రికార్డ్ సృష్టించిన తెలంగాణ ఆర్‌టీసీ
రాఖీ పౌర్ణమి సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకున్న మహిళలు.;
తెలంగాణ ఆర్టీసీ సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరు రోజుల సమయంలో 3.68 కోట్ల మంది ఆర్టీసీలో ప్రయాణాలు చేశారు. ఇంతటి స్థాయిలో ప్రయాణాలను నమోదు చేయడం ఇదే తొలిసారి. రాఖీ పూర్ణిమ సందర్భంగా ఆరు రోజుల్లో తెలంగాణ మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. రాఖీ పండగ సందర్భంగా ఆరు రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించారు. వాటిలో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయి.
రాఖీ పండగ నేపథ్యంలో ఆగస్టు 9న 45.62 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆగస్టు 11న అత్యధికంగా 45.94 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఒక్క రోజులో ఇంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో ఇదే తొలిసారి. గతేడాది రాఖీకి మొత్తం 2.75 కోట్ల ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు చేశారు. ఈ ఏడాది ఆ సంఖ్య 3.68 కోట్లకు చేరింది. అదే విధంగా ఈ ఏడాది రాఖీకి ఆర్టీసీ బస్సులు 2.28 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 53 లక్షల కిలోమీటర్లు అధికంగా ప్రయాణించాయి.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాల సంఖ్య పెరగడంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఈ రాఖీ పండుగ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీ చరిత్రలోనే అత్యధికంగా 6 రోజుల్లో 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా, అందులో 2.51 కోట్ల మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణాలు చేయడం ఆనందనీయం . రాఖీ రోజు మాత్రమే కాకుండా, ఈ నెల 11న ఒక్క రోజులోనే 68.45 లక్షల మంది ప్రయాణించడం రికార్డు స్థాయి విజయంగా నిలిచింది. భారీ వర్షాలు, విపరీతమైన రద్దీ, పండుగ ఒత్తిడి మధ్య కూడా ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తమ కుటుంబాల నుండి దూరంగా అంకితభావం, నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేసి లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. ఈ కృషికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజల ఆదరణ, విశ్వాసం మా ప్రజా రవాణా వ్యవస్థ బలాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ విజయాన్ని సాధించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు’’ అని తెలిపారు.