భారత్ - ఇంగ్లాండ్ మధ్య నేటి నుంచి మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇక్కడ భారత జట్టుకు పేలవ రికార్డు ఉంది. ఈ మైదానంలో తొమ్మిది మ్యాచ్ లు ఆడగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోగా, ఐదు మ్యాచ్ లను డ్రాగా చేసుకుంది.
రికార్డులకు తోడు భారత జట్టును గాయాలు వేధిస్తున్నాయి. ఇప్పటికే నితీశ్ కుమార్ రెడ్డి టెస్ట్ సిరీస్ నుంచి వైదొలగగా, ఆకాశ్ దీప్, అర్ష్ దీప్ సింగ్ గాయాల కారణంగా ఈ టెస్ట్ మ్యాచ్ కు అందుబాటులో ఉండట్లేదని కెప్టెన్ శుభ్ మన్ గిల్ ప్రకటించారు.
హర్యానా సీమర్ అన్షుల్ కాంబోజ్ ఈ టెస్ట్ లోనే అరంగ్రేటం చేయబోతున్నట్లు సూచన చేశారు. ఆకాశ్ దీప్ లాగే కాంబోజ్ కూడా మంచి స్వింగ్ ను రాబట్టగలడు. కాంబోజ్ ఇండియా ఏ జట్టు తరఫున ఇంగ్లాండ్ లో పర్యటించారు. నిన్న జరిగిన శిక్షణా సెషన్ లో అతను చాలా సేపు బౌలింగ్ చేసినట్లు సమాచారం.
రవీంద్ర జడేజా జట్టులో కొనసాగే అవకాశం ఉంది. పిచ్ పరిస్థితులను అంచనా వేశాక వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి తీసుకుంటారా లేదా అని చూడాలి. సుందర్ కు బదులుగా శార్దూల్ ఠాకూర్ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. గాయంతో నితీష్ వైదొలగడంతో ఇప్పుడు కరుణా నాయర్ తో పాటు సాయి సుదర్శన్ కూడా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్ లో బుమ్రా ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. సిరాజ్ పాటు కాంబోజ్ తుది జట్టులో ఉంటారు. అయితే నాలుగో సీమర్ గా ఠాకూర్ వస్తాడా లేక సుందర్ పక్కన పెడతారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ప్రస్తుతం మాంచెస్టర్ లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్పిన్నర్లకు ఎలాంటి హెల్ప్ పిచ్ నుంచి దక్కకపోవచ్చని అంచనా.
ఇంగ్లీష్ జట్టులో కేవలం ఒకే ఒక మార్పు జరిగింది. గాయపడిన బషీర్ స్థానంలో లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్ డాసన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇవి తప్ప మిగిలిన జట్టు యథాతథంగా ఉంటుందని ప్రకటించారు.
పంత్ తుది జట్టులో ఉన్నాడు..
రిషబ్ పంత్ వేలిగాయం నుంచి కోలుకున్నాడని, కీపర్ గా తన విధులు నిర్వర్తిస్తాడని గిల్ విలేకరుల సమావేశంలో కెప్టెన్ గిల్ వెల్లడించారు. నాయర్ కు మరో అవకాశం ఇస్తామని కూడా చెప్పారు. మిడిల్ ఆర్డర్ చాలా బలంగా ఉందని, జడేజా ఇప్పటికే నాలుగు సార్లు హఫ్ సెంచరీలు సాధించినట్లు చెప్పుకొచ్చాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో 1990 సచిన్ చివరిగా సెంచరీ సాధించాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ భారతీయుడు ఇక్కడ సెంచరీ మార్క్ ను అందుకోలేదు.
తాము సిరీస్ విజయం కోసం ఎదురు చూస్తున్నామని డాషింగ్ బ్యాట్స్ మెన హ్యారీ బ్రూక్ అన్నాడు. లార్డ్స్ టెస్ట్ అత్యుత్తమంగా సాగిందని చెప్పుకొచ్చాడు.