హైదరాబాద్ లో ఛాయ లిటరరీ ఫెస్టివల్
రండి,అరుదైన రచయితల్ని కలుసుకోండి! గోరటి వెంకన్న పాటలు వినండి!
‘పునాచ్చి’ -ఒక మేక పిల్ల కథ రాసిన ఒక తమిళ స్టార్ రైటర్ పెరుమాళ్ మురుగన్ అంటే వివాదం,దుమారం, తిరుగుబాటు!
కన్నడ సాహిత్యంలో కల్లోలం సృష్టించిన వసుధేంద్ర రాసిన ‘హంపీ ఎక్స్ ప్రెస్’ కథలు కావవి-కన్నీటి కెరటాలు.
మలయాళ నవలా రచయిత్రి షీలా టోమి ‘వల్లి’ నవలతో పేరు మోసింది. ఆమె రాసిన ‘Don’t ask the river her name’ తెలుగులో రాబోతోంది.
తెలంగాణా సాహిత్యంలో అగ్నిపూలు పూయించిన అల్లం రాజయ్య -ఇంకా ఇలాంటి సృజనాత్మక రచయితలూ కవుల్ని ఒకేసారి కలుసుకునే ఒక అరుదైన అవకాశం పేరు: ఛాయ లిటరేచర్ ఫెస్టివల్. హైదరాబాద్ లో అక్టోబర్ 25 న ధూంధాంగా జరపడానికి సకల ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వేదిక: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ .
ఒక్కరోజు మాత్రమే జరిగే ఈ సాహితీ ఉత్సవం ఒక మరపురాని అనుభవం.విమర్శకులు,అనువాదకులు,పాఠకులు, ప్రచురణకర్తలు ఒకేచోట కలుస్తున్న సందర్భం. సీరియస్ సాహిత్యాన్ని ప్రమోట్ చేయడానికి సిన్సియర్ గా జరుగుతున్న ఒక మంచి ప్రయత్నం. రండి. విలువైన జ్ఞాపకాలని మూటగట్టుకోండి.
ఆలోచనాత్మకమైన తెలుగు వాక్యం రాయడంలో ఆరితేరిన విఖ్యాత జర్నలిస్టు, విమర్శకుడు కె.శ్రీనివాస్ మాటలతో శనివారం ఉదయం ఈ ఫెస్టివల్ ప్రారంభం అవుతుంది. ఎందుకు? దేని కోసం ఈ సాహితీ సరంభం? ఏం సాధిద్దామని ఇంత శ్రమ? -శ్రీనివాస్ ప్రసంగంలో వింటాం. ఆ మొదటి సెషన్ లో నాలుగు భాషల రచయితలూ మాట్లాడతారు. నలుగురు లిటరరీ లెజెండ్స్ :సురవరం ప్రతాపరెడ్డి, మక్దూం మొహియుద్దీన్, గుర్రం జాషువా, తాడి నాగమ్మల గురించి వాహెద్,మెహెక్ హైదరాబాదీ,ప్రొ.కాశిం,ప్రొ.త్రివేణి ప్రసంగిస్తారు.
ఛాయ రిసోర్స్ సెంటర్ చోదక శక్తి కృష్ణమోహన్ బాబు. సెంటర్ డైరెక్టర్ అరుణాంక్ లత ఫెస్టివల్ ఏర్పాట్లలో తలమునకలై వున్నారు.వీళ్ళిద్దరూ మంచి కవులు,అభిరుచి వున్నవాళ్ళు,సాహిత్య ప్రేమికులూ అవ్వడం వల్ల రచయితలూ,అనువాదకులకు ఆదరణలో ఎలాంటి లోటూ రానివ్వరు.
ఇప్పటికే ఏడువందల మంది ఫెస్టివల్ కి వస్తున్నాం అంటూ పేర్లు రిజిస్టర్ చేయించుకున్నారు. ఎంట్రీ ఉచితం, ఇంతమంది జనం రావడం, నాలుగు సెషన్లు,చర్చలూ, పుస్తకాల స్టాల్సు, ఫుడ్ కోర్టులూ, ఇదంతా ఎలా చేస్తున్నారు?అని కృష్ణ మోహన్ని అడిగితే,అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ ఎల్.వి.కె రెడ్డి నాలుగు ఆడిటోరియంలు యిచ్చి,పూర్తిగా సహకరిస్తున్నారు. ‘రూట్స్’ కొలీజియం అధినేత బి.పి.పడాల, మరికొందరు మిత్రులు ఆర్ధిక సాయం చేస్తున్నారు. ఛాయ రిసోర్స్ సెంటర్ మిగతా ఖర్చు భరిస్తోంది’అన్నారు. వెయ్యిమందికి పైగా ఈ లిటరరీ ఫెస్టివల్ కి వస్తారనీ, తగిన ఏర్పాట్లు చేస్తున్నారని అరుణాంక్ అన్నారు. రెండు కవితా సంపుటాలు, ‘ఖ్వాబ్’,’కాసింత ప్రేమ కావాలి’ తో అరుణాంక్ గుర్తుంచుకోదగ్గ కవిగా పేరు తెచ్చుకున్నారు. వివిధ భాషల నుంచి కథలు, నవలల అనువాదం హక్కులు కొని ప్రచురణకి సిద్ధం అవుతున్నామని చెప్పారు. అరుంధతీ రాయ్ తాజా సంచలన నవల ‘MOTHER MARY COMES TO ME’ త్వరలోనే తెలుగులో రాబోతుంది. బుకర్ ప్రైజ్ గెలుచుకున్న బాను ముష్తాక్ నవల ‘HEART LAMP’ ‘హృదయదీపం’ పేరుతో కన్నడ నుంచి తెలుగు అనువాదం జరుగుతోంది. ఛాయ పబ్లికేషన్స్ తక్కువ కాలంలోనే 170 పుస్తకాలు ప్రచురించింది.
ప్రధానవేదికకు లోగిలి అని,మిగిలిన మూడు వేదికలకు ముంగిలి, ముచ్చట,కితాబు అని పేర్లు పెట్టారు. కితాబులో 14 పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది. ముంగిలిలో రచయితలతో సంభాషణ,ముచ్చటలో చర్చ, పిచ్చాపాటి ఉంటాయి .
ఆ రోజు రిలీజ్ అవుతున్న కొన్ని ముఖ్యమైన పుస్తకాలు:అవినేని భాస్కర్ అనువదించిన జయమోహన్ నవల మడన్ మోక్షం. జయమోహన్ ‘తెల్ల ఏనుగు’ నవల చదివారా? లేదంటే మీరు ఒక జీవితాన్ని మిస్ అయినట్టే.
టిబెట్ కాందిశీక కవుల ‘ప్రవాసంలో ప్రతిఘటన’-Poetry in exile, తెలంగాణా స్టార్ రైటర్ పెద్దింటి అశోక్ కుమార్ కథలు ‘మాయిముంత’,రచయిత్రి సామాన్య నవల ‘పుష్పవర్ణ మాసం’, ట్రావెలోగ్ స్పెషలిస్ట్ పరవస్తు లోకేశ్వర్ -షెహర్ నామా. (దీనిపై సంజయ్ బారు మాట్లాడతారు)సోలోమన్ విజయకుమార్ అద్భుతంగా రాసిన దళిత జీవన వేదన ‘మునికాంత పల్లె కథలు’(కొత్త కథలు మూడు కలిపారు), ప్రసిద్ధ జర్నలిస్టు, రచయిత ప్రసాదమూర్తి కవిత్వం ‘కొల్లేటి కలలు’.ఘంటా చక్రపాణి,రచయిత్రి వోల్గా ప్రసాదమూర్తి కవిత్వంపై ప్రసంగిస్తారు.
కథ,నవల,కవిత్వం అంటూ సాహిత్యానికే పరిమితం కాకుండా, సినిమాపై ఓ సెషన్ ఉంటుంది. సినిమా-సాహిత్యం జమిలి ప్రయాణం అనే విషయం మీద వేణు వూడుగుల, బుర్రా సాయి మాధవ్,గౌతమి,అరవింద్ జాషువా మాట్లాడతారు.
కార్పోరేట్ జీవితంలో సాహిత్యం పాత్ర అనే అంశం మీద సాహిత్య ప్రేమి బీపీ పడాల,కవి,విమర్శకుడు ఎం.వీ రామిరెడ్డి,మలయాళ రచయిత బిపిన్ కురియకోసె ,శ్రీనివాస హేచరిస్ కి చెందిన సురేష్ చిత్తూరు మాట్లాడతారు.
‘ప్రశంసకు నోచుకోని ప్రక్రియ-తెలుగు సాహిత్య విమర్శ’ అనే టాపిక్ మీద పేరు గాంచిన రచయిత్రి,అనువాదకురాలు ‘చూపు’ కాత్యాయని, వి.ఆర్.రాసాని,కవులు వెంకటకృష్ణ,సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ప్రసంగిస్తారు.
తెలంగాణా అస్తిత్వం-సాహిత్యం అంశం మీద సంగిశెట్టి శ్రీనివాస్, అల్లం రాజయ్య ,ప్రొ.కాశిం ,షాజహానా,అనిల్ సర్వేపల్లి మాట్లాడతారు.
అర్థవంతమైన కవిత్వం అలవోకగా రాస్తున్న మెర్సీ మార్గరెట్ ఇప్పటి కవితా ధోరణులపై ప్రసంగిస్తారు. మనోధర్మపరాగంతో మంచి రచయిత అనిపించుకున్న మధురాంతకం నరేంద్ర ఒక సెషన్ లో మాట్లాడతారు. వీటన్నిటినీ నిర్వహించి, ఒక పద్ధతిలో నడపడానికి కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసారు. అందులో రచయిత్రి కుప్పిలి పద్మ,కవి యాకుబ్, కవయిత్రి చల్లపల్లి స్వరూపరాణి, వున్నారు. వీళ్ళే ఫెస్టివల్ కి సంబంధించిన సకల నిర్ణయాలు తీసుకుంటారు. ఛాయ రిసోర్స్ సెంటర్ నిర్వహణ ,సర్వీస్ మాత్రమే చూస్తుంది.
ఆహ్వానించాల్సిన అనేకమంది ప్రసిద్ధ రచయితల్ని,కవుల్ని తాము విస్మరించలేదనీ,ఎవర్ని పిలిచినా ప్రయాణం,హోటల్,భోజనాలు,ఇతర ఖర్చులు భరించలేమని కృష్ణమోహన్ చెప్పారు. ఐనా ఒక్కరోజు జరిగేదానికి అందర్నీ పిలవడం వల్ల ఎవరికీ న్యాయం జరగదని అన్నారు.
కవులూ,రచయితలూ ఎవరికి పడతారు? గొప్ప సాహిత్యాన్ని చదివి అర్థం చేసుకునే వాళ్ళెందరు?అందమైన తెలుగు వాక్యం చదివి మురిసిపోయే వాళ్ళెందరుంటారు ?ఛాయ ఎంతో కమిట్ మెంట్ తో ఈ పని చేస్తోంది. శ్రద్ధతో,ప్రేమతో,అలవిమాలిన ఉత్సాహంతో మన సాహిత్యాన్ని సెలబ్రేట్ చేస్తోంది.ఈ పండుగకి కొసమెరుపుగా ప్రజాకవీ, జీరగొంతు హీరో,నిజమైన వాగ్గేయకారుడు గోరటి వెంకన్న మనకోసం పాడతాడు,మాట్లాడతాడు ,మంచి కబుర్లు చెబుతాడు.వెంకన్న తో సంభాషించి,అతనిలోని కవిని ప్రేరేపించడానికి ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ ప్రొ.కాశిం వస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ తాడి ప్రకాష్ కూడా వస్తునారు. రండిరండి, ఈ అద్భుతమైన అనుభవాన్ని మిస్ కాకండి.
* * *