అస్తవ్యవస్థ కేబుల్స్‌పై సర్కార్ నజర్
రెండు ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వంలో వచ్చిన చలనం.;
విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను యుద్ధప్రాతిపదిక తొలగించాలంటూ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలిచ్చారు. హైదరాబాద్‌లో కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు కరెంట్ షాక్ ఘటనలు సంభవించాయి. వీటిలో రామాంతపూర్‌లో గోకులాష్టమి సందర్భంగా జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు అక్కడిక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరోప్రాంతంలో వినాయకచవితి కోసం పందిరి కడుతున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ఇటువంటి ఘటనలు రోజూ వెలుగు చూస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. కరెంటు స్తంభాలపై అడ్డదిడ్డంగా ఉన్న వైర్లను తొలగించే పని చేపట్టారు.
అంతేకాకుండా ఈ ప్రమాదాలు ముమ్మాటికి సదరు డిపార్ట్‌మెంట్, ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వం వల్లే జరిగాయంటూ విపక్షాలు విమర్శలు గుప్పించడం ప్రారంభించాయి. ప్రమాదం జరిగి.. ప్రాణాలు పోతే ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులిపేసుకోవడం మాత్రమే ఈ ప్రభుత్వానికి తెలుసని, ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవడం తెలియదంటూ చురకలంటించారు ప్రతిపక్ష నేతలు. దీంతో ఈ అంశాలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి రంగంలోకి దిగి ఈ ప్రమాదాలపై ఆరాతీశారు. రాష్ట్రంలో పలుచోట్ల టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు వివరించారు. రామాంతపూర్ ఘటనలో కూడా కేబుల్ వైర్ తెగి విద్యుత్‌లైన్‌పై పడటంతోనే ప్రమాదం జరిగిందని విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు ప్రభుత్వానికి వివరించారు.
దీంతో భట్టి.. విద్యుత్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనుమతులు లేకుండా ఉన్న అన్ని విద్యుత్ కనెక్షన్లను తొలగించాలని చెప్పారు. అదే విధంగా కేబుల్ వైర్లు తొలగించడానికి ఏడాది సమయం ఇచ్చినా ఆపరేటర్లు స్పందించలేదని, వాటిని కూడా తొలగించాలని వెల్లడించారు. వారి నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అనేక ప్రాంతాల్లో విద్యుత్ శాఖ సిబ్బంది చర్యలు చేపట్టింది. స్తంభాలకు ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుళ్లను తొలగిస్తోంది.