‘ఎంపీలకు కోటా కావాలి’
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో కోటాలపై ఎంపీ రఘునందన్ రావు కీలక డిమాండ్.;
పేదల సొంతింటి కల నెరవేర్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఇందిరమ్మ ఇల్లు. ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపిక శరవేగంగా సాగుతోంది. కాగా ఇందులో ఎమ్మెల్యేలకు కోటా ఉంది. తాజాగా ఈ అంశంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలకు ఉన్నట్లు ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకం లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు కూడా కోటా కల్పించాలని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
ఎమ్మెల్యేల మాదిరిగానే ఎంపీలు కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులేనన్నారు. లబ్ధిదారుల ఎంపికల సహేతుకత పెరగాలంటే ఎంపీలకు 40శాతం కోటా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకు మరింత న్యాయం జరగడం కోసమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను కూడా ఇందులో వినియోగిస్తున్నట్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా 17 మంది ఎంపీలకూ కోటా కల్పించాలని రఘునందన్ రావు కోరారు. గతంలో ఎంపీగా పనిచేసిన రేవంత్.. ఈ విషయంపై వేగంగా ఓ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.