వైబ్రంట్ గుజరాత్: టాటా గ్రూప్ భారీ పెట్టుబడులు
దేశంలో మైక్రోచిప్ తయారీ పరిశ్రమలను తీసుకురావాలని సంకల్పించిన గుజరాత్, కేంద్ర ప్రభుత్వాలు అందుకు తగిన వేదికగా వైబ్రంట్ గుజరాత్ ను వాడుకున్నాయి.
వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10 వ ఎడిషన్ లో భాగంగా రెండో రోజు మొత్తం సెమీకండక్టర్ పరిశ్రమ పెట్టుబడుల ప్రకటనలకు వేదికగా మారింది.‘ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్’ లో భారీ సెమీ కండక్టర్ పరిశ్రమను స్థాపిస్తామని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. "ప్రభుత్వంతో జరుపుతున్నచర్చలు ముగింపు దశకు చేరుకున్నాయి, 2024 మధ్య కల్లా అన్ని పనులను ప్రారంభిస్తాం" అని ఆయన ప్రకటించారు.
టాటా గ్రూప్ ప్రకటన రావడానికంటే ముందు అమెరికా చిప్ మేకర్ ‘మైక్రోన్’, దక్షిణ కొరియాకు చెందిన ‘సిమ్ టెక్’కూడా గుజరాత్ లో సెమీ కండక్టర్ పరిశ్రమ ను నెలకొల్పుతామని ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. అహ్మదాబాద్ సమీపంలోని సనంద్ ఇండస్ట్రీయల్ కారిడార్ లో ఈ పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి.
సిమ్ టెక్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సెమీ కండక్టర్ ఉప ఉత్పత్తుల తయారీదారు. సెమీకండక్టర్ తయారీకి అవసరమైన కీలక పరికరాలను అందజేస్తుంది. ఇది ప్రస్తుతం గుజరాత్ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. అనంతరం సిమ్ టెక్ గ్లోబల్ సీఈఓ జెఫ్రీ చున్ మాట్లాడారు.
" చైనా, మలేషియాలో మైక్రోన్ ఉన్న ప్రాంతాల్లో మేము పెట్టిన పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇచ్చాయి. ఇప్పుడు భారత్ లో కూడా అలాగే విజయవంతం అవుతాం" అని ఆశాభావం వ్యక్తం చేశారు. " మైక్రోన్ సెమీకండక్టర్ పరిశ్రమకు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది" అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విన్ వైష్ణవ్ మాట్లాడుతూ" సిమ్ టెక్ ప్లాంట్ లో దాదాపు రూ. 1250 కోట్లను పెట్డుబడి పెడుతోంది" అని చెప్పారు.
మైక్రాన్ కంపెనీ దేశంలో తన ప్లాంట్ కోసం ఇప్పటికే 200 మంది ఉద్యోగులను నియమించుకుంది. అలాగే దేశంలో సెమీకండక్టర్ ఇండస్ట్రీకి అవసరమైన ప్రతిభకు సానబెట్టడానికి ‘నామ్ టెక్ ’ కూడా ఎంఓయూ కుదుర్చుకుంది. 2025 మధ్య భాగం కల్లా దేశంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లను చేసుకుంటోంది.
గుజరాత్ నుంచి తొలి మేకిన్ ఇండియా చిప్
"2024 పూర్తి అయ్యే వరకు దేశంలోనే తొలి సెమీ కండక్టర్ చిప్ ను గుజరాత్ నుంచి అందించాలనే లక్ష్యం పెట్టుకున్నాం" కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఐఐటీ గాంధీనగర్ సెమీ కండక్టర్ల పరిశోధన అభివృద్ధి కోసం ఎక్స్ లెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.
" గత ఏడాది అక్టోబర్ నాటికి 760 బిలియన్ల విలువైన సెమీకండక్టర్, డిస్ ప్లే తయారీ పథకానికి బిడ్లను ఆహ్వనించాం. వాటి కింద 45 దరఖాస్తులు వచ్చాయి. అందులో సెమీ కండక్టర్ ఫ్యాబ్ ల ఏర్పాటు కోసం ఐదు దరఖాస్తులు, డిస్ ప్లే ఫ్యాబ్ ల కోసం రెండు, ఏటీఎంపీ కోసం తొమ్మిది, డిజైన్ లింక్డ్ ప్రోత్సాహకాల కోసం 29 అభ్యర్థనలు వచ్చాయి" అని కేంద్ర ఐటీ మంత్రి చెప్పారు.
ఎదురు దెబ్బలు తిన్నా కూడా..
ప్రస్తుత ప్రపంచం మొత్తం కూడా సెమీకండక్టర్ల పైనే ఆధారపడి ఉంది. అయితే వీటిక ప్రధాన ఆధారం తైవానే. అయితే తైవాన్ ను చైనా ఆక్రమించడానికి ప్రయత్నాలు చేస్తే వాటి సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోనే సెమీకండక్టర్ల ఉత్పత్తిని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే సెమీకండక్టర్ల రంగంలో ఆయన తీసుకున్న పాలసీ ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదని చెప్పవచ్చు. 2021 లో పది బిలియన్ల ప్రోత్సాహకాలు ప్రకటించింది. అయితే ప్రాజెక్ట్ లు అనుకున్నంత వేగంగా జరగలేదని ప్రముఖ తైవాన్ కంపెనీ ఫాక్స్ కాన్ - వేదాంత ఆధ్వర్యంలో రావాల్సిన జాయింట్ వెంచర్ కూడా రద్దయింది. దీంతో గుజరాత్ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో సెమీకండక్టర్ పరిశ్రమ తీసుకురావాలని సంకల్పించింది.
గుజరాత్ ప్రయత్నాలు
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీల అధినేతలతో మాట్లాడారు. కొంతమంది అధికారులను జపాన్ కు సైతం పంపారు. " మేము జపాన్, దక్షిణ కొరియా, యూఎస్ లోని సెమీ కండక్టర్ల ప్రతినిధులతో మాట్లాడాము. ఆయా కంపెనీలతో పెట్టుబడిపై చర్చలు జరుపుతున్నాం. అవి కొనసాగిస్తున్నాం" అని గుజరాత్ సీఎం చెప్పారు. అయితే ఏ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారో వాటి పేర్లను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.
" వచ్చే ఐదేళ్లలో గుజరాత్ రూపొందించిన సెమీకండక్టర్ విధానం వల్ల 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం, రక్షణ, టెలీ కమ్యూనికేషన్ రంగాల్లో సెమీకండక్టర్ చిప్ ల విస్తృత వినియోగాన్ని గుర్తించాం. అందుకే ఈ పాలసీని తీసుకొచ్చాం" అని భూపేంద్ర పటేల్ చెప్పారు.
సెమీకండక్టర్ రంగంలో కొత్తపెట్టుబడులు ఆకర్షించడానికి ప్రోత్సహకాలు, రాయితీలతో కూడిన ప్రత్యేక విధానాన్ని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. ఇదీ 2027 వరకు అమలులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పాలసీనీ రూపొందించారు.
సెమీకండక్టర్, ధోలేరా సిటీ
సెమీకండక్టర్ పాలసీ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం అహ్మదాబాద్ సమీపంలోని ధొలేరా లో సెమికాన్ సిటీని ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ స్థాపించబడే పరిశ్రమలకు రాయితీలు ఇవ్వబడతాయి. తయారీ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన మొదటి 200 ఎకరాల భూమి కొనుగోలుపై 75 శాతం రాయితీని అందిస్తోంది. అలాగే 50 శాతం రాయితీలపై అదనపు భూమిని అందజేస్తున్నారు.
ఈ పాలసీ కింద అర్హత పొందిన ప్రాజెక్ట్ 10 సంవత్సరాల కాలానికి యూనిట్ కు రూ. 2 చొప్పున విద్యుత్ సబ్సీడీ, మొదటి ఐదేళ్లకు క్యూబిక్ మీటర్ నీటిని రూ. 12 రూపాయలకు అందిస్తారు. ముఖ్యమైన విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు లేదా విదేశీ స్థానాల నుంచి ఇక్కడి వచ్చే పరిశ్రమలకు అదనపు ప్రొత్సాహకాలు ఇస్తారు.