KTR | రాఖీ పండగ వేళ ఢిల్లీలో కూర్చున్న కేటీఆర్..!

కేటీఆర్ ఢిల్లీ టూర్ వెనక మర్మం ఏంటి..?;

Update: 2025-08-09 11:22 GMT

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రస్తుతం ఢిల్లీ(Delhi)లో ఉన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు చేయడం కోసం కేటీఆర్.. హస్తినకు వెళ్లారు. కానీ రాఖీ(Rakhi) పండగ రోజున ఆయన ఢిల్లీలో ఉండటం ఇప్పుడు కీలకంగా మారింది. ఉన్నపళంగా కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? ఎమ్మెల్సీలపై పిటిషన్ దాఖలు చేయడానికి హరీష్ రావు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి ఉన్నారు. మరి వెనకాతిలే కేటీఆర్ కూడా పండగ రోజుకు ఢిల్లీకి ఎందుకు జంప్ అయిపోయారు? అనేది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అయితే ప్రత్యర్థి పార్టీల విమర్శల నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్.. హస్తినకు వాదన బలంగా వినిపిస్తోంది.

కవితే కారణమా..

కొంత కాలంగా కల్వకుంట్ల కుటుంబంలో అంతర్గత వివాదం కొనసాగుతోంది. కేసీఆర్‌కు కవిత లేఖ రాయడంతో వారి కుటుంబ కలహం రచ్చకెక్కింది. ఆ తర్వాత నుంచి బహిరంగంగానే విమర్శలు చేసుకోవడం షురూ చేశారు. ఆ తర్వాత పదవులో, అధికారం విషయంలో కవితకు, కేటీఆర్‌కు చెడింది అన్న అంశం స్పష్టమైంది. అయితే ఇప్పుడు రాఖీ పండగ నేపథ్యంలో కవిత.. కేటీఆర్‌కు రాఖీ కట్టాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది వాళ్లు ఎంతో అన్యోయంగా ఈ పండగను జరుపుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎప్పటిలా లేవు.. ఇద్దరి మధ్య ఒక వివాదం ఉంది. ఇప్పుడు కేటీఆర్‌కు కవిత రాఖీ కడతారో లేదో తెలీదు. అదే విధంగా కవిత చేత కేటీఆర్ రాఖీ కట్టించుకుంటారో లేదో కూడా తెలీదు. ఈ కారణంతోనే కేటీఆర్.. ఢిల్లీకి వెళ్లిపోయారన్న చర్చ జరుగుతోంది.

ప్రత్యర్థుల దెప్పిపోట్ల నుంచి తప్పించుకోవడమేనా..

ఒకవేళ కేటీఆర్.. తెలంగాణలోనే ఉండి.. కవిత ఆయనకు రాఖీ కట్టకపోతే దానిని రాజకీయ ప్రత్యర్థులు పెద్ద రాద్దాంతంలా మారుస్తారు. వారి దెప్పిపొడుపుల నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీ టూర్‌కు వెళ్లారన్న చర్చ కూడా వినిపిస్తోంది. అదే ఇప్పడు ఢిల్లీలో ఉంటే.. తనకు కుటుంబం కన్నా.. పార్టీ, ప్రజల సంక్షేమం, పార్టీపై ప్రజల నమ్మకమే ముఖ్యమని చెప్పే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా ఇటు కవిత కూడా.. అన్న తన బాధ్యతల నిర్వహణలో బిజీగా ఉండటం వల్లే తాను కట్టలేకపోయానని చెప్పుకునే అవకాశం ఉంటుందని విశ్లేషకులు కొందరు చెప్తున్నారు.

ఇరకాటంలో కవిత..

అయితే ఇప్పుడు అసలు ఇరకాటంలో పడేది కవితేనని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ అసలు అంశం రాఖీ కట్టడం, కట్టకపోవడం కాదని, కల్వకుంట్ల కుటుంబ కలహంలో ఎవరు దూరం పాటిస్తున్నారు అనేదని కొందరు చెప్తున్నారు. ఒకవేళ ఇప్పుడు కేటీఆర్ తిరిగి వచ్చిన తర్వాత కూడా కవిత.. రాఖీ కట్టడానికి వెళ్లకపోతే ఆమే దూరం పాటిస్తుందన్న ధోరణి ప్రజల్లోకి వెళ్తుంది. అదే జరిగితే ప్రస్తుతం జాగృతితో ఆమె చేస్తున్న కార్యక్రమాలకు, చేయబోయే కార్యక్రమాలకు ప్రజాదరణ సన్నగిల్లుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా కేటీఆర్‌దే పైచేయి అవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి కేటీఆర్.. ఢిల్లీ టూర్‌ కవితకు చెక్ చెప్పడానికేనని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.

టైమ్ సమస్యే కాదు..

ఇక్కడ రాఖీ కట్టే విషయంలో సమయం అనేది కవిత, కేటీఆర్‌కు సమస్యే కాదు. ఎందుకంటే గతేడాది 2024లో రాఖీ పండగ ఆగస్టు 19న వచ్చింది. కానీ ఆ సమయంలో కవిత.. లిక్కర్ స్కాం కేసులో జైలులో ఉన్నారు. దాంతో బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత అంటే 27 ఆగస్టు 2024 తర్వాత కవిత.. తన సోదరుడు కేటీఆర్‌కు రాఖీ కట్టారు. ఇప్పుడు కూడా కేటీఆర్ తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని తిరిగి వచ్చాక కవిత రాఖీ కట్టొచ్చు అని, కానీ ప్రస్తుతం కుటుంబ కలహం క్రమంలో కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలని విశ్లేషకులు చెప్తున్నారు.

అసలు కేటీఆర్.. ఢిల్లీ ఎందుకెల్లారంటే..

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. ఇటీవల ఈ అంశంలో మూడు నెలల్లో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్‌కు సుప్రీంకోర్టు సూచించింది. ఇప్పుడు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ తరుపున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలపైన కూడా న్యాయపోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమయింది. ఇందులో భాగంగానే ఫిరాయింపు ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి కేటీఆర్ తన లీగల్ సెల్ టీమ్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలను కూడా అనర్హులుగా ప్రకటించాలని కేటీఆర్ తన పిటిషన్‌లో కోరనున్నారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఆరుగురు ఎమ్మెల్సీలు.. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, దండె విఠల్, భాను ప్రసాద్‌రావు, ఎం ఎస్ ప్రభాకర్‌రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Tags:    

Similar News