వన్డే సిరీస్ లో కూడా ఇంగ్లాండ్ ను ఊడ్చేసిన భారత్

ఈ మ్యాచ్ మొదటినుంచి ఏకపక్షంగానే జరిగింది;

Update: 2025-02-13 01:05 GMT

ఇంగ్లాండ్ తో ఈరోజు(12.2.25) ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన చివరి వన్డే లో, ఇంగ్లాండ్ ను 142 పరుగుల భారీ తేడాతో ఓడించి భారత జట్టు 3-0 సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇంతకు ముందు ఇంగ్లాండ్ జట్టుతో 4-1 తేడాతో టి20 సిరీస్ ను కూడా భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈరోజు జరిగిన మ్యాచ్ మొదటినుంచి ఏకపక్షంగానే జరిగింది.

ఫలితం ముందే తెలిసిపోయింది..

ఈ సిరీస్ లో మొదటిసారి, మొదట బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు 356 పరుగుల భారీ స్కోరును చేసినప్పుడే, ఈ మ్యాచ్ ఫలితం తేలిపోయింది. ఈ సిరీస్ రెండు మ్యాచ్ లలో మొదట బ్యాటింగ్ ఎన్నుకున్న ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ లో అంత సత్తా చూపలేదు. మూడు వన్డేలలో టాస్ గెలిచిన బట్లర్ మొదటి రెండు వన్డేలలో బ్యాటింగ్ చేసి, ఈ వన్డేలో మాత్రం ఫీల్డింగ్ ఎన్నుకున్నాడు. ఎందుకో మరి. మొదటి వన్డేలో ఈమధ్య అంతగా రాణించని రోహిత్ శర్మ సెంచరీ చేసి భారత జట్టును గెలిపించాడు. రెండో వన్డేలో 304 పై పరుగులు చేసినప్పటికీ, ఇంగ్లాండు చిత్తుగా ఓడిపోయింది. శుభమన్ గిల్, 87 పరుగులు చేసి ఈసారి ఇంగ్లాండ్ జట్టును ఓడించాడు. ఈ సిరీస్లో భారత జట్టు బౌలింగ్ కన్నా బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉందన్న విషయం తెలిసిపోయింది.

చెలరేగిపోయిన గిల్

ఇప్పుడు మూడోదైన చివరి వన్డేలో మరోసారి గిల్ చెలరేగిపోయాడు. 112 పరుగులు(102 బంతులు, 14 బౌండరీలు, 3 సిక్సర్లు) పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లతో ఆడుకున్నాడు, దానికి తోడు కింగ్ కోహ్లీ (52), అయ్యర్(78) కూడా బ్యాటింగ్లో రాణించడం వల్ల ఇంగ్లాండ్ భారీ తేడాతో ఓడిపోయింది. ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ బౌలింగ్ కొంతవరకు బాగున్నప్పటికీ, బ్యాటింగ్ మాత్రం తేలిపోయింది.

నిరాశపరచని కింగ్ కోహ్లీ

ఈ మ్యాచ్ కింగ్ కోహ్లీ బ్యాటింగ్ మీద అందరి దృష్టి ఉండగా, వారిని ప్రేక్షకులను నిరాశపరచకుండా కోహ్లీ అర్థ శతకంతో ఇంగ్లాండ్ ఓటమికి సహకరించాడు. ఇప్పటికే మొదటి రెండు మ్యాచ్లు గెలిచిన భారత జట్టు, పెద్దగా మార్పులు ఏమి లేకుండా బరిలోకి దిగింది. మోకాలి గాయం వల్ల మొదటి మ్యాచ్ లో ఆడకపోయినా, విరాట్ కోహ్లీ చివరి మ్యాచ్ తన బ్యాటింగ్ తో ప్రేక్షకుల ను అలరించాడు.

ప్రారంభం అదిరింది కానీ..

357 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు డకేట్, సాల్ట్ లు శుభారంభాన్ని ఇచ్చినప్పటికీ, తర్వాత బ్యాటింగ్ ఫెయిల్ అయింది. ఐదో ఓవర్ వేసిన అర్షదీప్ బౌలింగ్ లో వరుసగా నాలుగు బౌండరీలు కొట్టి కొంచెం దడ పుట్టించిన దకేట్, తర్వాత బంతిని కూడా బౌండరీ దాటించాలన్న ప్రయత్నంలో అవుట్ కావడంతో, ఇంగ్లాండ్ కొంచెం డీలా పడింది. వెంటనే సాల్ట్ ను కూడా అర్షదీప్ బోల్తా కొట్టించడంతో, ఇంగ్లాండు బ్యాటింగ్ బండి బోల్తా కొట్టింది. తర్వాత భారత జట్టుతో మొదటిసారి వన్డే ఆడుతున్న బెంటన్ కొంత బ్యాటింగ్ ప్రతిభ చూపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బ్యాటింగ్ కి అనువుగా లేని పిచ్ మీద ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ తడబడ్డారు. తన మొదటి మ్యాచ్ ఆడుతున్న హర్షిత్ రానా రెండు వికెట్లు తీసి, ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ వెన్ను విరిచాడు.

ఈ నెల 17వ తారీకు నుంచి మొదలయ్యే ఐసీసీ వరల్డ్ ఛాంపియన్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ కు భారత జట్టు రెండు సిరీస్ విజయాలతో వెళ్లనుంది. ఈ సిరీస్ లో భారత బ్యాటింగ్ లో ప్రత్యేకంగా ప్రస్తావించవలసింది శుభమన్ గిల్ గురించి. మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ మధ్యకాలంలో అనేకసార్లు భారత బ్యాటింగ్ వెన్నెముకగా మారాడు. దానికి తోడు ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ కూడా 78 పరుగులతో రాణించడం వల్ల భారత్ ఇంతవరకు జరిగిన రెండు సీరిస్ లలో అత్యధిక పరుగులు(356) ఈ మ్యాచ్ లోనే చేసింది. ఐసీసీ వరల్డ్ ఛాంపియన్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే జట్లకు ఒక హెచ్చరిక పంపింది.

భారత జట్టు బ్యాటింగ్ వెన్నెముక.. గిల్

ఈ సిరీస్ లో భారత్ జట్టుకు విజయాలు అందించిన, శుభమన్ గిల్ ఇప్పుడు బ్యాటింగ్లో భారత తురుఫు ముక్క. ఈ మధ్యకాలంలో భారతదేశపు బ్యాటింగ్లో మెరుస్తున్న ఈ యువ ఆటగాడు, ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ సారధిగా, జట్టును విజయపథంలోనే నడిపించాడు. అతని బ్యాటింగ్ శైలి, దుడుకుతనం, నిదానత్వం కలిపి ఉండడం వల్ల ప్రత్యర్థి బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ తో భారత భవిష్యత్తు బ్యాట్స్మెన్ గా రూపొందాడు. చాలాసార్లు తన బ్యాటింగ్ ప్రతిభతో భారత జట్టు విజయాలు సాధించడానికి కారణమయ్యాడు. వచ్చే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ టోర్నమెంట్లో, భారతీయుడు ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టడానికి గిల్ తో పాటు కోహ్లీ కూడా కారణమవుతారు.

రెండు సిరీస్ లను సునాయాసంగా గెలిచిన భారత్ చెట్టు, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా, గెలుస్తుందని బీసీసీఐ తో పాటు, ప్రేక్షకులు కూడా ఊహించే విధంగా, భారత జట్టు క్రికెట్ ఆడుతుండడం ఒక శుభ పరిణామం.

భారత్ బ్యాటింగ్

356 పరుగులు/ 10 వికెట్లు (50 ఓవర్లు)

గిల్ 112 పరుగులు (102 బంతులు)

విరాట్ కోహ్లీ 52 పరుగులు (55 బంతులు)

శ్రేయస్ అయ్యర్ 78 పరుగులు (64 బంతులు)

ఇంగ్లాండ్ బౌలింగ్

ఆదిల్ రషీద్ 4 వికెట్లు(10 ఓవర్లు)

మార్క్ వుడ్ 2 వికెట్లు(9 ఓవర్లు)

ఇంగ్లాండ్ బ్యాటింగ్:

214 (34.2 ఓవర్లు)

సాల్ట్ 23 పరుగులు (21 బంతులు)

డకేట్ 34 పరుగులు (22 బంతులు)

భారత్ బౌలింగ్

అర్షదీప్ 2 వికెట్లు (5 ఓవర్లు)

హార్దిక్ పాండ్య 2 వికెట్లు (5 ఓవర్లు)

అక్సర్ పటేల్ 2 వికెట్లు (6.2 ఓవర్లు)

Tags:    

Similar News