రేపటి నుంచి క్రికెటే... క్రికెటు
ఐసీసీ చాంపియన్ ట్రోఫీ తో మొదలుకానున్న క్రికెట్ పండగ.;
రేపటి నుంచి అంతా క్రికెట్ మయం. ఈ నెల 19 నుంచి మార్చి తొమ్మిదో తేదీ వరకు జరగనున్న 9 వ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ తో దీనికి అంకురార్పణ జరుగుతోంది. భారత్ జట్టు తన మొదటి మ్యాచ్ ను 20.02.25 గురువారం బాంగ్లాదేశ్ జట్టుతో, దుబాయిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడుతుంది. ఐసీసీ ప్రపంచ ఛాంపియన్స్ ట్రోఫీ తో మొదలై, నాలుగు నెలల పాటు ఇక టీవీలో ప్రేక్షకులను అలరించబోతున్న క్రికెట్. కేవలం రెండు వారాలు మాత్రమే గ్యాప్ తీసుకున్న తర్వాత, క్రికెటర్లు, వ్యాపారస్తులు, బీసీసీఐ, ప్రేక్షకులు ఎదురుచూస్తున్న అతి పెద్ద టోర్నమెంట్, ఐపీఎల్, మార్చి 21వ తేదీ నుంచి మొదలై, మే 25వ తారీకు వరకు జరుగుతుంది. అంతటితో అయిపోయింది అని అనుకోవడానికి వీల్లేదు, మళ్ళీ భారతదేశానికి ఏ దేశంతో అయినా ద్వైపాక్షిక క్రికెట్ టోర్నమెంట్ ఉండవచ్చు. క్రికెట్ ప్రేమికులకు పండగే..పండుగ
అలరించనున్న 9వ ఐసీసీ ప్రపంచ ఛాంపియన్స్ ట్రోఫీ
రేపు (19.2.25) పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య జరిగే మొదటి మ్యాచ్ తో ఐసిసి ఛాంపియన్ ట్రోఫీ 2025 మొదలవుతుంది. ఫైనల్స్ మార్చి 9 వ తారీకు న జరుగుతుంది. క్రికెట్ ఆడే 8 దేశాలు పాల్గొంటున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ను పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీనికి కారణం భారత జట్టు పాకిస్థాన్లో ఆడడానికి నిరాకరించడం. ఐసీసీ ప్రపంచ వరల్డ్ కప్ తర్వాత అంత ప్రాధాన్యత ఉన్న టోర్నమెంట్ ఇది.1975 లో మొదటి ప్రపంచ క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత, ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆడని దేశాలలో, క్రికెట్ ను అభివృద్ధి చేయడానికి ఐసీసీ రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఐసిసి ఛాంపియన్ ట్రోఫీ కి నాంది పలికింది. ఐసీసీ నాకోట్ ట్రోఫీ పేరుతో మొదలైన ఈ టోర్నమెంట్ తర్వాత 2002 నాటికి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గా మారింది. మినీ ప్రపంచ కప్ గా పిలవపడే ఈ టోర్నమెంటు ఎనిమిది దేశాలతో మాత్రమే ఆడేలా రూపొందించారు. తర్వాత ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి 2006 వరకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే టోర్నమెంట్ 2008లో పాకిస్థాన్లో నిర్వహించాల్సి ఉండగా భద్రతా కారణాల దృష్ట్యా సౌత్ ఆఫ్రికా కు వెళ్లిపోయింది అప్పటినుంచి ప్రపంచ కప్ లాగే ప్రతి నాలుగు ఏళ్లకు ఒకసారి దీన్ని నిర్వహిస్తున్నారు.2021 లో ఈ టోర్నమెంట్ జరగలేదు. ఇప్పుడు ఈ టోర్నమెంటు తొమ్మిదో సారి నిర్వహిస్తున్నారు.
ఒక్కసారి కూడా గెలవని ఇంగ్లాండ్
క్రికెట్ ఆడుతున్న ప్రముఖ దేశాల్లో, కేవలం ఇంగ్లాండ్ మాత్రమే ఈ ట్రోఫీ ను ఇంతవరకు గెలవలేదు! ఇండియా ఆస్ట్రేలియా మాత్రం, రెండుసార్లు ఈ ట్రోఫీని గెలిచాయి. భారత్ ఈ ట్రోఫీని ఒకసారి శ్రీలంకతో పాటు సంయుక్త విజేతగా నిలిచింది. ఇంతకుముందు క్రికెట్ వరల్డ్ కప్ ను కూడా ఒక్కసారి గెలవని ఇంగ్లాండ్ జట్టు 2023 లో మాత్రం దాన్ని అతి కష్టం మీద గెలవ గలిగింది. అది కూడా వివాదాస్పదంగా. ఈసారి ఇంగ్లాండ్ ఎలాగైనా సరే ఛాంపియన్ ట్రోఫీని గెలవాలని పట్టుదలతో ఉంది. కానీ గత మూడు నెలలుగా ఆ జట్టు ప్రదర్శన అంత ఆశాజనకంగా లేదు. . భారత జట్టుతోనే ఒక నిరాశ జనకమైన ప్రదర్శనతో టి20 టోర్నమెంట్, ఒక వన్డే సీరిస్ ని ఓడిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే భారత జట్టు మాత్రమే, ఈ మధ్య కాలంలో ఒక బలమైన జట్టుగా ఆవిర్భవించింది. మిగతా జట్లలో ఆస్ట్రేలియా ఒక బలమైన జట్టుగా కనపడుతుంది. సౌత్ ఆఫ్రికా కొంతవరకు పోటీ ఇవ్వవచ్చు. ఇంగ్లాండు కూడా ఈసారి ఈ కప్ గెలవడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. ఇక పాకిస్తాన్ రెండోసారి ఈ ట్రోఫీని గెలవాలన్న పట్టుదలతో ఉంది. పోతే ఆఫ్గనిస్తాన్, బాంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్లు బలహీనమైన జట్లగా చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఆ జట్ల ప్రదర్శన అంత ఆశాజనకంగా లేదు.
మొదటిసారి క్వాలిఫై కాలేకపోయిన శ్రీలంక
పాకిస్తాన్ ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్న ఆతిథ్య దేశం కనుక ఈ టోర్నమెంట్ లో ఆడుతుంది. మిగతా ఏడు జట్లను 2023 లో జరిగిన ప్రపంచ క్రికెట్ కప్పు లో ప్రదర్శన ను బట్టి నిర్ణయించారు.ఆఫ్ఘనిస్తాన్ మొదటిసారి ఈ టోర్నమెంట్ ఆడబోతుంది. శ్రీలంక మొదటిసారి ఈ టోర్నమెంట్ లో పాల్గొనే అర్హత కోల్పోయింది. 2023 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ పాకిస్తాన్ శ్రీలంక జట్లను ఓడించిన ఆఫ్గనిస్తాన్ జట్టు మొదటిసారి ఇందులో పాల్గొనే అర్హత సాధించింది. 2023 ప్రపంచ కప్ లో మొదటి ఏడు స్థానాలు పొందిన జట్లు ఆతిథ్య జట్టుగా అర్హత సాధించిన పాకిస్తాన్ తో కలిపి ఎనిమిదేశాలతో ఈ 8 దేశాల టోర్నమెంట్ ను నిర్వహించబోతున్నారు. మొదటి టోర్నమెంట్లో సౌత్ ఆఫ్రికా గెలవగా, 2017 లో జరిగిన టోర్నమెంట్లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. 2021 ఈ టోర్నమెంట్ జరగలేదు.
భారత జాతీయ జెండాను విస్మరించిన పిసిబి
ఈ క్రికెట్ టోర్నమెంట్లో ఒకటి రెండు వివాదాలు ఉన్నాయి. మొదటిది పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి భారతదేశం ఆసక్తి చూపకపోవడం వల్ల, తటస్థ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కూడా కొన్ని మ్యాచ్లు నిర్వహించడం. ఆ విధంగా ఆ దేశం కూడా అతిథ్య దేశం అయింది. భారత్ ఆడే అన్ని మ్యాచులు ఆ దేశంలో నే జరగనున్నాయి. ఒకవేళ భారత్ ఫైనల్స్ కి వస్తే అది కూడా ఆ దేశంలోనే జరుగుతుంది. దీన్ని పాకిస్తాన్ దేశం సీరియస్ గా తీసుకుంది.
ఇక రెండో వివాదం పిసిబి సృష్టించింది. కరాచీ స్టేడియం లో అతిథ్య దేశమైన పాకిస్తాన్ జెండా తో సహా ఇతర దేశాల జెండా లను కూడా ఎగురవేశారు. అయితే అందులో భారతదేశం జెండా లేదు. ఇంతకుముందు లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో కూడా అలాగే చేసింది పిసిబి. భారతదేశ జండా మినహా అన్ని జెండాలు ఎగురవేసింది. " మా దేశంలో ఆడే అన్ని జట్ల జెండాలను మేము ఎగరవేశాం. భారతదేశం మా దేశంలో ఏ మైదానంలో కూడా ఆడడం లేదు కనుక, భారతదేశ జెండాను మిగతా జెండాలతో కలిపి మేము ఎగరవేయలేదు. అయినా మాకు దీనిపై వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు" అని పిసిబి ముక్తాయించింది.
జట్ల వివరాలు:
గ్రూప్ ఎ గ్రూప్ డి
భారత్ దక్షిణాఫ్రికా
బంగ్లాదేశ్ ఇంగ్లాండ్
న్యూజిలాండ్ ఆస్ట్రేలియా
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్
అన్ని మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 కు మొదలవుతాయి
19.02.25 పాకిస్తాన్ న్యూజిలాండ్
20.02.25 బంగ్లాదేశ్ భారత్
21.02.25 ఆఫ్ఘనిస్తాన్ దక్షిణాఫ్రికా
22.02.25 ఆస్ట్రేలీయా ఇంగ్లాండ్
23.02.25 పాకిస్తాన్ భారత్
24.02.25 బంగ్లాదేశ్ న్యూజిలాండ్
25.02.25 ఆస్ట్రేలీయా దక్షిణాఫ్రికా
26.02.25 ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్
27.02.25 పాకిస్తాన్ బంగ్లాదేశ్
28.02.25 ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలీయా
01.03.25 దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్
02.03.25 న్యూజిలాండ్ భారత్
04.03.25 మొదటి సెమీ-ఫైనల్
05.03.25 రెండో సెమీ-ఫైనల్
09.03.25 ఫైనల్