ఎంఎల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఆశాభంగం తప్పదా ?
వచ్చేనెలలో జరగబోయే హైదరాబాద్ జిల్లా స్ధానికసంస్ధల ఎంఎల్సీ కోటా ఎన్నికలో బీఆర్ఎస్ కు గెలుపు అవకాశం లేదు;
వచ్చేనెలలో జరగబోయే హైదరాబాద్ జిల్లా స్ధానికసంస్ధల ఎంఎల్సీ కోటా ఎన్నికలో బీఆర్ఎస్ కు గెలుపు అవకాశం లేదు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వేరు హైదరాబాద్(Hyderabad) జిల్లా పరిధి వేరు కాబట్టే. నిజానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పరిధిని తీసుకున్నా బీఆర్ఎస్(BRS) కు గెలుపు అవకాశాలు లేదనే చెప్పాలి. కాకపోతే బీఆర్ఎస్ పోటీచేస్తే గట్టిపోటీ ఇచ్చే అవకాశం మాత్రం ఉండేది. ఇపుడు విషయం ఏమిటంటే హైదరాబాద్ జిల్లా పరిధిలో స్ధానికసంస్ధల ఎంఎల్సీ అంటే హైదరాబాద్ నగరం అనే అర్ధం. జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉన్నప్పటికీ హైదరాబాద్ నగరం పరిధిని మాత్రమే తీసుకుంటే డివిజన్ల సంఖ్య 84 మాత్రమే. ఇందులో కూడా ప్రస్తుతం 4 డివిజన్లు ఖాళీగా ఉన్నాయి. కాబట్టి 80 మంది కార్పొరేటర్లు, నగరంలోని ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలు మాత్రమే ఓటర్లు. జీహెచ్ఎంసీ పరిధిని తీసుకుంటే రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని ప్రాంతాలు కూడా కొంత కవర్ అవుతాయి కాబట్టి బీఆర్ఎస్ బలండి ఉండేది.
ఎర్రగడ్డ, మొహిదీపట్నం కార్పొరేటర్లు చనిపోయారు. ఉపఎన్నికలు నిర్వహించకపోవటంతో ఈ డివిజన్లకు కార్పొరేటర్లు లేరు. అలాగే నాంపల్లి కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్, బహదూర్ పుర కార్పొరేటర్ మొబిన్ ఎంఐఎం తరపున ఎంఎల్ఏలుగా గెలిచారు. అందుకని కార్పొరేటర్ పదవులకు రాజీనామా చేశారు. వీటికి కూడా ఉపఎన్నికలు జరగకపోవటంతో ఇవికూడా ఖాళీగానే ఉన్నాయి. 80 మంది కార్పొరేటర్లు కాకుండా ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదుచేసుకున్న నగరంలోని ఎంఎల్ఏలు, లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు 21 మంది ఉన్నారు. 15 మంది ఎంఎల్ఏలు, ఇద్దరు లోక్ సభ, నలుగురు రాజ్యసభ ఎంపీలు, నలుగురు ఎంఎల్సీలున్నారు. ఈ లెక్కన తీసుకుంటే ఓటర్లసంఖ్య సుమారుగా 115. ఈమధ్యనే ఎంఎల్ఏ కోటాలో ఎంఎల్సీలైన ఐదుగురున్నారు. వీళ్ళెక్కడ తమ ఓటుహక్కును నమోదుచేసుకుంటారో తెలీదు. అందుకనే హైదరాబాద్ జిల్లాలో ఓటర్లసంఖ్య సుమారు 115 అని చెప్పింది.
పార్టీల వారీగా చూసుకుంటే బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి. ఎంఐఎం(AIMIM)కు 42 మంది కార్పొరేటర్లున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులు 10 మంది ఉన్నారు. బీఆర్ఎస్ కు 14 మంది కార్పొరేటర్లున్నారు. 5మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. బీజేపీ(BJP)కి 19 మంది కార్పొరేటర్లు, 2 ఎక్స్ అఫీషియో ఓట్లున్నాయి. కాంగ్రెస్(Congress) కు 5 మంది కార్పొరేటర్లు, 6 మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. ఇపుడు కాంగ్రెస్, ఎంఐఎం మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. కాబట్టి రెండుపార్టీలకు కలిపి 47 మంది కార్పొరేటర్లు, 16 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లున్నట్లు లెక్క. అంటే ఇప్పటిలెక్కల ప్రకారం 115 ఓట్లలో రెండుపార్టీలకు కలిపి 63 ఓట్లున్నాయి. బీఆర్ఎస్ కు ఉన్నది 19 ఓట్లుమాత్రమే. ఈ 19 ఓట్లతో బీఆర్ఎస్ పోటీచేయటానికి కూడా సాహసించదు. పోటీచేస్తే గెలుస్తామని నేతలు గట్టిగా చెప్పిన మెదక్-కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీచేయటానికే బీఆర్ఎస్ వెనకాడింది. అలాంటిది గెలుపు అవకాశాలు లేని హైదరాబద్ జిల్లా ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీచేస్తుందనే నమ్మకం ఎవరిలోను లేదు.
ఎన్నికల షెడ్యూల్
మార్చి 28వ తేదీన ఎంఎల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అవుతుంది. నామినేషన్ కు ఆఖరుతేదీ ఏప్రిల్ 4. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 7. నామినేషన్ల ఉపసంహరణ ఏప్రిల్ 9. పోలింగ్ ఏప్రిల్ 23వ తేదీ. ఓట్ల కౌంటింగ్ ఏప్రిల్ 25వ తేదీ.
ఎవరికి అవకాశం ?
హైదరాబాద్ జిల్లా స్ధానికసంస్ధల ఎంఎల్సీ ఎన్నిక ఎంఐఎం ఖాతాలో పడే అవకాశం ఉంది. ఈమధ్యనే జరిగిన ఎంఎల్ఏల కోటా ఎంఎల్సీ ఎన్నికలో ఒకస్ధానం ఎంఐఎంకు దక్కాల్సుంది. అయితే అప్పుడు పార్టీలోని ఒత్తిళ్ళ వల్ల మూడుసీట్లను కాంగ్రెస్ తీసుకుని ఒకటి సీపీఐకి కేటాయించింది. వచ్చేనెలలో జరగబోయే స్ధానికసంస్ధల ఎంఎల్సీ ఎన్నికలో పోటీ అవకాశం ఎంఐఎంకు ఇస్తామని అప్పట్లో రేవంత్(Revanth) హామీ ఇచ్చాడు. ఆ హమీప్రకారం రాబోయే సీటును ఎంఐఎంకు కాంగ్రెస్ వదిలేసే అవకాశముంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటిస్తే ఎంఐఎం అభ్యర్ధి ఎంఎల్సీ అయిపోయినట్లే అనుకోవాలి.