'ఇడ్లీ కడై' సక్సెస్ సెలబ్రేషన్స్ ..

శంకరపురం గ్రామస్థులతో ధనుష్ స్పెషల్ లంచ్!

Update: 2025-10-06 11:43 GMT

అటు తమిళ ప్రేక్షకులను, ఇటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్న ధనుష్ తాజాగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘ఇడ్లీ కడై’. అక్టోబర్ 1 న విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి స్పందనే వచ్చింది. ఈ సినిమా విజయాన్ని ధనుష్ తన కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. సినిమా విజయవంతమైన నేపథ్యంలో, ధనుష్ తన కుటుంబ దేవత అయిన కరుప్పస్వామి ఆలయాన్ని సందర్శించారు. థేని జిల్లా, బోడినాయకనూరు సమీపంలోని శంకరపురం గ్రామంలో ఉన్న ఈ ఆలయానికి ఆయన నిన్న ఉదయం చేరుకున్నారు.ఈ దర్శనంలో ధనుష్ ఒక్కరే కాదు, ఆయన సోదరుడు, ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్, తండ్రి కస్తూరిరాజా, తల్లి విజయలక్ష్మి, కొడుకులు లింగ, యాత్ర కూడా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి స్వామివారి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.

నిజానికి, 'ఇడ్లీ కడై' సినిమా విడుదలకు ముందు కూడా ధనుష్ తన కుటుంబంతో కలిసి ఆండిపట్టి దగ్గరలోని కస్తూరి అమ్మన్ ఆలయంలో పూజలు చేశారు. అయితే, అప్పుడు అభిమానులను కలవకుండా వెళ్లిపోవడంతో, స్థానికులు కాస్త నిరాశ చెందారు.కానీ నిన్న శంకరపురం ఆలయంలో సీన్ మారింది. ధనుష్ ఆలయ ప్రాంగణంలో దాదాపు అరగంట పాటు ప్రజలతో, అభిమానులతో సరదాగా మాట్లాడారు. వారితో ముచ్చటించారు.

దేవాలయ దర్శనం తర్వాత, ధనుష్ కుటుంబం అందరి దృష్టిని ఆకర్షించేలా ఒక పని చేసింది. అక్కడి గ్రామస్తులు, ఆలయానికి వచ్చిన వారందరితో కలిసి ధనుష్ కుటుంబం ప్రత్యేక మధ్యాహ్న భోజనం చేశారు.శంకరపురం గ్రామంలోని ఒక విశాలమైన బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గ్రామస్తులు, ధనుష్ ఒకే పందిరి కింద కలిసి భోజనం చేయడం చాలా అరుదైన దృశ్యం. ఈ సందర్భంగా అభిమానులు ధనుష్‌తో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునే అవకాశం దక్కింది. సినిమా విడుదలకు ముందు, విజయం సాధించిన తర్వాత కూడా ధనుష్ తన పూర్వీకుల దేవాలయాన్ని సందర్శించడం, గ్రామ ప్రజలతో ఆనందాన్ని పంచుకోవడం అక్కడి ప్రజలను అబ్బురపరిచింది.

'ఇడ్లీ కడై' సినిమా శంకరపురం పరిసర ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు, కొన్ని జానపద కథల స్ఫూర్తితో తీసారు తన తండ్రి స్వగ్రామమైన శంకరపురంలోనే సినిమా షూటింగ్ జరగడంతో, ఆ విజయాన్ని ఇక్కడి ప్రజలతోనే పంచుకోవాలని ధనుష్ నిర్ణయించుకున్నారట.ఇక, 'ఇడ్లీ కడై' ధనుష్‌కు నాల్గవ దర్శకత్వ ప్రయత్నం. ఇందులో అరుణ్ విజయ్, నిత్యా మీనన్, రాజ్‌కిరణ్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, షాలినీ పాండే వంటి భారీ తారాగణం నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ రూరల్ డ్రామా కేవలం 4 రోజుల్లో ₹35 కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఈ విజయంతో ధనుష్ యాక్టర్ గా మాత్రమే కాక డైరెక్టర్ గా కూడా వరుస సక్సెస్ లు సాధిస్తున్న హీరోగా నిలిచారు.

* * *

Tags:    

Similar News