మంగళూరు విమానాశ్రయంలో నినాదాల హోరు..

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సాక్షిగా సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారుల నినాదాలు..

Update: 2025-12-03 09:50 GMT
Click the Play button to listen to article

కర్ణాటక(Karnataka)లో సీఎం కుర్చీ కోసం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(Deputy CM Shivakumar) పోటీపడుతున్న విషయం తెలిసిందే. సిద్ధరామయ్య తన రెండున్నరేళ్ల పదవీకాలం ఇటీవల పూర్తవ్వడంతో నాయకత్వ మార్పుపై ఊహాగానాలు రెట్టింపయ్యాయి. ఇదే విషయంపై చర్చించుకునేందుకు సిద్ధరామయ్య డీకేను తన ఇంటికి అల్పాహారానికి ఆహ్వానించారు. ఆ సమయంలో వారిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత రోజు తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఐక్యంగానే ఉన్నామని, సీఎం కుర్చీ కోసం పోటీ పడడం లేదని సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రకటించారు.


స్మారకోత్సవానికి విచ్చేసిన వేణుగోపాల్..

ఈ నేపథ్యంలో బుధవారం (డిసెంబర్ 3) ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(K C Venugopal) మంగళూరుకు వచ్చారు. మంగళూరు విశ్వవిద్యాలయం నిర్వహిస్తోన్న నారాయణ గురు శతాబ్ది స్మారకోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. మంగళూరు విమానాశ్రయంలో దిగిన ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధరామయ్య, క్యాబినెట్ మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు విచ్చేశారు.


నినాదాలతో హోరెత్తిన ఎయిర్‌పోర్టు..

వేణుగోపాల్ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న సమయంలో డీకే శివకుమార్‌ అనుచరులు నినాదాలు చేశారు. శివకుమార్ అనుకూల గ్రూపు నాయకుడు మిథున్ రాయ్‌ ‘‘పార్టీలో గ్రూపులు లేవంటూనే.. చాలా మంది కార్యకర్తలు శివకుమార్‌ను ముఖ్యమంత్రి చూడాలనుకుంటున్నారు’’ అని చెప్పారు. ఇటు సిద్ధరామయ్య మద్దతుదారుల నుంచి కూడా నినాదాలు వినిపించాయి. 'సిద్దూ, సిద్ధూ, పూర్ణావధి సిద్ధూ' (పూర్తికాల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య) వంటి నినదించారు. ఇంతలో సిద్ధరామయ్య వేణుగోపాల్‌తో కొద్దిసేపు ఏకాంతంగా సమావేశమయ్యారు.

కాసేపటికి వారిద్దరి భేటీ ఫోటోలు సిద్ధరామయ్య ఎక్స్ ఖాతాలో దర్శనమిచ్చాయి. "మంగుళూరులోని గెస్ట్ హౌస్‌లో AICC జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) శ్రీ KC వేణుగోపాల్‌తో సమావేశమై చర్చించాను" అని అందులో కోట్ చేశారు సీఎం.

2023 ఎన్నికలలో కాంగ్రెస్(Congress) పార్టీకి అధికారం దక్కడంతో ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీపడ్డారు. కాంగ్రెస్ అధిష్టానం సూచనమేరకు డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. అయితే తొలి 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య, ఆ తర్వాత రెండేళ్లు శివకుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగేలా ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరినట్లు సమాచారం.  

Tags:    

Similar News