చీరాలపై ఎవరిది పైచేయి

పార్టీలకూ అంతుపట్టని చీరాల రాజకీయం, టికెట్లకోసం ప్రధాన పార్టీలపై పెరిగిన వత్తిడి

Update: 2023-12-28 01:45 GMT
Chirala Town

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చీరాల పట్టణం రాజకీయాలకు కేంద్ర బిందువు. చేనేత వస్త్ర పరిశ్రమకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న పట్టణం చీరాల. మాజీ ముఖ్యమంత్రి కె రోశయ్య ఇక్కడి నుంచి రెండు సార్లు గెలుపొందారు. మాజీ మంత్రి పాలేటి రామారావు రెండు సార్లు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ రెండు సార్లు, ప్రగడ కోటయ్య మూడు సార్లు, సజ్జా చంద్రమౌళి రెండు సార్లు, మాజీ ఎంపీ చిమటాసాంబు ఒకసారి ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. ఇప్పుడు ఇక్కడ ఏమి జరుగుతున్నది? ఈ నియోజకవర్గంపై వచ్చే ఎన్నికల్లో పార్టీల ప్రభావం ఎంత? వ్యక్తుల ప్రభావం ఎంత? ఎంత మంది స్వతంత్రులుగా పోటీలో ఉండబోతున్నారు? వారి నాయకత్వ బలం ఏమిటి? ఎందుకు స్వతంత్రులుగా ఉండాలనుకుంటున్నారు? అనే అంశాలపై ఒక సారి పరిశీలిద్దాం..

బీసీలదే తుది తీర్పు
చీరాల నియోజకవర్గం గతంలో ప్రకాశం జిల్లాలో ఉండేది. జిల్లాల విభజన తరువాత బాపట్ల జిల్లాలో కలిసింది. అయినా ప్రకాశం జిల్లా పెద్దల పెత్తనం ఈ నియోజకవర్గంపై ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడి ఓటర్ల తీర్పు విభిన్నంగా, విలక్షణంగా ఉంటుంది. నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. ఇతర కులాల ఓటర్లు కూడా ఉన్నారు. అయితే బీసీల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందో వారిదే ఎమ్మెల్యే పీఠం. ఇక్కడి నుంచి వైశ్య, కమ్మ, కాపు వర్గాలకు చెందిన వారు కూడా గెలుపొందారు.
వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌కు పెరిగిన పోటీ
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నుంచి ఏ పార్టీ వారు ఎవరిని అభ్యర్థులుగా రంగంలోకి దించుతారనేదానిపై కీలక చర్చ జరుగుతున్నది. ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరామ్‌ వైఎస్సార్‌సీపీలో ఉన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన బలరామ్‌ ఆ తరువాత వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈయన తన కుమారుడు వెంకటేష్‌కు చీరాల వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ ఎవరికి టిక్కెట్‌ ఇస్తుందనే నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు.
ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌ చీరాల నుంచి టిక్కెట్‌ ఆశిస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా టిక్కెట్‌ ఆశిస్తున్నారు. ముగ్గురిలో ఎవరికి ఇవ్వాలో వైఎస్సార్‌సీపీ ఆలోచనలో పడింది. అందుకే వీరి మధ్య పోటీ తగ్గించేందుకు ఆమంచిని పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పంపించింది.
స్వతంత్ర అభ్యర్థిగా చీరాల నుంచి ఆమంచి?
ఆమంచి పర్చూరులో ఉన్నా ఒక కన్ను చీరాలపై ఉంచారు. యాదవ సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసుకుంటున్నారు. రాత్రి సమయాల్లో ఎక్కువగా ఒక్కో సామాజికవర్గంలోని ముఖ్యులను కలిసి తనను బలపరచాల్సిందిగా కోరుతున్నారు. ఆమంచి కృష్ణమోహన్‌ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరావుతో మంచి సంబంధాలు ¯ð రపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో దగ్గుబాటి హితేష్‌ చెంచురామ్‌ను ఎన్నికల రంగంలోకి దగ్గుబాటి దించనున్నారు. ఇటీవల దగ్గుబాటి వెంకటేశ్వరావు చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్‌సీపీకి దూరంగా ఉండాలన్న భావనను వెలుబుచ్చాయి. తెలుగుదేశం పార్టీ తరపున హితేష్‌ రంగంలోకి దిగితే ఆమంచి వైఎస్సార్‌సీపీ తరపున పర్చూరు నుంచి పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. చీరాలవైపే మొగ్గు చూపుతారు. ఒక వేళ చీరాల టిక్కెట్‌ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
రంగంలోకి పాలేటి రామారావు
మాజీ మంత్రి పాలేటి రామారావు ఎన్నికల రంగంలోకి దిగనున్నారు. చీరాలలో ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. అవసరమైన సామగ్రి కూడా రెడీ చేశారు. తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌ కోసం పాలేటి ప్రయత్నిస్తున్నారు. టీడీపీ టిక్కెట్‌ను డాక్టర్‌ సజ్జా హేమలత కూడా ఆశిస్తున్నారు. పాలేటికి టీడీపీ టిక్కెట్‌ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు నిర్ణయించుకున్నారు. ఇదే జరిగితే పార్టీల కంటే పాలేటి, ఆమంచి మధ్య పోటీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులను ఓటర్లు గెలిపిస్తారా? స్వతంత్ర అభ్యర్థులకు పట్టం కడతారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మరో వాదన కూడా తెరపైకి వచ్చింది. పాలేటి రామారావు ఎన్నికల సమయంలో పోటీ చేస్తానని ముందుకు రావడం, అభ్యర్థుల మధ్య ఒప్పందాలు కుదిరిన తరువాత మానుకోవడం కూడా జరుగుతున్నది. అందువల్ల విత్‌డ్రా అయిన తర్వాతే పాలేటి గురించి ఆలోచిస్తారు.
గత ఎన్నికల్లో ఎనిమిది మంది స్వతంత్రులుగా పోటీ
గత ఎన్నికల్లో ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. ఆమంచి కృష్ణయ్య, చప్పిడి ప్రియతమ్, డివి బాబూరావు, గజవల్లి శ్రీను, కాసాని రాము, మహబూబ్‌బాషా, పి శాంతారామ్, ఎస్‌ లక్ష్మిలు ఉన్నారు. వీరే కాకుండా కాంగ్రెస్‌ నుంచి డి రంగారావు, బిఎస్‌పీ నుంచి కె ఆర్‌ వినయ్‌కుమార్, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి కె రత్నకుమార్, ప్రజాశాంతి పార్టీ నుంచి కె కృష్ణమోహనరావు, బిజేపీ నుంచి ఎం వెంకటరమణారావులు ఉన్నారు.
చిమటా సాంబు మద్దతు ఎవరికి?
చిమటా సాంబు మద్దతు ఎవరికనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. పోటీలో ఉన్న వారంతా తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఎవరికీ ఆయన ఎటువంటి హామీ ఇవ్వలేదు. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరావు మాత్రం ఇప్పటికే చిమటా సాంబును కలిసి మంతనాలు జరిపారు. దీనికి నేపథ్యం ఏమిటనేది రాజకీయ పరిశీలకులకు కూడా అంతుబట్టడం లేదు. అటు పర్చూరుతో పాటు చీరాలపై కూడా దగ్గుబాటి ఒక కన్ను వేశారా? అనేది కూడా అర్థం కాకుండా ఉంది.
Tags:    

Similar News