జైస్వాల్, అయ్యర్ కు నిరాశ.. వైస్ కెప్టెన్ గా గిల్ ఎంట్రీ
ఆసియా కప్ స్క్వాడ్ ను ప్రకటించిన సెలెక్షన్ కమిటీ;
By : The Federal
Update: 2025-08-19 11:52 GMT
ఆసియాకప్ లో పాల్గొనబోయే భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ లతో జరిగిన సిరీస్ లలో సభ్యుడిగా లేని శుభ్ మన్ గిల్ ను తిరిగి జట్టులో వైస్ కెప్టెన్ గా నియమించారు.
ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో బ్యాట్స్ మెన్ గా, కెప్టెన్ గా అద్బుతంగా రాణించిన గిల్ కు ఇప్పుడు జట్టులోకి వచ్చాడు. తద్వారా భవిష్యత్ లో అన్ని ఫార్మాట్లకు ఏకైక కెప్టెన్ గా గిల్ ఉండబోతున్నాడని సెలక్షన్ కమిటీ అనధికారికంగా ప్రకటించినట్లు అయింది. 25 ఏళ్ల శుభ్ మన్ ఇంగ్లాండ్ పర్యటనలో 75 సగటుతో 754 పరుగులు సాధించాడు. దీనితో టీ20 ఫార్మాట్లలోకి గిల్ ఎంట్రీ ఇచ్చాడు.
చివరిగా సారిగా..
గిల్ చివరి సారిగా జూలై 2024 లో శ్రీలంకతో జరిగిన సిరీస్ లో భారత వైస్ కెప్టెన్ గా పనిచేసినప్పుడు టీ20 లలో ఆడాడు. అదే సంవత్సరం జింబాబ్వేలో జరిగిన టీ20 సిరీస్ లలో తొలిసారిగా జట్టుకు నాయకత్వం వహించాడు.
అన్ని ఫార్మాట్లలో ముఖ్యంగా వన్డేలు, టెస్ట్ లలో అతని కీలక పాత్రను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు పనిభారం నిర్వహణలో భాగంగా పొట్టి ఫార్మాట్ నుంచి గిల్ ను తప్పించారు. అయితే ఆసియా కప్ తరువాత భారత్ కేవలం మరో రెండు మూడు టీ20 సిరీస్ లు మాత్రమే ఆడబోతోంది. తరువాత భారత్ కేంద్రంగా టీ20 ప్రపంచకప్ జరగబోతోంది.
శుభ్ మన్ గిల్ లేని సమయంలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనింగ్ చేసి అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా శాంసన్ వరుస సెంచరీలతో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇప్పుడు గిల్ రాకతో మరోసారి ఒపెనింగ్ లో మార్పు తప్పకపోవచ్చని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
బూమ్రా.. తిలక్..
ఆసియాకప్ ఈవెంట్ కు తాను అందుబాటులో ఉంటానని సెలెక్టర్లకు బూమ్రా సమాచారం ఇవ్వడంతో జట్టులోకి ఎంపిక చేశారు. బుమ్రాతో కలిసి అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ దాడిని ప్రారంభిస్తారు. వీరికి ఆల్ రౌండర్ పాండ్యా తోడుంటాడు.
అలాగే టీ20 లో అద్భుత ఫామ్ లో ఉన్న హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ కూడా తన స్థానాన్ని నిలుపుకున్నాడు. గత సంవత్సరం దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 సిరీస్ లలో వరుస సెంచరీలు సాధించిన అతను, ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో అదరగొట్టాడు.
యశస్వి.. అయ్యార్ లకు నిరాశ..
సెలెక్టర్లు యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యార్ లకు మొండిచేయి చూపారు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్బుత ప్రదర్శన చేసిన అయ్యార్.. కెప్టెన్ గానూ ఆకట్టుకున్నాడు. కానీ ఆసియాకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే జైస్వాల్ ను మాత్రం స్టాండ్ బై ఓపెనర్ గా చేర్చారు. ఇందులో ప్రసిద్ద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ ఉన్నారు. అలాగే మరో వికెట్ కీపర్ గా జితేష్ శర్మ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. సంజు శాంసన్ కు బ్యాకప్ కీపర్ గా శర్మ ఉండబోతున్నాడు.
ఆసియాకప్ ఎంపికైన జట్టు: సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), శుభ్ మన్ గిల్(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, బుమ్రా
సాండ్ బై: ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, జైస్వాల్, ధ్రువ్ జురెల్