బీజేపీతో కాంప్రమైజ్..! కేసీఆర్, రేవంత్ రెడ్డిలలో ఎవరు ?

తెలంగాణలో కాంప్రమైజ్ రాజకీయాల వేడి పెరిగిపోతోంది. అధికార ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు కాంప్రమైజ్ రాజకీయ ఆరోపణలు గుప్పించుకున్నారు.

Update: 2024-04-17 07:02 GMT
Source: Twitter

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధానంగా మూడు పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావడంతో, ఆ ప్రభుత్వంపై అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ విరుచుకు పడుతున్నాయి. బీఆర్ఎస్ ముఖ్యనాయకులు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీజేపీతో కాంప్రమైజ్ అయ్యారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరుతారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా రేవంత్ ప్రభుత్వం ఏడాదిలోపు పడిపోతుందని ఏకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. సంగారెడ్డి ప్రాంతంలోని సుల్తాన్ పూర్‌లో జరిగిన బహిరంగసభలో వ్యాఖ్యానించారు.

ఇక ఆ పార్టీ నాయకుడు కేటీఆర్ కూడా రేవంత్‌రెడ్డి.. బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి 30 మంది ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీలో చేరతారని ఆరోపిస్తున్నారు. తాను ఎన్నిసార్లు ఈ ఆరోపణ చేసినా రేవంత్‌ మౌనం వహించడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. ఈ క్రమంలోనే మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌ స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను పోటీకి దించి బీజేపీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్‌ అభ్యర్థుల ఎంపికలో జాప్యం వెనుక కూడా బీజేపీ ఉందని ఆరోపిస్తున్నారు.

మరోవైపు బీజేపీ శాసనసబాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో ఏక్‌నాథ్ షిండేలు తయారయ్యారని, రేవంత్ ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగలేడని ఆరోపిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. నారాయణపేటలో నిర్వహించిన జన జాతర సభలో కేసీఆర్‌పై సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితను కాపాడుకునేందుకు మోదీతో కేసీఆర్ కుమ్మక్యయ్యారని, అందులో భాగంగానే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సహకరించబోతున్నారని ఆరోపించారు. ఈమేరకు ఒప్పందం కుదిరిందని, కాంగ్రెస్‌ సర్కార్‌ను కూల్చేందుకు బీజేపీతో కలిసి కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

జైలుపాలైన కూతురును కాపాడుకునేందుకు బీజేపీతో జతకట్టారని ఆరోపించారు. బిడ్డ కోసం ప్రధాని నుంచి సుపారీ తీసుకున్నారని అన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఐదు లోక్‌సభ స్థానాల్లో బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. చేవెళ్ల, మల్కాజ్‌గిరి, జహీరాబాద్, మహబూబ్‌నగర్, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను పోటీకి పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పడగొట్టేందుకు కేసీఆర్‌, నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

 

ప్రభుత్వం పడిపోతుందని..

ఇక లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రేవంత్‌ సర్కార్‌ పడిపోతుందని బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు పేర్కొంటున్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి కూడా లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లోని ఏక్‌నాథ్‌షిండేలు ఆ పార్టీని చీలుస్తారని ఆరోపించారు. ఇద్దరు ముగ్గురు షిండేలు ఉన్నారని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి టార్గెట్‌గా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో కాంప్రమైజ్ రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కింది. ఒకవైపు ఎన్నికల ప్రచారం, మరోవైపు కుమ్మకు ఆరోపణలు చర్చనీయాంశమవుతున్నాయి.

ఇంతకీ ఎవరు కాంప్రమైజ్ అయ్యారనేది భవిష్యత్తే నిర్ణయిస్తుందని, కేసీఆర్ తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తాడని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ చెప్పారు. ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డికి ఆ అవసరం ఏముంటుందని, బీజేపీలో చేరితే ప్రధాన మంత్రిని చేస్తారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన సజావుగానే కొనసాగుతున్నదని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే, డైవర్ట్, కాంప్రమైజ్ పాలిట్రిక్స్ చేస్తున్నారని ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అభిప్రాయపడ్డారు.

క్యాడర్‌ను కాపాడుకోవడం కోసమే రేవంత్ ప్రభుత్వంపై కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారని ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో 49 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడని, ఆయన తరహాలో అందరూ ఉంటారని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరు బీజేపీతో కాంప్రమైజ్ అయ్యారనే అంశాన్ని పరిశీలిస్తే.. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు, మంత్రులను అరెస్టులు చేసిన దాఖలాలు ఉన్నాయని, తెలంగాణలో మాత్రం ఎందుకు జరగలేదో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కాళేశ్వరంపై ప్రధాన మంత్రితో పాటు కేంద్ర మంత్రులు తీవ్ర ఆరోపణలు చేసి వెళ్ళారే తప్ప, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని అన్నారు. ఈ కోణంలో చూస్తే ఎవరు బీజేపీతో కాంప్రమైజ్ అయ్యారో స్పష్టం చెయ్యొచ్చని ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News