవాన్ని తిరిగి అందుకోవటం పెద్ద కష్టమేమీకాదు’’ అని అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకర్ అభిప్రాయపడ్డారు.

రీసెర్చ్ స్కాలర్ ఆర్ ఎల్ మూర్తి మాట్లాడుతు సుమారు రు. 100 కోట్ల స్కాలర్ షిప్పులు ప్రభుత్వం బకాయిలున్నట్లు చెప్పారు. యూనివర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం రు. 1500 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత పాలకులు ఉస్మానియాను పూర్తిగా నిర్లక్ష్యంచేసినట్లు మండిపడ్డారు. మారుతున్న పరిస్ధితులకు అనుగుణంగా యూనివర్సిటీల్లో కోర్పులు ప్రవేశపెట్టాలని సూచించారు.

సునీల్ నీరడి ఏమన్నారంటే యూనివర్సిటీల స్వయంప్రతిపత్తి విద్యావేత్తల చేతుల నుండి రాజకీయనేతల చేతుల్లోకి వెళ్ళిపోయినట్లు ఆరోపించారు. అకడమిక్ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయిన కారణంగానే ఓయూతో పాటు అన్నీ యూనివర్సిటీలు దెబ్బతిన్నట్లు ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నత విద్యావ్యవస్ధను బలహీనపరిచిందని మండిపోయారు.

హైదరాబాద్ పట్టణాభివృద్ధి పరిశోదకుడు డాక్టర్ ఎన్ యాదగిరిరావు మాట్లాడుతు ఓయూ ఉమ్మడి రాష్ట్రంలో కన్నా స్వరాష్ట్రంలోనే నిర్వీర్యం అయిపోయిందని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాడిన దగ్గర నుండి యూనివర్సిటీల్లో నియామకాలు జరగలేదని గుర్తుచేశారు. పాలకుల నిర్లక్ష్యం ఫలితంగానే యూనివర్సిటీలో వేలాది పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి అన్నారు. యూనివర్సిటీలో సుమారు 1200మంది కాంట్రాక్టు పద్దతిలో ఏళ్ళ తరబడి అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు అని చెప్పారు.

Tags:    

Similar News