KCR Scared | కేసీఆర్ ను ఘోష్ రిపోర్టు భయపెడుతోందా ?
తమపై ఎలాంటి యాక్షన్ తీసుకోవటానికి వీల్లేకుండా ఆదేశాలు జారీచేయాలని కోరుతు పిటీషన్లు దాఖలుచేశారు;
జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎంతగా భయపెడుతోందో అందరికీ అర్ధమైపోతోంది. ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం తమపై రాజకీయ కక్షసాధింపులకు దిగుతోందని కేసీఆర్(KCR), మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) ఆరోపిస్తున్నారు. ఇవే ఆరోపణలపై మంగళవారం హైకోర్టు(High Court)లో వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేశారు. ఘోష్ కమిషన్(Justice PC Ghosh Commission) ఆధారంగా ప్రభుత్వం తమపై ఎలాంటి యాక్షన్ తీసుకోవటానికి వీల్లేకుండా ఆదేశాలు జారీచేయాలని కోరుతు పిటీషన్లు దాఖలుచేశారు. వీరి పిటీషన్లు బుధవారం విచారణకు వచ్చే అవకాశముంది.
కమిషన్ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం కేసీఆర్, హరీష్ తో పాటు కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీల అవినీతి, అక్రమాలపై ఇంకా యాక్షన్ తీసుకునేందుకు రెడీయే కాలేదు. రిపోర్టును క్యాబినెట్ సమావేశంలో చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో రిపోర్టును సభ్యులందరికి అందించి చర్చపెట్టి, మెజారిటి నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకునే విషయాన్ని నిర్ణయిస్తామని రేవంత్ స్పష్టంగా ప్రకటించారు. అసెంబ్లీలో రిపోర్టును టేబుల్ చేసేంతవరకు కూడా కేసీఆర్ వెయిట్ చేయలేకపోయారు. రిపోర్టు తమకు కావాలని హరీష్ రావు ఆమధ్య చీఫ్ సెక్రటరీని అడిగారు. అయితే విడిగా ఇవ్వటం కుదరదని, అసెంబ్లీలో ప్రవేశపెట్టినపుడు అందరితోపాటు బీఆర్ఎస్ సభ్యులకు కూడా రిపోర్టు అందుతుందని చీఫ్ సెక్రటరి బదులిచ్చారు.
నిజానికి కమిషన్ రిపోర్టులో ఏముందన్న విషయం లైన్ బై లైన్ ఎవరికీ తెలీదు. రిపోర్టులోని కొన్ని అంశాలు లీకులరూపంలో బయటకు వచ్చాయంతే. లీకులరూపంలో వచ్చిన అంశాలే కేసీఆర్, హరీష్ లో టెన్షన్ పెంచేస్తున్నట్లు అర్ధమవుతోంది. లీకైన రిపోర్టు అంశాల ప్రకారం కాళేశ్వరం, మేడిగడ్డ నాసిరకం, అవినీతి, అవకతవకల వల్లే దెబ్బ తినేసినట్లు కమిషన్ గుర్తించింది. అవినీతి, అవకతవకలకు ప్రధాన బాధ్యత కేసీఆర్, హరీష్ తదితరులదే అని కమిషన్ కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పింది. బాధ్యులని చెప్పటమేకాకుండా ఏవిధంగా బాధ్యులో కూడా వివరించింది. ఇంతమాత్రానికే కేసీఆర్ తల్లకిందులైపోతున్నట్లు అర్ధమవుతోంది.
రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెడితే అందులోని అంశాలన్నీ ప్రపంచానికి యధాతథంగా తెలిసిపోతుంది. అప్పుడు తన అవినీతి యావత్ ప్రపంచానికి తెలుస్తుందనే టెన్షన్ కేసీఆర్ లో పెరిగిపోతున్నట్లుంది. అందుకనే రిపోర్టు ఆధారంగా తమపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీచేయాలని కేసీఆర్, హరీష్ విడివిడిగా కేసులు దాఖలు చేశారు. కమిషన్ వేయటమే రాజకీయ కక్షసాధింపులో భాగమని కేసీఆర్, హరీష్ తమ పిటీషన్లలో ఆరోపించటమే ఆశ్చర్యంగా ఉంది. మరి వీళ్ళు దాఖలుచేసిన పిటీషన్లపై బుధవారం హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.