వరల్డ్ కప్ లో మెరిసిన రాయలసీమ బిడ్డను మరవొద్దు సారూ!
ఎవరీ శ్రీచరణి రెడ్డి, ఏమిటీ ప్రత్యేకత
By : The Federal
Update: 2025-11-03 11:29 GMT
మహిళల ప్రపంచ కప్ ను టీమ్ ఇండియా గెలిచింది. ఫైనల్స్ ఆడిన టీమ్ ఇండియాలో ఓ తెలుగమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు శ్రీచరణి రెడ్డి. ఆ అమ్మాయి ఉన్నట్టు ఎవరూ గుర్తించలేదు. ఎటువంటి ప్రశంసలూ రాలేదు. టీంలో మిగతా రాష్ట్రాల అమ్మాయిలకి దక్కిన కీర్తి ప్రతిష్టలు శ్రీచరణి కి దక్కలేదని క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్ లో టీమ్ ఇండియా తరఫున ఆడిన పురుషుల జట్టులో తిలక్ వర్మను ఆదిరించినట్టే శ్రీచరణి ని ఆదరించాలని వారు కోరుతున్నారు.
ఎవరీ శ్రీచరణి రెడ్డి?
రాయలసీమ గడ్డ నుంచి భారత మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైన వారిలో శ్రీచరణి రెడ్డి ఒకరు. రాయలసీమలోని చిన్న పల్లె. ఎర్రమల్లె (Erramalle village). వీరప్ప మండలంలోని ఒక పల్లెటూరు. అక్కడి నుంచి ఈ అమ్మాయి భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ పేజీని కేటాయించుకుంది. భారత జట్టులో చోటు దక్కించుకున్న మొదటి కడప మహిళా క్రికెటర్.
2004 ఆగస్టు 4న జన్మించిన చరణి, చిన్నప్పటి నుంచే క్రీడాభిమాని. తండ్రి చందశేఖర్ రెడ్. రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో సాధారణ ఉద్యోగి. ఆయన మొదట ఆమెను బ్యాడ్మింటన్ వైపు తిప్పారు. తరువాత ఖో-ఖో ఆడించారు. అయితే ఆమె క్రీడలలో తన పట్టు పెంచుకుంటూ చివరికి క్రికెట్‌ను తన ప్రపంచంగా మార్చుకుంది.
చరణి క్రీడా ప్రయాణం కేవలం సాదాసీదాగా సాగలేదు. ఆమె కుటుంబం అనేక కష్టాలు పడాల్సి వచ్చింది. కుమార్తె శిక్షణ కోసం ఆయన తల్లిదండ్రులు, ఆమె మేనమామ కిశోర్ కుమార్ రెడ్డి అనేక త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఆమెకు శిక్షణలో తోడుగా నిలిచి ఆమె ప్రతిభను వెలికి తీయడంలో వారందరూ కీలకపాత్ర పోషించారు.
తనకు భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, యూవరాజ్ సింగ్ లాంటి వారు ఆదర్శమని చెప్పుకునే శ్రీచరణి రెడ్డి వారిలా దూకుడుగా ఆడాలన్నది లక్ష్యం. ఆంధ్ర మహిళా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ చరణి తన ప్రతిభను నిరూపించుకుంది.
2024 డిసెంబరులో జరిగిన మూడవ విమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను ₹55 లక్షలకు కొనుగోలు చేసింది. 2025 మార్చిలో డెహ్రాడూన్‌లో జరిగిన సీనియర్ మహిళల మల్టీడే ఛాలెంజర్ ట్రోఫీలో ఆమె ఐదు వికెట్లు తీయడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రపంచ చాంపియన్‌గా ఎదిగిన చరణి
2025 ఏప్రిల్‌లో శ్రీలంక, దక్షిణాఫ్రికా ముక్కోణ సిరీస్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్న చరణి, అదే నెలలో శ్రీలంకపై తన తొలి ODI ఆడింది. 2025 జూన్‌లో ఇంగ్లండ్‌పై జరిగిన T20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు తీసి సంచలనం సృష్టించింది. డెబ్యూ T20లో నాలుగు వికెట్లు తీసిన రెండో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది.
ఈ ప్రదర్శనతో 2025 మహిళల ప్రపంచ కప్‌లో భారత్ గెలిచిన జట్టులో ఆమె భాగమైంది. “World Champion (2025)”తో ఆమె పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. తమ ప్రాంత గర్వకారణంగా రాయలసీమ అభిప్రాయపడుతోంది.
రాయలసీమకు కూడా ఒక స్మృతి మంధాన పుట్టిందని ఆమె అభిమానులైన యువతీ యువకులు అభిప్రాయపడుతున్నారు. తండ్రి ఆరాటం, మామ మద్దతు, ఆమె కష్టం కలిపి ఒక ప్రపంచ ఛాంపియన్ ను తయారు చేశాయి.
అటువంటి ఆమె ఆట చూసేందుకు ఆదివారం రాత్రి కడప జిల్లా అంతటా పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటయ్యాయి. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత మహిళల జట్టు విశ్వ విజేతగా నిలవాలని, శ్రీచరణి ఫైనల్స్‌లో రాణించాలని ఆకాంక్షిస్తూ బ్యానర్లు వెలిశాయి. జిల్లాలోని మహిళ క్రికెటర్లు ఆలయాల్లో పూజలు చేశారు. పెద్ద స్క్రీన్‌పై వరల్డ్ కప్ ఫైనల్స్ చూడడం ఒక ఎత్తైతే అందులో భారత నారులు విశ్వవిజేతలుగా నిలవడంతో సంబరాలు అంబరాన్నంటాయి.
శ్రీచరణి తల్లిదండ్రులు ఇంట్లోనే టీవీకి అతుక్కుపోయి బిడ్డ ఆటను ఆస్వాదించారు.
అటువంటి ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆదరాభిమానాలు అందితే బాగుంటుందని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.