పాక్ వైమానిక దాడిలో ముగ్గురు ఆప్ఘన్ క్రికెటర్ల మృతి

నవంబర్ లో పాక్ తో జరిగే టీ20 సిరీస్ ను రద్దు చేసిన ఆప్ఘన్ క్రికెట్ బోర్డు

Update: 2025-10-18 09:38 GMT
పాక్ వైమానిక దాడిలో మృతి చెందిన ఆప్ఘన్ క్రికెటర్లు

ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ చేసిన వైమానిక దాడిలో ముగ్గురు క్రికెటర్లు మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) తెలిపింది. మరణించిన వారిలో క్రికెటర్లు కబీర్, సిబ్ఘతుల్లా, హరున్ తో పాటు మరో ఐదుగురు వ్యక్తులు మరణించారని ఏసీబీ వెల్లడించింది.

‘‘పాక్ ప్రభుత్వం నిర్వహించిన పిరికి దాడిలో ఈ సాయంత్రం పాక్టికా ప్రావిన్స్ లోని ఉర్గున్ జిల్లాకు చెందిన ధైర్యవంతులైన క్రికెటర్లు మరణించారు. ఆప్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తన ప్రగాఢ విచారం వ్యక్తం చేస్తోంది’’ ని ఏసీబీ తన ఎక్స్ హ్యండిల్ లో ట్వీట్ చేసింది. 

ఈ క్రికెటర్లతో పాటు మరికొంతమంది అమరులైనట్లు వెల్లడించింది. ఈ ఆటగాళ్లు ముందుగా స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ లో పాల్గొనడానికి పాక్టికా ప్రావిన్స్ రాజధాని షరానాకు వెళ్లినట్లు తెలియజేసింది.

‘‘క్రికెటర్ల మరణాలు ఆప్ఘనిస్తాన్ క్రీడా సమాజానికి, దాని అథ్లెట్లకు, క్రికెట్ కుటుంబానికి గొప్ప నష్టంగా ఏసీబీ భావిస్తోంది. అమరవీరుల కుటుంబాలను, పక్తికా ప్రావిన్స్ ప్రజలకు ఏసీబీ తన ప్రగాఢ సానుభూతిని, సంఘీభావాన్ని తెలియజేస్తోంది’’ అని అది పేర్కొంది.
ఆప్ఘనిస్తాన్ పై పాక్ దాడి తరువాత పాకిస్తాన్ తో నవంబర్ లో జరగబోయే ద్వైపాక్షిక సిరీస్ పాల్గొనబోవడం లేదని ఏసీబీ ప్రకటించింది.
ఖండించిన రషీద్ ఖాన్..
పాక్ వైమానిక దాడిలో ముగ్గురు యువ క్రికెటర్లు మరణించడంపై టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్ ఒక ప్రకటనలో ఖండించారు.
‘‘ఆప్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడిలో పౌరులు మరణించడం నన్ను తీవ్రంగా బాధించింది. ప్రపంచ వేదికపై తమ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న మహిళలు, పిల్లలు, ఔత్సాహిక యువ క్రికెటర్ల కలతీరకుండా మరణించడం కలిచివేస్తోంది’’ అని ట్వీట్ చేశారు. 

సైన్యం మీద యుద్దం చేయకుండా పౌరులు, వారి మౌలిక సదుపాయాలపై దాడులకు పాల్పడటం. ఈ అన్యాయమైన, చట్టవిరుద్దమైన చర్యలు మానవ హక్కుల తీవ్రమైన ఉల్లంఘనను సూచిస్తున్నాయని చెప్పారు.
పాక్ తో ఇక ముందు జరగబోయే మ్యాచ్ లను ఏసీబీ తప్పించడం సముచితమే అని రషీద్ ఖాన్ సమర్థించాడు. ఈ క్లిష్ట సమయంలో ఆప్ఘన్ ప్రజలకు అండగా నిలిబడతానని చెప్పారు. జాతీయ గౌరవం కంటే ఏది ముఖ్యం కాదని ఎక్స్ లో ట్వీట్ చేశారు.
పోలీసుల కథనం ఏంటీ?
రెండు దేశాల మధ్య రెండు రోజుల కాల్పుల విరమణ తరువాత శుక్రవారం పాక్ ఆర్మీ వాటిని ఉల్లంఘించి ఆగ్నేయ ఆప్ఘనిస్తాన్ లో పాకిస్తాన్ సైన్యం దాడులు నిర్వహించిందని ఆప్ఘన్ పోలీస్ లు తెలిపారు.
ఆగ్నేయ పాక్టికా ప్రావిన్స్, పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న మరో రెండు ప్రాంతాలలో బాంబు దాడులు జరిగాయి. ఖనదర్ గ్రామంలోని ఒక పౌరుడి ఇంటిపై జరిగిన దాడిలో ప్రాణనష్టం సంభవించిందని పోలీస్ ప్రతినిధి మొహ్మదుల్లా అమిని మావియా తెలిపారు. దాడులు ఎలా జరిగాయో ఆయన వెల్లడించలేదు.
రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ రెండు రోజుల పాటు సాగింది. దాడులలో డజన్ల కొద్ది ప్రజలు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం అధికారికంగా పొడిగింపు లేకున్నా కాల్పుల విరమణ పాటించారు.
ఖతార్ వేదికగా రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయి. అయితే పాక్ దళాలపై ఆత్మాహుతి దాడి జరిగిందని దీనివల్ల అనేక మంది సైనికులు ప్రాణాలు కొల్పోయారని ప్రకటన వెలువడిన తరువాత కొన్ని గంటల్లోనే పాక్ వైమానిక దాడులు చేపట్టింది.


Tags:    

Similar News