కూల్చివేతలపై సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు హైడ్రాకు వర్తించవా!

అక్టోబర్ 1వ తేదీవరకు, దేశవ్యాప్తంగా ఎలాంటి అక్రమ కట్టడాలనూ తమ అనుమతి లేకుండా కూల్చవద్దని సుప్రీమ్ కోర్ట్ సెప్టెంబర్ 17న ఆదేశాలు జారీచేసింది.

Update: 2024-10-01 13:45 GMT

అక్రమ కట్టడాల కూల్చివేతలపై సుప్రీమ్ కోర్ట్ ఇవాళ చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్‌లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలకు కూడా వర్తించేటట్లుగా ఉన్నాయి. కూల్చివేతలకు ముందు ఇచ్చే నోటీసును కేవలం ఆ కట్టడం గోడలకు అతికించటం కాకుండా తప్పనిసరిగా ఎకనాలెడ్జ్‌మెంట్‌తో కూడిన రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలని కోర్ట్ పేర్కొంది. దీనికోసం ఒక ఆన్ లైన్ పోర్టల్ ప్రారంభించి, దానిలో ఈ నోటీసులు అప్ లోడ్ చేస్తే ఇంకా పారదర్శకంగా ఉంటుందని వ్యాఖ్యానించింది.

యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో రేప్, దారుణ హత్యలు వంటి ఘోరమైన నేరాలకు పాల్పడిన వ్యక్తుల ఇళ్ళను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బుల్‌డోజర్‌లతో కూల్చివేస్తూ “తక్షణ న్యాయం” అమలుచేయటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేతలను సుప్రీమ్ కోర్ట్ తీవ్రంగా పరిగణిస్తోంది. అక్రమ కట్టడాల కూల్చివేతలపై దేశవ్యాప్తంగా అనుసరించటానికి త్వరలో ఇచ్చే తీర్పులో మార్గదర్శకాలను జారీ చేస్తామని సుప్రీమ్ కోర్ట్ ఇవాళ తెలిపింది. నోటీస్ ఇచ్చిన తర్వాత కనీసం 10-15 రోజుల వ్యవధి ఇచ్చేటట్లుగా మార్గదర్శకాలు జారీ చేస్తామని పేర్కొంది. మహిళలు, పిల్లలు రోడ్డుమీద నిలబడాల్సి రావటం మంచి విషయం కాదని, 15 రోజుల తర్వాత కూల్చివేతలు జరిగితే పోయేదేమీ ఉండదని వ్యాఖ్యానించింది.

హైదరాబాద్ నగరంలో హైడ్రా ఒక్కరోజు నోటీసుతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీమ్ కోర్ట్ ఇవాళ చేసిన వ్యాఖ్యలు హైడ్రా బాధితులకు ఉపశమనం కలిగించేవిధంగా ఉన్నాయి. వాస్తవానికి, అక్టోబర్ 1వ తేదీవరకు, దేశవ్యాప్తంగా ఎలాంటి అక్రమ కట్టడాలనూ తమ అనుమతి లేకుండా కూల్చవద్దని సుప్రీమ్ కోర్ట్ సెప్టెంబర్ 17న ఆదేశాలు జారీచేసింది. అయినాకూడా హైదరాబాద్‌ నగరంలో సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలను పరిగణనలోకి తీసుకోకపోవటం గమనార్హం. మరోవైపు, సెప్టెంబర్ 17న తాము ఇచ్చిన ఆదేశాలు, తాము ఈ కేసులో త్వరలో ఇవ్వబోయే తీర్పు వరకు కొనసాగుతాయని కోర్ట్ ప్రకటించింది.

Tags:    

Similar News