బాసర ఆలయానికి గోదావరి వరద ముప్పు
గైక్వాడ్, విష్ణుపురి, పైతాన్ ప్రాజెక్టుల నుండి భారీగా వరద నీరు వదిలేస్తుండటంతో బాసర దగ్గర గోదావరిలో వరద పోటు పెరిగిపోతోంది;
గతంలో ఎప్పుడూ లేనట్లుగా బాసర అమ్మవారి దేవాలయానికి వరద ముప్పు ముంచుకొస్తోంది. మహారాష్ట్ర, నాందెడ్(Nanded District) జిల్లాలోని గైక్వాడ్, విష్ణుపురి, పైతాన్ ప్రాజెక్టుల నుండి భారీగా వరద నీరు(Flood waters) వదిలేస్తుండటంతో బాసర దగ్గర గోదావరి(Godawari Floods)లో వరద పోటు పెరిగిపోతోంది. గడచిన ఐదు గంటల్లోనే బాసర(Basara Temple) దగ్గర గోదావరి నదిలో 6 అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. దీనిఫలితంగా ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లోని షాపులన్నీ దాదాపు నీటి ముణిగిపోయాయి. దేవాలయానికి సంబంధించిన కాటేజీల్లోకి ఇప్పటికే వరద నీరు ప్రవేశించింది. ఇదే పద్దతిలో వర్షం, మహారాష్ట్ర నుండి గోదావరిలో నీరు చేరుతుంటే ఈరోజు సాయంత్రానికి బాసర దేవాలయం ప్రాంగణంలోకి నీరు వచ్చేయటం ఖాయమని దేవాలయం అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఉగ్రరూపాన్ని శాంతింపచేయటానికి బాసర దేవాలయ పూజారులు గోదావరి తల్లికి స్నాన ఘట్టాల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాటేజీల్లోని సిబ్బంది, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పోలీసులు సహాయక చర్యలు చేస్తున్నారు. పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు జిల్లా ఎస్పీ జానకీ షర్మిల అక్కడే ఉన్నారు. ఆలయంలోకి ప్రవేశించేందుకు మూడు మార్గాలున్నాయి. ఒకటి గోదావరి నది పక్కనుండి లాడ్జీల మధ్యలో నుండి దేవాలయానికి వెళ్ళేదారి. ఇక రెండోది రైల్వేస్టేషన్ నుండి ఆలయానికి వెళ్ళే దారి. ప్రస్తుతం ఈ రెండుకూడా వరద నీటితో ముణిగిపోయాయి. ఫలితంగా దేవాలయానికి వెళ్ళే దారులు మూసుకుపోయాయి. గ్రామంనుండి దేవాలయానికి వచ్చే దారి ఒకటే కాస్త పర్వాలేదన్నట్లుగా ఉంది. దేవాలయ చుట్టుపక్కల ప్రాంతాలు ముణిగిపోయాయి.
గోదావరిలో వరద నీటిమట్టం ఇదే విధంగా పెరుగుతుంటే కొన్ని గంటల్లోనే బాసద అమ్మవారి దేవాలయంలోకి నీళ్ళు వచ్చేయటం ఖాయమని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 1983లో దేవాలయం మెట్లు ముణగిపోయాయని బాసరలో ఉండే మిత్రుడు విజయ్ గుర్తుచేసుకున్నాడు. మహారాష్ట్రలో భారీవర్షాలు పడినపుడు బాసర దేవాలయానికి వదర ముప్పు వస్తుండటం చాలా సహజం. ఇపుడు కూడా నాందేడు జిల్లాలో క్లౌడ్ బరెస్ట్ కి మించి ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తుండటంతో బాసర దేవాలయంకు వరద ముప్పు కమ్ముకుంటోందని మిత్రుడు ఆందోళన వ్యక్తంచేశాడు. దేవాలయానికి వరదముప్పు 100 అడుగుల దాకా చేరుకుంది. నాందేడులో ఇదే విదంగా భారీవర్షాలు కురుస్తుంటే దేవాలయంలోకి నీరువచ్చేయటం ఖాయం.