ఆంధ్రాలో మిగ్ జామ్ తుఫాన్ బీభత్సం హెచ్చరిక
మిగ్ జామ్ తుఫాన్ మంగళవారం ఉదయం ఆంధ్రలో బీభత్సం సృష్టించనుందని హెచ్చరిక, వివరాలు
ఇపుడు నైరుతి బంగాళాఖాతంలో తిరుగుతున్న మిగ్ జామ్ (Michaung మిగ్ జామ్ MIGJAUM అని పలకాలి) తుఫాను వాయువ్య దిశగా కదులుతూ తీవ్రతుఫానుగా కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరిచ్చింది. ఇది సోమవారం రాత్రి 9 గంటల నాటికి నెల్లూరుకు 80కి.మీ, బాపట్లకు 210 కి.మీ, మచిలీపట్నానికి 250 కి.మీ. దూరానికి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నానికి నెల్లూరు - మచిలీపట్నం మధ్య బాపట్ల సమీపంలో తీవ్రతుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. తీరం దాటిన తరువాత క్రమంగా బలహీనపడుతుందన్నారు.
మిగ్ జామ్ తుఫాన్ ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో, ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు నమోదైయ్యే అవకాశం ఉందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. రేపు కోస్తాతీరం వెంబడి గంటకు 90 - 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయన్నారు, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదన్నారు.
ఎప్పటికప్పుడు తుఫాను సమాచారాన్ని కలెక్టర్లకు వివరిస్తూ తగిన సూచనలు జారీచేస్తున్నామన్నారు. అత్యవసర సహాయక చర్యలకోసం నెల్లూరులో 4, బాపట్లలో 3, కృష్ణాలో 2, తిరుపతి, ప్రకాశంలో ఒక్కొక్క బృందం చొప్పున మొత్తం 5 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రభావిత జిల్లాల్లో ఉన్నాయని ఆయన తెలిపారు.
కృష్ణా , బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని 192 పునరావాస కేంద్రాల్లో 7361 మందిని తరలించామన్నారు. ప్రభావిత జిల్లాల్లోని 2.38 కోట్ల సబ్‌స్క్రైబర్‌లకు తుఫాను హెచ్చరిక సందేశాలు పంపినట్లు తెలిపారు.
సోమవారం నెల్లూరు జిల్లా కట్టువపల్లెలో 158 మి.మీ, తిరుపతి జిల్లా చిలకూర్ లో 132 మి.మీ, ఇరుగుళం 127, నాయుడుపేటలో 124, కావలి 123, శ్రీకాళహస్తీ 122 మి.మీ అధికవర్షపాతం నమోదైందని తెలిపారు. భారీ వర్షాల పట్ల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఊర్లన్నీ ఏర్లయ్యాయి
తుఫాన్ కారణంగా నెల్లూరు,తిరుపతి జిల్లాలలో రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లాలలో వందలాది గ్రామాలు వరదమయం అయ్యాయి.చేతికందిన పంట వర్షం బారిన పడింది. రహదారులు కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తూ ఉంది. తిరుపతి, నెల్లూరు పట్టలణాలలో వరద పరిస్థితి నెలకొంది.
అనేక కాలనీలు జలమయమయ్యాయి. పలు వూర్లు ఏర్లయ్యాయి. ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఇక పోతే, శ్రీకాకుళం, పార్వతీపురం,మన్యం, విశాఖ, విజయనగరం, అనకాపల్లి, అల్లూరిసీతారామరాజు, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలలో ఈ భారీ వర్షాలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.బుధవారం కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది