Rakhi | సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన సీతక్క..

మహిళలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్న సీఎం రేవంత్.;

Update: 2025-08-09 07:16 GMT
సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కడుతున్న మంత్రి కొండా సురేఖ

రాఖీ పూర్ణిమ(Rakhi Purnima) పండగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి మంత్రి సీతక్క(Seethakka), మంత్రి కొండా సురేఖ (Konda Surekha) రాఖీ కట్టారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో రేవంత్‌ను కలిసిన సీతక్క.. ఆయనకు రాఖీ కట్టారు. మంత్రి కొండా సురేఖ కూడా రేవంత్‌కు రాఖీ కట్టి తమ అనుబంధాన్ని చాటారు. ఈ రోజు రాఖీ పండగ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి మహిళలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మహిళలంతా తన తోబుట్టువులేనన్నారు. రాఖీ పండగ సందర్భంగా ప్రతి ఒక్కరికీ అన్నలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ‘‘ఆడబిడ్డల జీవితాల్లో… కోటి కాంతులు నిండాలని.. మా మహాలక్ష్ముల ఇంట… సుఖ శాంతులు పండాలని.. మనసారా కోరుకుంటూ… రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు’’ అని రేవంత్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణలోని మహిళలందరికీ రేవంత్ తియ్యని కబురు చెప్పారు. మహిళలను రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములను చేసి తీరుతానని చెప్పారు.

ప్రేమ ఆప్యాయలతో అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల బంధం మరింత బలపడాలని కోరుకుంటూ, పవిత్ర రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ శుభదినం రోజున అందరి ఇళ్లలో ఆనందం, ఆరోగ్యంతో గడపాలని ఆకాంక్షించారు. ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో మహిళాభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

ఆడబిడ్డల కోసం గృహజ్యోతి, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరా క్యాంటీన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులోనూ మహిళలకే పెద్దపీట వేయడం జరిగిందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళలందరూ భాగస్వాములయ్యే వరకు ప్రజా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందన్నారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని, మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీ పడబోమని అన్నారు. అక్కా చెల్లెళ్లందరికీ తమ ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, అందరి దీవెనలతో విజయవంతంగా ప్రజాపాలన సాగిస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News