ఎన్నికల్లో కనుమరుగైపోతున్న కమ్యూనిస్టులు

నల్గొండ, ఖమ్మంలో ఎంతో బలంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు చివరకు కాంగ్రెస్, టీడీపీ తర్వాత బీఆర్ఎస్ కు తోకపార్టీలుగా మారిపోయి అస్తిత్వాన్నే కోల్పోయాయి.

Update: 2024-04-07 08:34 GMT

ఒకపుడు ఉవ్వెత్తున లేచిన కమ్యూనిస్టు పార్టీల ప్రాభవం కాలక్రమంలో మసకబారిపోయింది. స్వాతంత్రం తర్వాత 1952లో జరిగిన మొదటి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో కమ్యూనిస్టు పార్టీలు గట్టి ప్రభావంమే చూపించాయి. స్వాతంత్రానికి ముందు తర్వాత కూడా చేసిన నిజాం వ్యతిరేక ఉద్యమాలు, సాయుధపోరాటం, రైతాంగం పోరాటాల కారణంగా జనాల్లో కమ్యూనిస్టు పార్టీలు, కమ్యూనిస్టు నేతలంటే ప్రత్యేక గౌరవముండేది. పోరాటాల్లో భాగంగా కమ్యూనిస్టు ఉద్యమనేతలు ఏ గ్రామానికి వెళ్ళినా జనాలు ఎంతో ఆధరించేవారు. ఉద్యమకారులకు అండగా నిలబడేవారు. అలాంటిది 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశమంతా స్వాతంత్ర్య సంగ్రామం ముగిసినా తెలంగాణాలో మాత్రం నిజాం వ్యతిరేక పోరాటాలు ఆగలేదు.

ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొంతకాలానికి కాని నిజాం ప్రభువు భారత ప్రభుత్వానికి లొంగలేదు. అప్పటికికాని తెలంగాణా స్టేట్ కు నిజాం ప్రభుత్వం నుండి విమోచనం దొరకలేదు. తర్వాత అంటే 1952లో జరిగిన మొదటి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు కూడా పాల్గొన్నాయి. 1951లో కమ్యూనిస్టులు తమ గొరిల్లా పోరాటాలను ఆపేసినా సీపీఐ మీద నిషేధం దెబ్బపడింది. అందుకనే సీపీఐ పేరుతో కాకుండా పీడీఎఫ్(ప్రోగ్రెసివ్ డెమక్రటిక్ ఫంట్ర్) బ్యానర్ తో ఎన్నికల్లో పాల్గొన్నది. ఆ ఎన్నికల్లో ఏడు పార్లమెంటు సీట్లతో పాటు 36 అసెంబ్లీ సీట్లలో ఘనవిజయం సాధించింది. అప్పటి ఎన్నికల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పీడీఎఫ్ అభ్యర్ధిగా పోటీచేసిన పెండ్యాల రంగారావు ప్రముఖ కవి కాళోజీ నారాయణరావును ఓడించటం. కాళోజి అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసారు.

ఎంత మెజారిటితో గెలిచారు ?

అప్పట్లోనే ఉద్యమకారుడిగా పెండ్యాల, ప్రజాకవిగా కాళోజి ఇద్దరు ప్రముఖులే. ఇద్దరు కూడా తమదైన స్టైల్లో ప్రజలతో మమేకమై ఉన్నారు. ఇద్దరు కూడా బాగా పాపులర్ కాబట్టి అప్పటి ఎన్నిక హోరాహారీగా జరిగింది. ఆ ఎన్నికలో కాళోజీపైన పెండ్యాల 3,612 ఓట్ల మెజారిటితో గెలవటం పెద్ద సంచలనమైంది. అదే ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెండ్యాల రెండు నియోజకవర్గాల్లో పోటీచేసి రెండుచోట్లా గెలిచారు. అయితే చివరకు పార్లమెంటు సభ్యత్వాన్నే ఉంచుకున్నారు. రంగారావుతో పాటు కరీంనగర్లో బద్దం ఎల్లారెడ్డి, ఖమ్మంలో టీవీ విఠల్ రావు, మెదక్ లో ఎన్ఎమ్ జయసూర్య, నల్గొండలో రావి నారాయణరెడ్డి, నల్గొండ(ఎస్సీ)సుంకం అచ్చాలు, మహారాష్ట్రలో ఉన్న భీర్ నుండి రామ్ చందర్ గోవింద్ పరాంజపే కూడా ఎంపీలుగా గెలిచారు.

పార్లమెంటు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీడీఎప్ 36 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్ 38 సీట్ల గెలవగా, సోషలిస్టు పార్టీ కూడా 11 సీట్లలో గెలిచింది. ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఏడు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. పీడీఎఫ్ కన్నా రెండు సీట్లు ఎక్కువగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ 38 సీట్లతో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్ధిగా షాద్ నగర్ నియోజకవర్గంలో గెలిచిన బూర్గుల రామకృష్ణారావు మొదటి ముఖ్యమంత్రయ్యారు. అప్పట్లో పీడీఎఫ్ ఎంత బలంగా ఉండేదంటే నల్గొండలోని 14 సీట్లను పీడీఎప్ఫే గెలిచింది. అంతటి ప్రాబల్యం కలిగున్న సీపీఐ, సీపీఎంలు కాలక్రమంలో ప్రాభవాన్ని కోల్పోయాయి. 1960, 70 దశకంలో కూడా కమ్యూనిస్టులు బలంగానే ఉండేవారు.

కమ్యూనిస్టులకు ఏమైంది ?

1982లో ఎన్టీయార్ ఏర్పాటుచేసిన తెలుగుదేశం పార్టీతో పొట్టుపెట్టుకున్నాయి. అప్పటినుండి తమ సొంతబలాన్ని కోల్పోవటం మొదలైంది. ఒకసారి టీడీపీతోను మరోసారి కాంగ్రెస్ తోను పొత్తులో పోటీచేస్తున్నాయి. నల్గొండ, ఖమ్మంలో ఎంతో బలంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు చివరకు కాంగ్రెస్, టీడీపీ తర్వాత బీఆర్ఎస్ కు తోకపార్టీలుగా మారిపోయి అస్తిత్వాన్నే కోల్పోయాయి. ఇప్పటి కమ్యూనిస్టుల పరిస్ధితి ఏమిటంటే సీపీఎం పార్లమెంటు, అసెంబ్లీలో ప్రాతినిధ్యమే కోల్పోయింది. కాంగ్రెస్ తో పొత్తు కారణంగా సీపీఐ కొత్తగూడెం అసెంబ్లీలో గెలిచింది. కొంతకాలానికి కమ్యూనిస్టు పార్టీలు అసలు ఉనికి కోల్పోయినా ఆశ్చరపోవక్కర్లేదు.

 

Tags:    

Similar News