ఇండియన్ ఉమెన్ స్టార్ క్రికెటర్ స్మృతీ మంధానా పెళ్లి వాయిదా
రాత్రి జరగాల్సిన పెళ్లి అనూహ్యంగా వాయిదా పడింది..
By : The Federal
Update: 2025-11-24 01:42 GMT
భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి స్మృతీ మంధానా–మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ వివాహం నిరవధికంగా వాయిదా పడింది. స్మృతీ మంధానా తండ్రికి గుండెపోటు రావడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకుని కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
నవంబర్ 23న జరగాల్సిన భారత మహిళా క్రికెటర్ స్మృతీ మంధానా వివాహాన్ని హఠాత్తుగా వాయిదా వేయడంతో ఆమె అభిమానులు ఒకింత విస్మయానికి గురయ్యారు. వివాహ వేడుకకు ముందు స్మృతి తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబం భద్రత, ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని తేదీని మార్చినట్టు తెలుస్తోంది.
న్యూస్ ఏజెన్సీ పీటీఐ విడుదల చేసిన వీడియో ప్రకారం స్మృతీ మంధానా మేనేజర్ తుహిన్ మిశ్రా ఈ విషయాన్ని ప్రకటించారు. ఆమె తండ్రి ఆరోగ్యం బాగాలేదని, ఈ కారణంతో వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు.
అయన వివరించిన ప్రకారం- ఆదివారం రాత్రి స్మృతీ మంధానా తండ్రి టిఫిన్ చేస్తున్న సమయంలో అస్వస్థతకు గురయ్యారు. కొద్ది సేపటికే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తండ్రితో ఎంతో సన్నిహితంగా ఉండే స్మృతీ, ఆయన పూర్తిగా కోలుకునే వరకు వివాహాన్ని వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారని మేనేజర్ తెలిపారు.
స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానా ప్రస్తుతం సాంగ్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి సమయంలో కుటుంబ ప్రైవసీని గౌరవించాలని స్మృతీ మంధానా మేనేజర్ తుహ్రీన్ మిశ్రా అందరికి విజ్ఞప్తి చేశారు.
స్మృతీ మంధానా తండ్రి శ్రీనివాస్ మంధానాకు రాత్రి దాదాపు 11.30 సమయంలో హార్ట్ అటాక్ లక్షణాలు కనిపించాయి. వెంటనే సాంగ్లీ సర్వహిత్ హాస్పిటల్‌లో చేర్చారు. కార్డియాక్ ఎంజైమ్స్ కొద్దిగా పెరిగినందున నిరంతర పరిశీలన అవసరమని వైద్యులు చెప్పారు. కార్డియాలజిస్టు డాక్టర్ రోహన్ థానేదార్ కూడా ఆయనను పరీక్షించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపారు.
నవంబర్ 23న జరగాల్సిన వివాహ వేడుకకు కొన్ని రోజుల ముందే మంధాన పెళ్లి హడావిడి మొదలైంది. మెహందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భారత మహిళా క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, షెఫాలీ వర్మ, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ పాల్గొని సందడి చేశారు.
ఇంతలోనే ఇలా జరగడం పట్ల స్మృతీ మంధానా అభిమానులు, శ్రేయోభిలాషులు, బంధు మిత్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.