ఆకాశ్ దీప్ వేసిన ఆ బాల్ ఈ సిరీస్ లోనే అత్యుత్తమం: సచిన్

టీమిండియాపై ప్రశంసలు కురిపించిన లెజెండ్స్;

Update: 2025-07-07 07:04 GMT
ఆకాశ్ దీప్

ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. గిల్ సేన 336 పరుగుల తేడాతో ఇంగ్లీష్ టీమ్ ను ఓడించి సిరీస్ ను 1-1 తో సమం చేసింది.

ఈ విజయం పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. ముఖ్యంగా ఆకాశ్ దీప్ ను ఆకాశానికెత్తాడు. ఈ మ్యాచ్ లో యువ బౌలర్ అత్యుత్తంగా బౌలింగ్ చేశాడని పేర్కొన్నారు. రెండో ఇన్నింగ్స్ లో జో రూట్ కు సంధించిన బంతిని ‘‘సిరీస్ ఆఫ్ ది బాల్’’ గా అభివర్ణించాడు.

ఆకాశ్ దీప్ రెండో ఇన్నింగ్స్ లో 99 పరుగులకు 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనంలో కీలకపాత్ర పోషించాడు. రెండు ఇన్నింగ్స్ లలో కలిపి పది వికెట్లు  పడగొట్టగా, హైదరాబాద్ పేసర్ సిరాజ్ రెండు ఇన్సింగ్స్ లో ఏడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆకాశ్ దీప్ అత్యుత్తమ బౌలర్..
‘‘ఈ మ్యాచ్ నుంచి ఇంగ్లాండ్ విధానాలకు విరుద్దంగా సాగింది. వారిని భిన్నంగా ఆడేలా బలవంతం చేసింది. భారత బౌలర్లలో నన్ను బాగా ఆకట్టుకుంది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నా అభిప్రాయం ప్రకారం ఆకాశ్ దీప్ అత్యుత్తమం. జో రూట్ కు సంధించిన బంతి సిరీస్ ఆప్ బాల్ గా నిలుస్తుంది’’ అని సచిన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
అలాగే షార్ట్ మిడ్ వికెట్ లో సిరాజ్ తీసుకున్న డైవింగ్ క్యాచ్ కూడా లిటిల్ మాస్టర్ ప్రస్తావించాడు. సిరాజ్ పట్టిన క్యాచ్ జాంటీని గుర్తు చేసిందని సచిన్ అన్నారు. టీమ్ కు వెన్నెముకగా నిలిచిన బ్యాట్స్ మెన్ ను కూడా ప్రశంసించారు.
కోహ్లీ ప్రశంసలు..
ఇటీవల రిటైర్ అయిన విరాట్ కోహ్లి కూడా ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ విజయం పై స్పందించాడు. ‘‘ఎడ్జ్ బాస్టన్ లో భారత్ గొప్ప విజయం సాధించింది. నిర్భయంగా ఇంగ్లాండ్ ను నిలువరించగలిగింది. బ్యాట్, ఫీల్డ్ లో గిల్ అద్భుతంగా నాయకత్వం వహించాడు.
అందరు ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చారు. ఈ పిచ్ పై బౌలింగ్ చేసిన విధానానికి సిరాజ్, ఆకాశ్ దీప్ న ప్రత్యేకంగా అభినందించాలి’’ అని కింగ్ అన్నారు. భారత మాజీ కెప్టెన్, దాదా గంగూలీ కూడా టీమిండియాను ప్రశంసించాడు.
‘‘శుభ్ మన్ గిల్, అతని బృందం అద్భుతమైన ప్రదర్శన. బ్యాట్ తో బంతితో ఆకాశ్ దీప్, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇంగ్లీష్ టీమ్ కంటే మన బౌలింగ్ దాడి బాగుంది. ఆకాశ్ దీప్, సిరాజ్ ఇద్దరు రేసు గుర్రాలు. బుమ్రా లేకుండానే భారత్ గెలిచింది. గిల్ అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. ’’ అని గంగూలీ ఎక్స్ లో రాసుకొచ్చాడు.
గిల్ కు ప్రశంసలు..
ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘‘అద్భుతమైన విజయం సాధించినందుకు అభినందనలు.. టీమిండియా? జట్టు పోరాట పటిమ, ధృడత్వాన్ని చూపడం అద్భుతంగా ఉంది.
బ్యాట్ తోనూ రాణించి, జట్టును సమతుల్యతతో నడిపించినందుకు శుభ్ మన్ కు అభినందనలు’’ అని వీవీఎస్ అన్నారు. ‘‘మీ కెప్టెన్సీకి గొప్ప ప్రారంభం. సిరాజ్, ఆకాశ్ దీప్ ల గొప్ప ప్రయత్నం. మీ రాబోయే మ్యాచ్ లకు శుభాకాంక్షలు’’ అని ప్రశంసలు కురిపించాడు.
ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ లో టీమిండియా అనేక రికార్డులు నమోదు చేసింది. రెండు ఇన్సింగ్స్ లలో కలిసి మొత్తం వేయికి పైగా పరుగులు తన టెస్ట్ ప్రయాణంలో తొలిసారిగా నమోదు చేసుకుంది.
అలాగే ఆసియా కెప్టెన్ ఇప్పటి వరకూ ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన ఏ టెస్ట్ లోనూ గెలవలేదు. ఇంతకుముందు ఇక్కడ భారత 8 మ్యాచ్ లు ఆడగా ఏడు మ్యాచులలో ఓడిపోగా, ఒక్కటే డ్రా చేసుకున్నారు. ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో కెప్టెన్ గిల్ రెండు సెంచరీలు సాధించాడు. గవాస్కర్, కోహ్లీ తరువాత ఈ ఘనత సాధించిన మూడో కెప్టెన్ గిల్ మాత్రమే. 


Tags:    

Similar News