పూజా ఖేడ్కర్ IAS సెలెక్షన్‌‌ను రద్దు చేసిన యూపీఎస్సీ

వివాదాస్పద ఐఎఎస్ అధికారి పూజా ఖేడ్కర్ యూపీఎస్సీ అభ్యర్థిత్వం రద్దయింది. ఈ మేరకు తమ ఉత్తర్వులను రెండు రోజుల్లో పంపుతామని కమిషన్ కోర్టుకు తెలిపింది.

Update: 2024-08-07 10:39 GMT

వివాదాస్పద ఐఎఎస్ అధికారి పూజా ఖేడ్కర్ యూపీఎస్సీ అభ్యర్థిత్వం రద్దయింది. ఈ మేరకు తమ ఉత్తర్వులను రెండు రోజుల్లో పంపుతామని బుధవారం ఢిల్లీ హైకోర్టుకు యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ తెలిపింది. అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారన్న ఆరోపణలను పూజా ఖేడ్కర్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

అయితే అభ్యర్థిత్వ రద్దు ఉత్తర్వులు తన క్లయింట్ ఖేడ్కర్ కు ఇంకా అందలేదని ఆమె తరఫు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ తెలిపారు. పత్రికా ప్రకటన ద్వారానే దాని గురించి తనకు తెలిసిందని చెప్పారు. కాగా తమ ఉత్తర్వులను కమిషన్ రెండు రోజుల్లో ఖేడ్కర్ ఈ మెయిల్‌తో పాటు చివరిగా ఆమె ఇచ్చిన అడ్రస్సుకు పంపుతామని UPSC తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది నరేష్ కౌశిక్ తెలిపారు.

పుణెలో ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్ పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్‌ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ జులై 23లోగా ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. అయితే ఆమె అక్కడ రిపోర్టు చేయలేదు. తప్పుడు ఓబీసీ సర్టిఫికేట్ సమర్పించడం, అర్హత లేకున్నా దివ్యాంగుల కోటాలో సీటు సంపాదించడంపై కోర్టులో విచారణ సాగుతోంది.



Tags:    

Similar News