FARMERS | మనం తినే ప్రతి ముద్ద వెనుకా ఓ రైతు చావు కేక?
భూమిని కాపాడే బాధ్యత రైతులదేనా? సివిల్ సొసైటీకి లేదా? 130 కోట్ల మందికి 12 కోట్ల మంది కూడా లేని రైతులు తిండి పెడుతున్న సత్యాన్ని పౌరసమాజం గుర్తించదా?;
By : The Federal
Update: 2024-12-16 09:09 GMT
భూమిని, భూసారాన్ని కాపాడే బాధ్యత రైతులొక్కర్లేదేనా? సమాజంలోని మిగిలిన వర్గాలకు బాధ్యత లేదా? అని ప్రశ్నించారు వ్యవసాయ శాస్త్రవేత్తలు, సామాజిక సేవా కార్యకర్తలు. 130 కోట్ల మందికి పట్టుమని 12 కోట్ల మంది కూడా లేని రైతులు తిండి పెడుతున్నారని, ఈ సత్యాన్ని గమనించాలని పౌరసమాజానికి విజ్ఞప్తి చేశారు. మున్ముందు భూమి కోసమే యుద్ధాలు జరుగుతాయని హెచ్చరించారు. భూమిని కాపాడి భావి తరాలకు అప్పగించకపోతే జరిగే అనర్థాలను వివరించారు. భూ సంరక్షణతోనే బంగారు భవిత అని హెచ్చరించారు. పద్మశ్రీ ఐవీ సుబ్బారావు ఫౌండేషన్ ప్రచురించిన 'మన నేలలే-మన భవిత' గ్రంథావిష్కరణ సభలో మాట్లాడిన వ్యవసాయ రంగ నిపుణులు, విధాన నిర్ణేతలు, సామాజిక సేవా కార్యకర్తలు ఈ హెచ్చరిక చేశారు.
రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన హైదరాబాద్ రెడ్ హిల్స్ ఫ్యాప్సీ భవన్ లో 'మన నేలలే-మన భవిత' పుస్తకావిష్కరణ సభ జరిగింది. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, మేనేజ్మెంట్ (నారమ్) డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు మాజీ ఛైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అల్లూరి పద్మరాజు, ప్రముఖ వ్యవసాయ ఆర్ధిక వేత్త డాక్టర్ కిలారు పూర్ణచంద్రరావు, వ్యవసాయ శాఖ సంచాలకులు డీవీ రామకృష్ణారావు, ఆకాశవాణి వ్యవసాయ కార్యక్రమాల మాజీ నిర్వాహకులు వలేటి గోపీచంద్ వంటి ఎందరో వ్యవసాయ ప్రముఖులు ప్రసంగించారు.
ప్రసంగాల సారాంశం ఏమిటంటే...
మట్టిని కాపాడుకుంటేనే భవిత. బతికున్నంత కాలం ఈ భూమిపైన కాలం తీరాక ఇదే మట్టిలో కలుస్తాం. భూమి గొప్పతనమే అంత. అన్నింటినీ భరిస్తుంది. మట్టిని నమ్ముకున్నవాడు బాగుపడతాడు. అమ్మినవాడు చెడతాడు. మనిషి జీవితం వందేళ్ళు. భూమిది శాశ్వతం. నైజీరియా లాంటి చిన్న దేశాల్లోనూ భూసార నమూనా పట్టికలు ఉంటున్నాయి. దశాబ్దాలుగా ఇండియాలో ఆ మాట వినబడుతున్నా ఇంతవరకు రైతులకు భూసార కార్డులు ఇవ్వలేకపోయాం. నైజీరియా సహా చాలా ఆఫ్రికా దేశాలలో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలు లేవు. పక్కా ఆర్గానిక్ వ్యవసాయం సాగుతోంది. దురదృష్టవశాత్తు ఇండియాలో పరిస్థితి వేరుగా ఉంది. పశువుల్ని పాలకోసం కాకుండా పేడ కోసం పెంచే పరిస్థితి ఒకప్పుడు ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు.
ఇటీవలి కాలంలో జీరో బడ్జెట్ అనే ఫార్ములా ఒకటి నడుస్తోంది. ఈ జీరో బడ్జెట్ తో ఫార్మింగ్ చేస్తే దేశానికి తిండి దొరకదు. బ్యాలెన్స్డ్ ఫార్మింగ్ కావాలి. ఈ దేశంలోని రైతులందరూ ఒకేసారి జీరో బడ్జెట్ కి వెళితే 150 కోట్ల మంది భారతీయులకు తిండి ఎలా అనేది పెద్ద ప్రశ్న. తిండి ముఖ్యమా లేక జీరో బడ్జెట్ తో ఫార్మింగ్ ముఖ్యమా అనే డైలమాలో ప్రస్తుతం విధాన నిర్ణేతలు కొట్టుమిట్టాడుతున్నారు. అందువల్ల సమతూకం ఉండేలా చూడాలి. మనం భూమిని చంపేస్తున్న మాట నిజం. పరిష్కారం ఎలా అనేది వ్యవసాయంతో ముడిపడి ఉన్న భాగస్వామ్య పక్షాలన్నింటితో చర్చించాలి. సుస్థిర వ్యవసాయమూ ఉండాలి, ఆహార భద్రతా ఉండాలంటే పంట మార్పిడితో పాటు దశల వారీగా భూమికి విరామం ఇవ్వాలి.
ఓ రైతుకు 5 ఎకరాల భూమి ఉంటే అందులో ఒక ఎకరం జీరో బడ్జెట్ సాగు, మరో ఎకరంలో ఆర్గానిక్ ఫార్మింగ్ మిగతా వాటిలో ఏవైనా ఇతర పంటలు వేస్తూ పోతూ ఉంటే కొంతకాలానికి రైతులకు అవగాహన కలుగుతుంది. తిండి గింజల కొరత లేకుండా ఉంటుంది. అదే సమయంలో భూమిలో కార్బన్ శాతాన్ని పెంచేందుకు పంట వ్యర్థాలను తగులబెట్టకుండా చూడాలి. రైతుకి ఆదాయం లేకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు ఏమి చెప్పినా ఫలితం ఉండదు. జనాభా ఎక్కువ ఉన్న దేశాలలో ఆర్గానిక్ ఫార్మింగ్ ఒకటే పరిష్కారం కాదు. అది సాధ్యం కాదు.
మనం తినే ప్రతి ముద్ద వెనుకా రైతుల ఆత్మఘోష ఉంది. భూసార పరిరక్షణ రైతుల ఒక్కరి బాధ్యత కాదు. మొత్తం సమాజం బాధ్యత వహించాలి. ఆర్గానిక్ ఫార్మింగ్, జీరో బేస్డ్ బడ్జెట్ ఫార్మింగ్ అంటున్నా దేశంలో 2023-2024 ఆర్దిక సంవత్సరంలో 10 శాతం ఫెస్టిసైడ్స్ అమ్మకాలు పెరగడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అందువల్ల విధాన నిర్ణేతలు మనిషి కేంద్రం గా భూమిని పరిశీలించాలి.
118 మిలియన్ల రైతులు 150 కోట్ల మంది ప్రజల కోసం 345 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తున్నారు. అటువంటి రైతులు గిట్టుబాటు ధరలు లేక రోడ్డెక్కుతున్నారు, కొన్ని సందర్భాలలో ప్రాణాలూ తీసుకుంటున్నారు. అయినా ఆ రైతుపైన్నే భారం పడుతోంది. భూమిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉండాలి. నేల సంరక్షణకు అందరూ కంకణం కట్టుకోవాలి. రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు సేంద్రీయ ఉత్పత్తులపై నమ్మకం కలిగించాలి. వరి సాగుపై ఆంక్షలు విధించాలి. పంట వ్యర్థాలు భూమిలో కలిసిపోయినపుడే భూమిలో కార్బన్ శాతం పెరుగుతుంది. పర్యావరణంలో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకోనంత కాలం సారవంతమైన భూమి పైపొరలు వృధాగా సముద్రంలో కలిసి పోతూనే ఉంటాయి. ఇది తీవ్ర నష్టం.
సేంద్రీయ వ్యవసాయాన్ని దశల వారీగా అమలు చేయాలి. యువతకు వ్యవసాయ విద్య నేర్పాలి. ప్రభుత్వాల పాలసీ బాగుండాలి. అందరూ భుజం భుజం కలిపి నడిచినపుడే భూమిని కాపాడుకోగలుగుతాం. భావి తరాలకు అందించగలుగుతాం అని వక్తలు చెప్పారు.