‘బీజేపీకి బాగా వచ్చింది అప్పులు తేవడమేగా’.. బండి సంజయ్‌పై పొన్నం ఫైర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. బీజేపీకి అప్పులు తీసుకురావడం తప్ప ఏం తెలుసంటూ మండిపడ్డారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. బీజేపీకి విషప్రచారాలు చేయడం, అప్పులు తీసుకురావడం తప్ప ఏం తెలుసంటూ మండిపడ్డారు. అప్పులు తీసుకురావడంలో బీజేపీది ప్రపంచ రికార్డు అంటూ వ్యంగ్యాస్త్రాలు సందించారు. తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి కూడా అమలు కావడం లేదని, కాంగ్రెస్ హయాంలో ప్రజలకు కష్టాలే వచ్చాయంటూ బండి సంజయ్ చేసిన విమర్శలకు బదులుగానే పొన్నం ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ చెప్పులు మోసే గుజరాత్ గులాములు అంటూ బీజేపీ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామిక పాలన నడుస్తోందని, ప్రజలకు సుభిక్ష పాలన అందించడంపైనే తమ ప్రభుత్వం దృష్టిసారించిందని చెప్పారు.
హామీలు ఎగ్గొట్టడం గురించి బీజేపీ వాళ్లే మాట్లాడాలని, ప్రజలకు ఇచ్చిన ఏ హామీని అమలు చేశారో బీజేపీ అయినా చెప్పగలదా అంటూ విమర్శలు గుప్పించారు. బీజేపీకి బాగా వచ్చింది హామీలు ఎగ్గొట్టడం, అప్పులు తేవడం మాత్రమేనని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చే బీజేపీ.. దేనినైనా చెప్పినట్లు అమలు చేస్తోందా? అని ప్రశ్నించారు. రైతులకు ప్రతి నెలా పింఛన్, పేదలకు ఉచిత విద్యుత్, సామాన్యుల అకౌంట్లలో రూ.15 లక్సల, రెండు కోట్ల ఉద్యోగాలు, విభజన హామీ ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీ ఎగ్గొట్టిన హామీలు ఎన్నో ఉన్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ అమలు చేయని హామీల గురించి చిన్న పిల్లలను అడిగినా చెప్తారని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం అలా కాదని, అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుంచి హామీల అమలును ప్రారంభించామని వెల్లడించారు.
మీరు తెచ్చిన అప్పులే భారం..
‘‘ప్రస్తుతం దేశానికి గుదిబండలా మారిన సమస్య అప్పులు. వాటిని తెచ్చింది ఎవరు.. బీజేపీ కాదా.. మీరు తెచ్చిన రూ.150 లక్షల కోట్లు అప్పులే దేశానికి గుడిబండలా మారాయి. మీరు తెచ్చి అప్పులకు ప్రతి ఏటా వడ్డీ కట్టడానికే రూ.11 లక్షల కోట్లు ఖర్చు అవుతోంది. బీజేపీ పదేళ్ల పాలనలో విద్వేశ ప్రచారం, విధ్వంస చర్యలు తప్ప దేశానికి మీరు చేసిందేంటి. దేశ బాగు కోసం బీజేపీ చేసింది శూన్యం. కానీ డబ్బా కొట్టుకోవడంలో ముందుంటారు. కోతలు, వాతలు అంటూ మధ్యతరగతి నడ్డి విరవడంలో బీజేపీ నేతలు నిష్ణాతులు. బీజేపీ నేతలకు అప్పులు తేవడం, హామీలు ఎగ్గొట్టడం వెన్నతో పెట్టిన విద్యలు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు పోన్నం ప్రభాకర్.
దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది
‘‘విద్యార్థుల స్కాలర్ షిప్‌లలో కోత, ఆడబిడ్డల ప్రసూతి ప్రయోజనాల్లో కోత, వయోవృద్ధుల రైలు ప్రయాణ రాయితీలకు కోత, రేషన్ కార్డుల కోత, ఎరువుల సబ్సిడీ కోత, గ్యాస్ సబ్సిడీ కోత, ఉపాధి హామీ నిధుల్లో కోత, ఫసల్ బీమా కోత, సెస్ ఇలా ఎన్నో పేర్లతో సామాన్యుల జేబులకు చిల్లులు వేస్తోంది బీజేపీ. పెట్రోల్ డీజిల్ దరలతో వాతలు పెడుతోంది బీజేపీ. అటువంటి బీజేపీ వచ్చి పది నెలల ప్రజా ప్రభుత్వంపై మాట్లాడటం దయ్యలు వేదాలు వల్లించినట్లే ఉంది. చేతనైతే తెలంగాణ హక్కులను కాపాడండి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రప్పించండి. అంతేకానీ ఇలా అవాకులు చవాకులు పేలితే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇంకా చేయాలనుకుంటే తెలంగాణకు విభజన హామీలు నెరవేర్చండి’’ అని హెచ్చరించారు పొన్నం ప్రభాకర్.