‘‘కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి’’
బాధిత కుటుంబాలన పరామర్శించిన షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్ పర్సన్ కిషోర్ మక్వానా
By : The Federal
Update: 2025-10-05 10:19 GMT
కోలీవుడ్ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షెడ్యూల్డ్ కులాల కమిషన్(ఎన్సీఎస్సీ) కరూర్ లో పర్యటించింది.
చైర్ పర్సన్ కిషోర్ మక్వానా నేతృత్వంలోని ప్రతినిధి బృందం బాధిత కుటుంబాలను పరామర్శించడంతో పాటు, అధికారుల నుంచి వివరాలు సేకరించింది. ఈ విషయంలో సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా వారికి ఆదేశాలు జారీ చేసింది. ప్రతి బాధిత కుటుంబంలోని ఒక సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూడా కమిషన్ సిఫార్సు చేసింది.
ఎన్సీఎస్సీ చైర్ పర్సన్ కిషోర్ మక్వానా, డైరెక్టర్ రవి వర్మన్, ఏపీసీఆర్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్ స్టాలిన్, సీనియర్ ఇన్వెస్టిగేటర్ లిస్టర్, కరూర్ జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా వీరితో ఉన్నారు.
ఎన్నికల ర్యాలీ జరిగి తొక్కిసలాటకు కారణమైన ప్రదేశాన్ని కమిషన్ మొదట సందర్శించింది. తరువాత ప్రతినిధి బృందం తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 15 మంది ఎస్సీ బాధితులలో 12 మంది ఇళ్లను సందర్శించింది.
మృతుల కుటుంబాలకు చైర్ పర్సన్ మక్వానా తన సంతాపం తెలుపుతూ.. కమిషన్ పూర్తి మద్దతు వారికి అందిస్తుందని హమీ ఇచ్చారు. ‘‘ఈ బాధ, విషాద సమయాల్లో షెడ్యూల్డ్ కుల సమాజానికి కమిషన్ దృఢంగా అండగా నిలబడుతుంది’’ అని ఆయన అన్నారు. బాధితులకు న్యాయం, ఉపశమనం కలిగించేలా ఎన్సీఎస్సీ చూస్తుందని ఆయన అన్నారు.
‘‘ఈ విషాద సంఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్, ఎస్పీతో సహ ఇతర అధికారులతో చైర్ పర్సన్ చర్చలు జరిపారు. విషాదం తరువాత జరిగిన పరిణామాలు, జవాబుదారీతనం, పారదర్శకత అవసరాన్ని చైర్ పర్సన్ నొక్కి చెప్పారు’’ అని తరువాత ఎన్సీఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఎన్సీఎస్సీ హమీ..
‘‘ర్యాలీ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, పోలీసుల మోహరింపు, భద్రతా చర్యల సమర్థత, వేదిక ఎంపిక, బాధిత కుటుంబాలకు అందిన సాయం వంటి అంశాలతో కూడిన సమగ్ర నివేదికను అందించాలని కమిషన్ అధికారులను ఆదేశించింది’’ అని ఎన్సీఎస్సీ తెలిపింది.
బాధితుల పేద సామాజిక ఆర్థిక నేపథ్యాన్ని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైన అన్ని సహాయాలు అందిస్తామని కూడా హమీ ఇచ్చింది. బాధిత కుటుంబాల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సిఫార్సు చేస్తున్నట్లు కూడా వెల్లడించింది.
సెప్టెంబర్ చివరి శనివారం విజయ్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రజలు భారీగా హజరయ్యారు. టీవీకే పార్టీ పలుమార్లు గందరగోళ పరిచే వార్తలను ప్రచారం చేయడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రజలు వేచి ఉన్నారు.
సాయంత్రం 7.30 నిమిషాలకు విజయ్ రాకతో భారీగా జనం గుమిగూడారు. ఇందులో మహిళలు, పిల్లలు ఇరుక్కుని ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయారు. అనంతరం జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు.