హమ్మయ్య.. ఈ సారి గట్టేక్కుతాం..

తెలంగాణలో దాదాపు మూడు సంవత్సరాలుగా నలుగుతున్న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష విజయవంతంగా పూర్తి అయిందని అభ్యర్థులు అంటున్నారు.. కానీ..

Update: 2024-06-10 05:29 GMT

హమ్మయ్య.. గట్టేక్కాం.. ఇండియా టీ20 వరల్డ్ కప్ పాక్ పై లో కష్టపడి గెలిచినందుకు కాదు.. మూడో సారి విజయవంతంగా తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష పూర్తి చేసినందుకు అభ్యర్థులు వెలిబుచ్చిన అభిప్రాయం. ఒకటా రెండా...కేవలం ప్రిలిమ్స్ పరీక్ష కోసం ఏకంగా మూడు సంవత్సరాలు, మూడు సార్లు పరీక్ష రాశారు అభ్యర్థులు.

ఏప్రిల్ 2022 లో నోటిఫికేషన్ వచ్చింది మొదలు ప్రతీసారి పరీక్ష తేదీలు మారడం, పేపర్ లీక్, రద్దు, మళ్లీ రాయడం, ఈ సారి హైకోర్టు రద్దు చేయడం.. అసలు అవాంతరాలు ఇలా వస్తాయా అనే ఎవరూ ఊహించని రేంజ్ లో తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షకు అడ్డంకులు వచ్చాయి.

మొదట నోటిఫికేషన్ వచ్చాక ఆగష్టులో ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుందని, నవంబర్ లేదా డిసెంబర్ లో మెయిన్స్ పరీక్ష ఉంటుందని అప్పటి టీఎస్పీఎస్సీ ప్రకటించింది. కానీ అభ్యర్థుల సూచనలతో ప్రిలిమ్స్ పరీక్ష ను అక్టోబర్ కు మార్చారు. మెయిన్స్ తేదీని మాత్రం ప్రకటించలేదు బోర్డు.
ప్రిలిమ్స్ పరీక్ష పూర్తయ్యాక దాదాపు మూడు నెలలకు గానీ ఫలితాలు ప్రకటించలేదు. అలా జనవరి 2023లో ఎట్టకేలకు రిజల్ట్స్ ప్రకటించి మెయిన్ జూన్ 2023 నుంచి నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ అనూహ్యంగా 2023 మార్చిలో పేపర్ లీక్ ఘటన వెలుగు చూడడంతో అభ్యర్థుల తీవ్ర గందరగోళానికి గురయ్యారు, వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిన కమిషన్  ప్రిలిమ్స్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వెనువెంటనే ఆగష్టులో మరోసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది.
అనుకున్నట్లుగానే బోర్డు పరీక్ష నిర్వహించింది.. కాని కీలకమైన బయోమెట్రిక్ తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఫలితంగా కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో దానిని రద్దు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు మూడు నెలల పాటు ఏం చేయాలో గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అర్థం కాలేదు. బోర్డు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసి చేతులు దులుపుకుంది.
గ్రూప్స్ నోటిఫికేషన్ తీవ్రంగా ఆలస్యం కావడం ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగడంలో ప్రధాన పాత్ర పోషించింది. వెంటనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్పీని ప్రక్షాళన చేసింది. పాత అధికారులను బయటకు పంపి సుప్రీంకోర్టులో కేసు వాపస్ తీసుకుంది.
కొత్తగా మరికొన్ని పోస్టులను జత చేస్తూ 563 పోస్టులతో నోటిఫికేషన్ ను ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసింది. జూన్ 9 న పరీక్ష నిర్వహిస్తామని, అక్టోబర్ 21న నుంచి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని సమాచారం ఇచ్చింది. అనుకున్నట్లుగానే నిన్న విజయవంతంగా పరీక్ష నిర్వహించింది. అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు రావాలని చెప్పడం, హాల్ టికెట్ పై కొత్తగా ఫోటో తీసుకోవాలని చెప్పడం వంటి కఠినమైన నిబంధనలు అనుసరించింది. నిమిషం ఆలస్యమైన పరీక్ష హల్లోకి రానివ్వమని చెప్పి పాటించింది. ఇలా మొత్తానికి ప్రిలిమ్స్ ను విజయవంతంగా పూర్తి చేసింది.
పేపర్ ఎలా ఉందంటే..
ప్రిలిమ్స్ పేపర్ మధ్యస్థంగా ఉందని అభ్యర్థులు అంటున్నారు. పోయినసారి రాసిన రెండు పేపర్లతో పోలిస్తే ఇది కాస్త తేలికగా ఉందని వివరించారు. అయితే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రం లేవని చెబుతున్నారు. అన్ని రకాల ప్రశ్నలు సంధించారని, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సైతం పలు ప్రశ్నలు వచ్చినట్లు చెబుతున్నారు.
కటాప్ 70 నుంచి 80 మధ్య ఉండవచ్చని పేపర్ ను చూస్తే తెలుస్తోంది. ఒక పోస్టుకు 50 మంది చోప్పున ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు అభ్యర్థుల ఎంపిక ఉంటుందని బోర్డు ఇంతకుముందే ప్రకటించింది.
తెలంగాణలో గ్రూప్ 1 పరీక్ష విజయవంతంగా నిర్వహించడంపై కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి ఫెడరల్ తో మాట్లాడుతూ.. ‘‘ ఈ సారి విజయవంతం అవుత. పరీక్ష రద్దు అవుతుంది..పేపర్ లీక్ అవుతుందనే టెన్షన్ ఈ సారి లేదు. కట్టుదిట్టంగా పరీక్ష నిర్వహించారు. పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ కొనసాగించా. మెయిన్స్, ప్రిలిమ్స్ రెండు ఏకకాలంలో దృష్టి పెట్టి చదివాను. చివర్లలో ప్రిలిమ్స్ కోసం పూర్తి స్థాయిలో సమయం కేటాయించా. కచ్చితంగా విజయం సాధిస్తా’’ అని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నట్లు వివరించారు. కొన్ని ప్రశ్నలు చదవడానికి చాలా సమయం పట్టిందని, ఆర్ధమెటిక్, రీజనింగ్ కొంచెం కష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు.


Tags:    

Similar News