కల నెరవేరిన క్షణం... కన్నీళ్లు పెట్టుకున్న మైదానం!
ఎవరీ జెమిమా రోడ్రిగ్స్ — మ్యాచ్ ముగిసిన వెంటనే ఎందుకలా ఏడ్చేసింది?
By :  The Federal
Update: 2025-10-31 10:33 GMT
నిండా 25 ఏళ్లు కూడా నిండని ఓ 'పొట్టిపిల్ల' అందర్నీ ఏడిపించేసిందంటే నమ్మండి.. ఒక్క షో తో దేశం యావత్తు తన వైపు చూసేలా చేసింది. దేశ ప్రజలు నిద్రిస్తున్న వేళ ఆ అమ్మాయి తన సత్తా చూపింది. భారతీయ క్రీడాభిమానుల కళ్లు చెమ్మగిల్లేలా చేసింది. ఆ అమ్మాయి పేరు జెమీమా రోడ్రిగ్స్. ఆమె చేతిలోని బ్యాట్ కేవలం ఓ చెక్క ముక్క కాదు, అది స్వప్నాల సాధనకు ప్రతీక. ఒక్కొక్క బంతిని కట్ చేస్తూ, డ్రైవ్ చేస్తూ, మైదానమంతా ఆమె సంగీతాన్ని వినిపించింది. తానమేమిటో నిరూపించుకుంది. క్రీడాకారులు కావాలనుకుంటున్న లక్షలాది మంది అమ్మాయికి ఆదర్శంగా నిలిచింది.
ఓడిపోయిన జట్టు మైదానంలో కుప్పకూలి ఏడ్వటం, గెలిచిన జట్టు విజయనాదం చేస్తూ సంబరాలు జరుపుకోవడం మాత్రమే తెలిసిన క్రికెట్ మ్యాచ్‌లో గురువారం రాత్రి అందుకు పూర్తిగా భిన్నంగా ఓ అద్భతమే జరిగింది. ఇప్పటికే 7 సార్లు ప్రపంచకప్ గెలుచుకుపోయిన బలమైన ఆసీస్ జట్టు అంత సులభంగా చేజింగ్ టీమ్‌కు విజయాన్ని కట్టబెడుతుందని ఏ కోశానా నమ్మకం లేని స్తితి నుంచి విజయ పథం వైపు నడిపిన వనిత జెమీమా రోడ్రిగ్స్.
ఎన్నడూ లేనివిధంగా మూడో స్థానంలో ఆడాలని అయిదు నిమిషాలకు ముందు టీమ్ యాజమాన్యం చెబితే మైదానంలోకి వచ్చిన ముంబై ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి గట్టి పునాది వేయడమే కాకుండా కెప్టెన్ అవుట్ అయిన తర్వాత ఆమె చేయవలసిన స్కోర్‌ను కూడా తానే చేస్తానని, చివరి బంతి వరకు నిలిచి పోరాడతానని సంకల్ప బలంతో సాగింది. 127 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టే క్రమంలో ఎన్నిసార్లు ఆమె అలసిపోయిందో.. కొండలా కనబడుతున్న స్కోరు వణికిస్తున్న క్షణాల్లో కూడా ‘నిలబడు, గట్టిగా నిలబడు నీకు దేవుడు సహాయం చేస్తాడు’ అంటూ గట్టిగా అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ మహిళా క్రికెట్ చరిత్రలో, వన్ డే ప్రపంచ కప్ చరిత్రలో కనివిని ఎరుగని చిరస్మరణీయ విజయాన్ని ఇండియా జట్టుకు కట్టబెట్టిన క్షణాల్లో సింహనాదమూ, పెనురోదనా కలిస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించింది.
గెలిచినా, ఓడినా విషాద విలాపమే..
తోటి బ్యాట్స్ ఉమన్ అమన్‌జీత్ విజయానికి అవసరమైన చివరి ఫోర్ సాధించాక స్టేడియంలో జేమీమా రోడ్రిగ్స్ కుప్పకూలి విలపించడం. స్టేడియంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతిమంథానా, సహచర క్రీడాకారిణులు కోచ్‌ను, సహాయక సిబ్బందిని గట్టిగా కౌగలించుకుంటూ రోదించడం. ఒక విన్నింగ్ జట్టు శక్తినంతా కూడదీసుకని అద్భుతాన్ని సృష్టించామన్న భావనతో ఆనంద విషాదాశ్రువులను చిలికించడం.. తమ కళ్ల ముందు ఏం జరుగుతోందో అర్థమయ్యే లోపే ఇండియా మహిళల జట్టు విజయాన్ని ఎగరేసుకోవడం చూసి అంత మేటి క్రీడాకారులున్న ఆసీస్ మహిళా జట్టు బిత్తరపోయి చుట్టూ చూస్తూ కన్నీరు కార్చడం ఎప్పుడైనా చూశామా..? మైదానంలోని ఇరుజట్లూ విజయ పరాజయాలను పక్కనబెట్టి విలపిస్తుంటే స్టేడియంలోని వేలాదిమంది ప్రేక్షకులు ఆనందమో విషాదమో తెలియని స్థితిలో తామూ కన్నీళ్లు పెట్టడం.. ఇటీవలి కాలంలో ఎన్నడైనా చూశామా..
గత వరల్ట్‌కప్‌లో జట్టులో స్థానం కోల్పోయి షాక్‌కు గురైన జెమీమా రోడ్రిగ్స్.. ఈ దఫా వరల్డ్ కప్ జట్టుకు ఎంపికై కూడా చివరి 11 మంది జట్టులో ఉంటానా, ఆడతానా అనే అందోళతోనే గడిపిన జెమీమా భారత జట్టు ఆశలను తనవిగా చేసుకుని హీరోచితమైన అత్యుత్తమ గేమ్‌ను ప్రదర్శించింది. తీవ్రమైన అలసట, శక్తి కోల్పోయిన దశలో కూడా బైబిల్ లోని ‘నువ్వు గట్టిగా నిలబడు జీసస్ నీకు సాయం చేస్తాడు’ అనే మంత్ర వాక్యాన్ని పదే పదే తనలో తాను ఉచ్ఛరిస్తూ.. ఇక ఈ జీవితానికి ఈ ప్రదర్శన చాలు అనేంత మహిమాన్విత ఆటతీరును ప్రదర్శించింది.
ఈ 2025 అక్టోబర్ 30న ఒక రివర్స్ అద్భుతం క్రీడా ప్రపంచాన్ని కమ్మేసింది. గెలుపు ఓటములను సమాన స్థితిలో చూడాలని బయటకు అందరం చెప్పవచ్చు కానీ, మైదానంలో అతి పెద్ద స్కోరును చేశాక దాన్ని నిలబెట్టుకోవాలని చూసిన జట్టుకు, ప్రాణాలొడ్డి మరీ ఛేదించిన జట్టుకు అలాంటి సమాన స్థితిని ప్రదర్శించాలని చెప్పగలమా.. స్వప్న నగరం అని పేరొందిన ముంబై మహానగరంలో ఒక చారిత్రక స్వప్నం భారత్‌కు అనుకూలంగా ఫలించిన క్షణాలను ప్రేక్షకులు, క్రీడాకారులు, కోచ్‌తో సహా సహాయక సిబ్బంది మాత్రమే కాకుండా కామెంటేటర్లు కూడా వివశులై అరచిన క్షణాలను ఎంతమంది చూశారు గత రాత్రి.
భావోద్వేగమా.. నీ పేరు జెమీమా రోడ్రిగ్స్..!
జట్టును గెలిపించిన క్షణాల్లో, సహచరులను గట్టిగా కౌగలించుకున్న క్షణాల్లో, తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుంటున్న క్షణాల్లో విలపించడమే తన జెస్టర్‌గా చేసుకున్న షాక్ తెప్పించిన జెమీమా ఎన్ని ఎదురుదెబ్బలను, ఎన్ని అవమానాలను గత నెలరోజులుగా ఎదుర్కొందో మాటల్లో చెప్పలేం. గత నెల అంతా చాలా కష్టంగా గడించిందని కానీ, ఇప్పుడిది కలలా ఉందని నమ్మలేకపోతున్నానని కన్నీళ్ల మధ్యే జెమీమా తెలిపింది. 
ఆ కన్నీళ్లకు వెనుక తీవ్ర విషాదం దాగుంది. మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ గత ప్రపంచకప్‌లో తనకు చోటు దక్కలేదు. ఈ ప్రపంచ కప్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లలో రెండు సార్లు డకౌట్ అయిన జెమీమా మరో రెండు మ్యాచుల్లో పెద్దగా స్కోర్ చేయలేదు. దీంతో ఇంగ్లండ్ జట్టుతో జరిగిన ఐదో వన్డేలో జట్టు కూర్పులో భాగంగా ఏకంగా తనకు పక్కన పెట్టేశారు.అయితే, న్యూజిలాండ్‌లో కీలక పోరులో మళ్లీ జట్టులోకి వచ్చిన రోడ్రిగ్స్ 55 బంతుల్లో 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఇక సెమీస్‌లో భారీ శతకంతో తన సత్తాను చాటుకోవడం కాదు.. భారత మహిళా జట్టు ఆశలను పునరుజ్జీవింప చేసింది. 
తగిన స్కోరు చేయలేక ఈ టోర్నీలో తాను ఏడ్వని రోజు లేదని, మానసికంగా తీవ్రమైన ఆందోళనతో ఉన్నానని, జట్టు కోసం నిలబడాలని మాత్రమే అనుకుంటే మిగిలిందంతా జీసస్ చూసుకున్నాడని, బంతి బంతికి దీప్తి ఇచ్చిన ప్రోత్సాహం కానీ, తాను ఏడుస్తున్నప్పుడల్లా ఓదార్చిన అరుంధతిని కానీ మరవలేనని, సొంత మైదానంలో అభిమానుల ప్రోత్సాహం ఇచ్చిన స్ఫూర్తి అంతా ఇంతా కాదని జెమీమా నమ్రతతో చెప్పింది.
ఒక్క చాన్సుతో తనను తాను నిరూపించుకోవాలన్న తపన.. ఇలా ఎన్ని కలిసి జెమీమా చేత రికార్డు ఛేజింగ్ స్కోర్ కొట్టేలా చేసి ఉంటాయి? క్రికెట్‌కి ముందు హాకీ జాతీయ స్థాయి ప్లేయర్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ ప్లేయర్ కూడా అయిన జెమీమా నాలుగేళ్ల వయసు నుంచే క్రికెట్‌తో పాటు ఈ అన్ని ఆటల్లో ప్రావీణ్యం పొంది, చివరకు క్రికెట్‌ను వృత్తిగా మల్చుకుంది. తల్లి తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ 'పొట్టి పిల్ల' ఇవాళ భారత మహిళా జట్టు ఆశలు నిలబెట్టి సగర్వంగా నిలబడింది. 
అవమానం, జట్టులో చోటు కోల్పోవడం, కుంగుదల ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా లక్ష్యాన్ని వదలకుండా అవకాశం దొరికినప్పుడు తనను తాను నిరూపించుకున్న ఈ చిన్నారి... యావత్ దేశ యువతులకు చిరకాలం స్ఫూర్తి నిచ్చే ధ్రువతార అవుతుందని అంటే అతిశయోక్తి కాదు.
ఇదీ కుటుంబ చరిత్ర...
జెమిమా జెసికా రోడ్రిగ్స్ 2000 సెప్టెంబర్ 5న పుట్టింది. ముంబైలోని మంగళూరి క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు రోమన్ కాథలిక్. ఇద్దరు అన్నలైన ఇనాక్, ఎలీ లతో కలిసి  పెరిగింది. నాలుగేళ్ల వయస్సులోనే క్రికెట్ ఆడడం ప్రారంభించింది. మంచి క్రీడా సౌకర్యాల కోసం కుటుంబం బాంద్రా వెస్ట్‌కు మారింది.
ఆమె తండ్రి ఐవన్ రోడ్రిగ్స్ పాఠశాలలో జూనియర్ కోచ్‌గానే పనిచేసేవారు. తన కుమార్తెకు చిన్నప్పటి నుంచే శిక్షణ ఇచ్చారు. పాఠశాలలోనే అమ్మాయిల కోసం ప్రత్యేకంగా క్రికెట్ జట్టును రూపొందించారు. చిన్నతనంలో జెమిమా క్రికెట్‌తో పాటు ఫీల్డ్ హాకీని కూడా ఆస్వాదించింది. గిటార్ కూడా నేర్చుకుంది. 
జెమిమా ముంబైలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హై స్కూల్ లో చదివి, తర్వాత రిజ్వి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ లో విద్యను కొనసాగించింది.
క్రీడా జీవిత ప్రారంభం
జెమిమా మహారాష్ట్ర అండర్–17, అండర్–19 హాకీ జట్లలో ఆడింది. 12 ఏళ్ల వయస్సులో 2012–13 సీజన్‌లో క్రికెట్ అండర్–19 జట్టుకు ఎంపికై అరంగేట్రం చేసింది. కేవలం 13 ఏళ్లకే రాష్ట్ర అండర్–19 జట్టులో స్థానం సంపాదించింది.
ఆమె తండ్రే తన ప్రధాన కోచ్, తన “హీరో” అని జెమిమా పేర్కొంటుంది. 50 ఓవర్ల మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారత మహిళా ఆటగారు ఆమె. 2017 నవంబరులో ఔరంగాబాద్‌లో సౌరాష్ట్ర జట్టుపై 163 బంతుల్లో 202* పరుగులు చేసి రికార్డు సృష్టించింది. ఆ ఇన్నింగ్స్‌లో 21 బౌండరీలు ఉన్నాయి. అంతకుముందు గుజరాత్‌పై జరిగిన అండర్–19 మ్యాచ్‌లో 178 పరుగులు చేసింది.
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్
2018 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకుంది. 2018 ఫిబ్రవరి 13న దక్షిణాఫ్రికాపై తన T20 అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఆ తర్వాత అదే ఏడాది మార్చి 12న ఆస్ట్రేలియాపై తన వన్డే ఆడింది. 
అదే ఏడాది వెస్టిండీస్‌లో జరిగిన ICC మహిళా T20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో ఎంపికైంది. టోర్నీకి ముందు ఆమెను “గమనించాల్సిన ఆటగాడు”గా ఐసీసీ పేర్కొంది. టోర్నీ ముగిసిన తర్వాత ఆమెను జట్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మంచి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ ఏడాదే ఆమెను బేస్‌లైన్ వెంచర్స్ అనే స్పోర్ట్స్ మార్కెటింగ్ సంస్థ స్పాన్సర్ చేసింది. 2019 మార్చి 1న జరిగిన ICC ప్రపంచకప్ కోసం భారత జట్టు కొత్త జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె ధోని, విరాట్ కోహ్లీ, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి ఆటగాళ్లతో కలిసి పాల్గొంది.
2025 మహిళా ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై 127* పరుగులు చేసి భారత జట్టుకు విజయాన్ని అందించింది.
జెమిమా రోడ్రిగ్స్ తన ప్రతిభ, కృషి, క్రమశిక్షణతో భారత మహిళా క్రికెట్‌లో కొత్త శకానికి నాంది పలికిన క్రీడాకారిణిగా నిలిచింది.
ఇప్పుడామెపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల  వర్షం కురుస్తోంది. 
స్టన్నింగ్ ప్రదర్శన..
2025 అక్టోబర్ 30వ తేదీ రాత్రి ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ మరో 9 బంతులు మిగిలిఉండగానే విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ 127 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆసీస్ మీడియా ఏబీసీ న్యూస్ జెమీమా ప్రదర్శనను అభినందిస్తూ ‘స్టన్నింగ్ ఇన్నింగ్స్. అద్భుతమైన లక్ష్య ఛేదన’ అంటూ కామెంట్ చేసింది. ఇక ఫాక్స్ క్రికెట్ కూడా జెమీమాను అభినందిస్తూనే ఎలీసా హీలీని విమర్శించింది. ‘ఆస్ట్రేలియా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించడానికి ప్రధాన కారణం క్యాచ్‌లు డ్రాప్ చేయడమే. రికార్డు లక్ష్య ఛేదనలో జెమీమా జీవితకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడింది’’ అని కథనాల్లో పేర్కొంది. ‘గుడ్ మార్నింగ్ ఆస్ట్రేలియా. భారత్ అద్భుతమైన రన్ ఛేజింగ్‌తో వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కథ ముగిసింది’ అని పోస్టు పెట్టింది.