ఉత్తర్‌ప్రదేశ్: 160 మంది లక్నో కార్పొరేషన్ సిబ్బంది అదృశ్యం
అక్రమ చొరబాటుదారులపై సీఎం యోగి కొరడా; ఇళ్లు, వ్యాపార సంస్థల్లో సరైన నివాస ధృవీకరణ పత్రాలు లేని వ్యక్తులను పనిలో పెట్టుకోవద్దని ప్రజలకు లేఖ..
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్(Utter Pradesh) రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (S.I.R) కొనసాగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అక్రమ చొరబాటుదారులకు, బంగ్లాదేశీయులకు (Illegal Bangladeshis) వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో లక్నో మున్సిపల్ కార్పొరేషన్‌లోని 160 మంది కాంట్రాక్టు కార్మికులు(Contract workers) అదృశ్యమయ్యారు. వీరిలో కొంతమంది పారిశుధ్య కార్మికులు కాగా.. మిగతా వారు చెత్తను తీసుకుళ్లే వాహనాల డ్రైవర్లు. వీరంతా లక్నో స్వచ్ఛతా అభియాన్ (LSA), లయన్ ఎన్విరో వంటి ఏజెన్సీల ద్వారా పనిలో చేరిపోయారు.
ఏజెన్సీలపై విచారణ..
లక్నో మేయర్ సుష్మా ఖర్వాల్ సూచనతో రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తోన్న బంగ్లాదేశీయులు, చొరబాటుదారులను బహిష్కరించడానికి పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. అందులో భాగంగా తమ ఆధార్ కార్డులను సమర్పించాలని అడగడంతో వారు విధులకు రాకపోగా, వారి సెల్‌ఫోన్లు కూడా స్విచ్ఛాప్ అయ్యాయి. అనుమానంతో ఉద్యోగ సమయంలో వారు సమర్పించిన ఆధార్ కార్డులను పరిశీలించారు. అవి అస్సాంలో తయారయినవని తేలింది. దీంతో వీరిని నియమించిన ఏజెన్సీలపై విచారణ జరుగుతోంది.
‘కఠిన చర్యలు..’
రాష్ట్రం మొత్తం మీద ఇలా కనిపించకుడాపోయిన పారిశుధ్య కార్మికులు 500 కంటే ఎక్కువగా ఉండొచ్చని మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అందుతున్న సమాచారం. లక్నో మేయర్ సుష్మా ఖర్వాల్ ది ఫెడరల్ దేశ్‌తో మాట్లాడుతూ అదృశ్యమైన కార్మికులంతా తిరిగి అస్సాంకు వెళ్లిపోయి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. అయితే సరైన కారణం లేకుండా విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సీఎం ప్రజలకు బహిరంగ లేఖ..
సీఎం యోగి రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఇళ్లు, వ్యాపార సంస్థల్లో సరైన నివాస ధృవీకరణ పత్రాలు లేని వ్యక్తులను పనిలో పెట్టుకోవద్దని కోరారు. యోగి లేఖ తర్వాత యూపీలోని ప్రతి నగరంలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడం బాగా పెరిగింది.