విశాఖను ముంచెత్తిన క్రికెట్ ఫీవర్, దక్షిణాఫ్రికాతో అమీ తుమీ నేడు

ఈ ముగ్గురు బర్త్ డే బాయస్ ఈవేళ విశాఖలో ఏం చేస్తారో మరి! 1.30 నుంచి మ్యాచ్ లైవ్

Update: 2025-12-06 03:48 GMT
విశాఖపట్నం వేదికగా టీమ్ ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్‌ 6) నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే సిరీస్‌ కైవసం చేసుకుంటుంది. ఇవాళ విశాఖపట్నంలో జరిగే ఈ మ్యాచ్ కి ఓ ప్రత్యేకత కూడా ఉంది. టీమ్ ఇండియాలోని ముగ్గురు ఆటగాళ్ల పుట్టిన రోజులు కూడా ఇవాళే కావడమే ఈ ప్రత్యేకత. టీమ్ ఇండియా తుది జట్టులో ఈ ముగ్గురూ ఉన్నారు. దీంతో అందరి కళ్లూ వీళ్లపైన్నే నిలవనున్నాయి.

 దీనికి తోడు అదనపు ఆకర్షణ విరాట్‌ కోహ్లి. 24 గంటలుగా విశాఖపట్నంలో అందరి నోటా కోహ్లీ మాట వినబడుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే వరుసగా రెండు సెంచరీలు చేసి సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి హ్యాట్రిక్‌ సెంచరీ చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

కోహ్లి ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే ఇది సాధ్యమయ్యేలానే కనిపిస్తుంది. వైజాగ్‌ పిచ్‌ కూడా కోహ్లికి అద్భుతంగా సహకరించే అవకాశం ఉంది. ఈ మైదానం అంటే కింగ్‌కు పూనకాలు వస్తాయి. ఇక్కడ అతను ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఏకంగా 97.83 సగటున 587 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 2 అర్ద శతకాలు ఉన్నాయి.
స్ట్రయిక్‌రేట్‌ కూడా 100కు పైబడే ఉంది. ఈ గణాంకాలు చూస్తే కోహ్లి హ్యాట్రిక్‌ సెంచరీ లోడింగ్‌ అనక తప్పదు. వైజాగ్‌లో మరిన్ని పరిస్థితులు కూడా కోహ్లి హ్యాట్రిక్‌ సెంచరీకి అనుకూలంగా ఉన్నాయి.
ఆ ముగ్గురు ఎవరంటే...
ఇవాళ ముగ్గురు టీమిండియా స్టార్లు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దిగ్గజ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, పేస్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా, అత్యుత్తమ మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌. వీరు ముగ్గురూ వేర్వేరు సంవత్సరాల్లో డిసెంబర్‌ 6న జన్మించారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ప్రస్తుతం టీమిండియాలో కీలక సభ్యులుగా ఉన్నారు.
ఈ ముగ్గురిలో సీనియర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja). ఎడమ చేతి స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన జడేజా 1988లో గుజరాత్‌లోని నవ్‌గామ్‌ఘడ్‌లో జన్మించాడు. 2008 అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో సభ్యుడైన జడేజా 2009లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.
పై ముగ్గురిలో జడేజా తర్వాత సీనియర్‌ బుమ్రా (Jasprit Bumrah). ఈ కుడి చేతి వాటం పేసు బౌలర్ 1993లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించాడు. విశిష్టమైన బౌలింగ్‌ శైలి కలిగిన బుమ్రా.. తనకు మాత్రమే సాధ్యమైన స్వింగ్‌, పేస్‌ కలయికతో ప్రపంచ బ్యాటర్లను వణికిస్తున్నాడు.
ఐపీఎల్‌లో సత్తా చాటడం ద్వారా 2016 టీమిండియా తలుపులు తట్టిన బుమ్రా అనతికాలంలో సూపర్‌ స్టార్‌ బౌలర్‌ అయ్యాడు. భారత పేసు గుర్రంగా పేరు తెచ్చుకున్నాడు. బుమ్రా యార్కర్లు వేయడంలో దిట్ట. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చివరి ఓవర్లలో వికెట్లు తీయగల సామర్థ్యానికి బుమ్రా ప్రసిద్ది చెందాడు.
పై ముగ్గురిలో చిన్నవాడు శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer). శ్రేయస్‌ 1994లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించాడు. కుడి చేతి వాటం మిడిలార్డర్‌ బ్యాటర్‌ అయిన శ్రేయస్‌ 2014 అండర్‌-19 వరల్డ్‌కప్‌ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఆతర్వాత దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి 2017లో టీమిండియా తలుపులు తట్టాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో శ్రేయస్‌ మిడిలార్డర్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియాను చాలా మ్యాచ్‌ల్లో గెలిపించాడు. జాతీయ జట్టులో పోలిస్తే శ్రేయస్‌కు ఐపీఎల్‌లో ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది.
సందడిసందడిగా డ్రెస్సింగ్ రూమ్..
క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ సందడి సందడిగా ఉంది. ఆటగాళ్ల పరస్పర శుభాకాంక్షలు, మెచ్చుకోళ్లు, వచ్చిపోయే ప్రముఖులు, పలకరింపులతో సందడి నెలకొంది. వీరందరిలోకి విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టేడియం బయట పండుగ వాతావరణం కనిపిస్తోంది. పెద్దపెద్ద బ్యానర్లు, రంగురంగుల పతాకాలతో స్టేడియం యావత్తు మెరిసిపోతోంది.

మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. జియో స్టార్ ఛానల్ ఈ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
Tags:    

Similar News