రోహిత్ సెంచరీ, భారత్ కు ఓదార్పు విజయం

అర్థ సెంచరీతో రాణించిన కింగ్ కోహ్లీ

Update: 2025-10-25 13:53 GMT
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. మొదటి రెండు వన్డేలలో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు.

రోహిత్ తన కెరీర్ లో 50 వ అంతర్జాతీయ సెంచరీ సాధించాడు. ఈ తొలి రెండు మ్యాచ్ లలో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ సాధించాడు. వీరిద్దరు రెండో వికెట్ కు 168 పరుగులు జోడించారు. ఈ జోడి చెలరేగడంతో భారత్ తొమ్మిది వికెట్లతో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 236 పరుగులకే ఆలౌట్ అయింది. హర్షిత్ రాణా నాలుగు వికెట్లు తీసి ఆసీస్ దూకుడు కళ్లెం వేశాడు. తరువాత చేధనకు దిగిన భారత్ రోహిత్ సెంచరీతో(121 నాటౌట్) కోహ్లీ (74 నాటౌట్) 38.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 237 పరుగులు చేసింది.
రోహిత్ ధాటిగా..
మూడు మ్యాచ్ ల సిరీస్ ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలుచుకుంది. కానీ రోహిత్- కోహ్లీ సిడ్నీ ప్రేక్షకులు కోరుకున్నది ఇచ్చారు. చాలాకాలంగా ఇరువురు సీనియర్ ఆటగాళ్లు ఆటకు దూరంగా ఉన్నారు. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ టీ20, టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. దాదాపు ఆరు నెలల తరువాత ఇద్దరు మళ్లీ మైదానంలో కనిపించారు. 
కెప్టెన్ శుభ్ మన్ గిల్ తన భాగస్వామికి తొలి వికెట్ కు 69 పరుగులు జోడించారు. తరువాత గిల్ అవుటైన తరువాత కింగ్ కోహ్లీ క్రీజులోకి అడుగుపెట్టాడు. రోహిత్ ఈ క్రమంలోనే వన్డేలలో 33వ సెంచరీ సాధించాడు.
హిట్ మ్యాన్ కు టీ20 లలో ఐదు సెంచరీలు ఉన్నాయి. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో రెండు సిల్కీ స్మూత్ డ్రైవ్, ప్లిక్ లతో మొదలుపెట్టిన రోహిత్, జంపా బౌలింగ్ లో ఎదురుదాడికి దిగాడు.
డకౌట్ల తరువాత.. కోహ్లీ..
తొలి రెండు వన్డేలలో డకౌట్ అయిన కోహ్లీ.. ఈ మ్యాచ్ లో సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. స్టార్క్ బౌలింగ్ సింగిల్ తీసిన కోహ్లీ, తరువాత ఫోర్ కొట్టి ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేశాడు.
36 పరుగుల వద్ద నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అప్పీల్ కు ఆసీస్ డీఆర్ఎస్ తీసుకున్న.. ఫీల్డ్ ఎంపైర్ నిర్ణయంతో థర్డ్ అంపైర్ ఏకీభవించాడు. రోహిత్ 63 బంతులలో అర్థ సెంచరీ పూర్తి చేసుకోగా, తదుపరి అర్థ సెంచరీనీ 42 బంతుల్లోనే అందుకున్నాడు. రో-కో ద్వయానికి ఇదే చివరి ఆసీస్ పర్యటనగా క్రీడా విశ్లేషకులు చెప్పిన నేపథ్యంలో భారీ సంఖ్యలో అభిమానులు సిడ్నీ స్టేడియానికి వచ్చారు.
తడబడిన ఆస్ట్రేలియా..
ఈ మధ్య అన్ని ఫార్మాట్లలో ఎంపిక అవుతున్న హర్షిత్ రాణా.. అద్భుతమైన పేస్ తో బౌలింగ్ చేశాడు. బౌన్స్ కూడా రాబట్టడంతో పరుగులు సాధించడం కష్టమైంది. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ (41), ట్రావిస్ హెడ్ తొలి వికెట్ కు 61 పరుగులు సాధించారు.
హెడ్ ను సిరాజ్ వెనక్కి పంపగా తరువాత రెన్ షా(56) అలెక్స్ క్యారీ ఆసీస్ ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో మాథ్యూ షార్ట్ ఇచ్చిన క్యాచ్ ను కోహ్లీ అందుకున్న తీరు అద్బుతం. తరువాత ఆసీస్ బ్యాటింగ్ ఎంతసేపు నిలవలేదు.
Tags:    

Similar News