Kavitha Rakhi |కేటీఆర్ పై మాట్లాడేందుకు ఇష్టపడని కవిత

కవిత శుక్రవారమే కేటీఆర్ కు మెసేజ్ పెడితే తాను అవుటాఫ్ స్టేషన్ అని సమాధానం ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది;

Update: 2025-08-10 09:16 GMT
Kalvakuntla Kavitha

సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో వచ్చిన గ్యాప్ గురించి మాట్లాడేందుకు కల్వకుంట్ల కవిత ఇష్టపడలేదు. కేటీఆర్(KTR) ప్రస్తావన రాగనే మాట దాటేశారు. ఆదివారం మీడియా సమావేశంలో ‘కేటీఆర్ కు రాఖీ(Rakhi Festival) ఎందుకు కట్టలేదు’ అన్న ప్రశ్నకు కవిత(Kavitha) మాట దాటేశారు. ‘బీఆర్ఎస్ పైనే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు’ ? అని ఎదురు ప్రశ్నించారు. ఇపుడు విషయం ఏమిటంటే శనివారం రాఖీ పండుగ సందర్భంగా కేటీఆర్ కు కవిత రాఖీ కట్టలేదు. రాఖి కట్టేందుకు ఇంటికి వస్తానని కవిత శుక్రవారమే కేటీఆర్ కు మెసేజ్ పెడితే తాను అవుటాఫ్ స్టేషన్ అని సమాధానం ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. శనివారం ఉదయం తనను కలిసిన కొందరు మహిళలతో రాఖీ కట్టించుకున్న కేటీఆర్ కవితకు అవుటాఫ్ స్టేషన్ అని ఎందుకు చెప్పారో ?

శనివారం మధ్యాహ్నం కేటీఆర్ బెంగుళూరుకు వెళ్ళినట్లు సమాచారం. అయితే మధ్యాహ్నం వరకు హైదరాబాదులోనే ఉన్నప్పటికీ కవితను కలవటానికి ఇష్టపడలేదు. అందుకనే సోదరుడికి కవిత రాఖీ కట్టలేకపోయారు. కొంతకాలంగా ఇద్దరి మధ్యా సంబంధాలు ఉప్పునిప్పులాగ ఉన్నవిషయం అందరికీ తిలిసిందే. అందుకనే కవితతో రాఖీ కట్టించుకునేందుకు కేటీఆర్ ఇష్టపడలేదు. ఈవిషయాన్నే మీడియా కవితదగ్గర ప్రస్తావించింది. అయితే కవిత సమాధానం చెప్పకుండా కేంద్రమంత్రి బండి సంజయ్ కు మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చినా పార్టీ నాయకత్వం ఈవిషయాన్ని ఎందుకు చర్చింలేదని ప్రశ్నించారు. దసరా పండుగ తర్వాత సింగరేణి వ్యాప్తంగా యాత్ర చేస్తానని ప్రకటించారు. సింగరేణి కార్మికులకు భరోసా ఇచ్చేందుకే తాను యాత్ర చేయబోతున్నట్లు చెప్పారు. ఇప్పుడు సింగరేణి కార్మికులకు వచ్చిన సమస్య ఏమిటో మాత్రం కవిత చెప్పలేదు.

తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘానికి గౌరవ అధ్యక్షురాలి హోదాలో తాను సమస్యలు తెలుసుకునేందుకు యాత్ర చేస్తున్నట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘానికి గౌరవ అధ్యక్షుడిగా మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఈమధ్యనే కేటీఆర్ ప్రకటించిన విషయం అందరికీ తెలుసు. గౌరవ అధ్యక్షుడిగా కొప్పులను నియమించిన విషయం తెలిసికూడా తానే గౌరవ అధ్యక్షురాలిని అని కవిత చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. సింగరేణి కార్మికులకు దసరాపండుగ బోనస్ 37 శాతం ఇవ్వాలని కవిత ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి లాభాలను ప్రభుత్వం తక్కువచేసి చూపిస్తోందని ఆరోపించారు.

సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యంచేస్తోందని మండిపోయారు. సంస్ధలో రాజకీయ అవినీతి ఎక్కువ అయిపోయిందన్నారు. రేవంత్ ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలపై అన్ని సంఘాలు కలిపి పనిచేయాలని సూచించారు. ఓపెన్ క్యాస్ట్ మైన్స్ వల్ల పెద్దవాళ్ళకే లాభం జరుగుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అండర్ గ్రౌండ్ మైన్స్ ఓపెన్ చేయాలన్న డిమాండ్ విచిత్రంగా ఉంది. ఇపుడు మైన్స్ అన్నీ కేంద్రప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ఈ విషయం తెలిసికూడా కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటమే విడ్డూరం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడే సింగరేణి గనులన్నీ కేంద్రప్రభుత్వం పరిధిలోకి వెళ్ళిపోయిన విషయం కవితకు తెలీకుండానే ఉంటుందా ?

Tags:    

Similar News