సినీనటుడు షాయాజీ షిండే రాజకీయ ఆరంగేట్రం, ఎన్సీపీలో చేరిక
మహారాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరుగునున్న తరుణంలో ప్రముఖ సినీనటుడు షాయాజీ షిండే రాజకీయ ఆరంగేట్రం చేశారు.
By : The Federal
Update: 2024-10-11 16:41 GMT
సరిగ్గా 48 గంటల కిందట తోటి నటుడు, ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసి అనేక సూచనలు చేసి వెళ్లిన నటుడు షాయాజీ షిండే సంచలనం సృష్టించారు. ఇప్పటి వరకు తెరపైన్నే రాజకీయ నాయకుని వేషం వేసిన షిండే ఇకపై రియల్ స్టేజీపై నాయకునిగా మారనున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. అజిత్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చేరారు. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఆయన ఎన్‌సీపీలో చేరి సంచలనం సృష్టించారు. మహారాష్ట్ర టైగర్ శరద్ పవార్ పార్టీలో కాకుండా ఆయన సమీపబంధువైన అజిత్ పవార్ పార్టీ ఎన్‌సీపీలో షిండే చేరడం విశేషం.
సుదీర్ఘ కాలంగా సామాజిక కార్యక్రమాలు చేస్తున్న షిండే ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి చేరామన్నారు. తన సామాజిక సేవ కొనసాగుతుందన్నారు. అజిత్ పవార్‌పై పార్టీ సిద్ధాంతాలు తనను ఆకర్షించడం వల్లే ఎన్‌సీపీలో చేరినట్టు చెప్పారు.
'రాజకీయ నాయకునిగా చాలా సినిమాల్లో నటించాను. అయితే ఇంతవరకు రాజకీయనేతను కాలేకపోయాను. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది. నేను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలే నన్ను ఆలోచింప చేశాయి. రాజకీయాల్లోకి అడుగుపెడితే మరింత మంచి సేవ చేయవచ్చని అనిపించింది. ఆ కారణంగానే రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లోకి రావడం వెనుక నాకు ఎలాంటి స్వార్ధం లేదు' అని షిండే చెప్పారు. ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎన్‌సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారా లేక పార్టీ ప్రచార కార్యకర్తగా ఉంటారా అనేది మున్ముందు తేలనుంది. పవన్ కల్యాణ్ తో చర్చించినట్టే మొక్కలు నాటే కార్యక్రమం గురించి పవార్‌తో చర్చించిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.
ఎవరీ షిండే...
మహారాష్ట్రలోని ఓ రైతు కుటుంబం వచ్చిన షిండే సినిమాలలో బాగా రాణించారు. చదువుకుంటూనే రాష్ట్ర నీటిపారుదల శాఖలో కొన్నాళ్లపాటు వాచ్‌మెన్‌గా పని చేశారు. ఆ సమయంలోనే ఆయనకు నటనపై ఆసక్తి ఏర్పడింది. 1978లో మరాఠీ నాటకాలతో తన కెరీర్‌ను ప్రారంభించారు. 1995లో మరాఠీ చిత్రంతో తెరంగేట్రం చేశారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, భోజ్‌పురి, ఇంగ్లిష్‌లోనూ ఆయన నటించారు. ఠాగూర్’, ‘అతడు’, ‘పోకిరి’ వంటి అనేక తెలుగు హిట్ సినిమాలలో ఆయన విభిన్నమైన పాత్రలు పోషించారు. తెలుగు వారికి సుపరిచితమయ్యారు. షిండే కీలక పాత్ర పోషించిన తాజా చిత్రం ‘మా నాన్న సూపర్‌హీరో’ శుక్రవారం విడుదలైంది.
స్వాగతించిన పవన్ కల్యాణ్
ఆలయాల్లో ప్రసాదంతో పాటు భక్తులకు ఒక మొక్కను కూడా ఇవ్వాలంటూ షిండే చేసిన సూచనను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతించారు. తన మాతృమూర్తి జ్ఞాపకంగా మహారాష్ట్రలోని మూడు ఆలయాల్లో ఆ విధానాన్ని అనుసరిస్తున్నట్టు షిండే ఓ కార్యక్రమంలో చెప్పారు. చెట్లు, అవి అందించే ఫలాలు చూస్తే తన తల్లి గుర్తుకొస్తుందన్నారు. షిండే రాజకీయాల్లో చేరడాన్ని పవన్ కల్యాణ్ స్వాగతించారు.