ఎలక్షన్ బాండ్లపై సుప్రీంకోర్టులో కేసు వేసిన ఈ మహిళ ఎవరు?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్న ఎలక్టోరల్ బాండ్లపై కేసు వేసి తీర్పు రాబట్టిన ఈ మహిళ ఎవరు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఎలక్ట్రోరల్ బాండ్స్. సామాన్యుడి మొదలు మేధావుల వరకు, చోటా మోటా నాయకుల మొదలు దేశ ప్రధాని వరకు అందరి నోటా ఎలక్షన్ బాండ్స్ మాట వినబడుతోంది. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- ఎస్బీఐ-ని కూడా బాగానే తలంటింది. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు ఎలక్టోరల్ బాండ్స్ ను ఎస్బీఐ విడుదల చేసింది. ఎన్నికల్లో అవినీతిని అరికట్టడం వీటి ఉద్దేశం. ఎస్బీఐ విడుదల చేసిన బాండ్లను డబ్బులున్న వాళ్లు కొని తనకు నచ్చిన పార్టీకి ఇస్తారు. వాటిని ఆయా పార్టీలు తమకు అవసరమైనప్పుడు వాటిని బ్యాంకులో ఇచ్చి డబ్బు తీసుకుంటాయి. కొనే వాళ్ల పేర్లు, తీసుకునే వాళ్ల పేర్లను ఇప్పటి వరకు మూడో కంటికి తెలియకుండా ఉంచారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాల్సిన పనేముందని పలువురు ప్రశ్నించారు. అలా ఉంచాల్సిన పని లేదని కూడా ఎన్నికల సంఘం చెప్పింది. అయినా కూడా ఎస్బీఐ వద్ద ఎలక్ట్రోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వ్యక్తులు, సంస్థలు, ఇతర వ్యాపార సంస్థల పేర్లను చెప్పడానికి ఎస్బీఐ ససేమిరా అని మొరాయించింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ కి చెందిన కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్ సుప్రీంకోర్టులో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు వేశారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్స్ రిఫార్మ్స్ (ఏడీఆర్), సీపీఎం కూడా ఈ కేసులో భాగస్వామ్యపక్షాలుగా ఉన్నాయి. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు 2024 మార్చిలో చరిత్రాత్మక తీర్పును ఇచ్చింది. బాండ్లు కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాల్సిందేనని ఆదేశించింది. ఇప్పుడు దీనిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఆమె తరఫున సుప్రీంకోర్టులో వరుణ్ ఠాకూర్ వాదించారు.
ఇంతకీ ఎవరీ జయా ఠాకూర్..
మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా బంద ప్రాంతానికి చెందిన వారు ఈ జయ. మంచి విద్యావంతురాలు. డాక్టర్ కూడా. ప్రస్తుతం వైద్య వృత్తిని ప్రాక్టిస్ చేస్తున్నారు. రాజకీయాల పట్ల మక్కువ చూపారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ లో పేరున్న నేతల్లో ఒకరిగా ఎదిగారు. పార్టీ ప్రధానకార్యదర్శిగా ప్రస్తుతం పని చేస్తున్నారు. బాలికల శానిటరీ ప్యాడ్స్ ఎందుకు అవసరమో తెలియజెప్తూ పెద్ద ఉద్యమమే చేశారు. సామాజికాంశాలపై శ్రద్ధ చూపే డాక్టర్ జయ మహిళా సమస్యలు, రాజకీయ సమస్యలపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాల్ని దాఖలు చేసి ప్రభుత్వానికి డైరెక్షన్లు ఇప్పిస్తుంటారు.