బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌ కేసులో సినీ నటులకు ఊరట

విచారణకు హాజరైన ప్రముఖులు సైతం తాము పర్యావసనాలు ఆలోచించుకోకుండా ప్రచారం చేసినట్లు తెలిపారు. ఇకపై ఇటువంటివి ప్రమోట్ చేయమని చెప్పారు.;

Update: 2025-03-24 12:22 GMT

బెట్టింగ్ యాప్స్‌ ప్రమోషన్స్ అంశం తెలంగాణలో కలకలం రేపుతోంది. బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు.. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లతో పాటు కొందరు స్టార్ హీరోలు కూడా ఉన్నారు. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మీ, నిధి అగర్వాలు తదితరులు ఉన్నారు. వారిని విచారణకు పిలుస్తూ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. తాజాగా ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు పోలీసులు. వాళ్లందరికీ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ నుంచి ఊరట లభించింది. ఈ కేసులో పోలీసులు తమ ఫోకస్‌ను ప్రమోటర్లపై నుంచి యాప్స్ నిర్వాహకులపైకి మళ్లించారు.

ఇందులో భాగంగా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు 19 మందిపై పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేశారు. కేసులో కొత్త సెక్షన్లను చేర్చి మరీ వాళ్లని నిందితులుగా చేర్చారు. ఈ మేరకు మియాపూర్ పోలీసుల కోర్టులో మెమో కూడా దాఖలు చేశారు. ఈ కేసులో ప్రముఖులను సాక్షులుగా మార్చేలా పోలీసులు యోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పలువురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారిలో కొందరిని ఇప్పటికే విచారించారు. ఇంకా మరికొందరిని విచారించాల్సి ఉంది. ఈ క్రమంలోనే విచారణకు హాజరైన ప్రముఖులు సైతం తాము పర్యావసనాలు ఆలోచించుకోకుండా ప్రచారం చేసినట్లు తెలిపారు. ఇకపై ఇటువంటివి ప్రమోట్ చేయమని చెప్పారు.

అయితే ఇప్పటికే ఈ కేసు విషయంలోకి ఈడీ కూడా రంగప్రవేశం చేసింది. బెట్టింగ్ యాప్‌ల లావాదేవాలపై ఈడీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ లావాదేవీలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? ఎవరి ఖాతాల ద్వారా జరుగుతున్నాయి? వంటి అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈడీ విచారణ చేపట్టింది.

Tags:    

Similar News