క్యాష్ ఫర్ క్వశ్చన్ పై లోక్ సభ ఏం చేసిందంటే?

లోక్ సభలో ప్రశ్నలు అడగటానికి పైసలు(cash for query) తీసుకుంటున్నారనే ఆరోపణలపై టీఎంసీ(tmc) ఎంపీ మహూవా మెయిత్రాపై లోక్ సభ బహిష్కరణ వేటు వేసింది.

Update: 2023-12-08 11:22 GMT
mahuva moitra

లోక్ సభ నైతిక విలువల కమిటీ(ఎథిక్స్ కమిటీ) మహూవాను దోషిగా తేలుస్తూ ఇచ్చిన నివేదిక పై పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి ప్రహ్లద్ జోషి తీర్మానం తీసుకురాగా, సభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. దీంతో ఆమె సభ్యత్వం రద్దయింది. ఎథిక్స్ కమిటి ఇచ్చిన నివేదికపై సభలో తీవ్రమైన చర్చ జరిగింది. ప్రభుత్వ ఆరోపణలను ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వారు సభ నుంచి వాకౌట్ చేశారు.

మధ్యాహ్నం 12 గంటలకు చర్చ ప్రారంభం కాగానే ప్రతిపక్షానికి చెందిన సభ్యులు మాట్లాడుతూ.. ఈ నివేదిక 495 పేజీలు ఉన్నందున అధ్యయనం చేయడానికి మరికొంత గడువు కావాలని కోరారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీనితో సభలో తీవ్ర గందరగోళం తలెత్తింది. స్పీకర్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. సభ ప్రారంభం అయిన వెంటనే ప్యానెల్ నివేదికపై చర్చ కోసం మంత్రి ప్రహ్లద్ జోషి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ఈ నివేదికపై స్పీకర్ ఓం బిర్లా మాట్లాడారు. ఎవరైన సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తే సభ గౌరవం పెరిగేలా ఉండాలని అన్నారు. సభలో ఇలాంటి అంశాలపై చర్చించాల్సి రావడం బాధాకరమన్నారు. అయితే ప్రతిపక్షాలు దీనిని వ్యతిరేకించాయి. చర్చ జరిగిన అరగంట సరిపోదని, మరింత సమయం కావాలని పట్టుబట్టారు. ప్రధాని మోదీ, అదానీ గ్రూపుపై ప్రశ్నలు అడిగినందుకే మహూవాను సభ నుంచి బయటకు పంపించేస్తున్నారని విపక్ష ఎంపీలు ఆరోపించారు. అలాగే నివేదిక అధ్యయనం కోసం కనీసం నాలుగు రోజుల సమయం కావాలన్నారు. దీనిని ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ నివేదికపై మాట్లాడేందుకు తనకు అనుమతి ఇవ్వాలని మహూవా మొయిత్రా కోరగా, సభాపతి నిరాకరించారు. అనంతరం మూజువాణీ ఓటుతో సభ మహూవా సభ్యత్వాన్ని రద్దు చేసింది. తన బహిష్కరణ పై మహూవా స్పందించారు. కేవలం ఇద్దరు వ్యక్తులు చెప్పినదానిని బట్టి ఎథిక్స్ కమిటీ పేరిట బయటకు పంపిస్తున్నారని ఆరోపించారు. రేపు తన ఇంటికి సీబీఐ ని పంపి అక్రమ కేసులతో వేధిస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు.

ఇంతకీ కేసు ఏంటంటే..

లోక్ సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందానీ నుంచి టీఎంసీ ఎంపీ మహూవా మొయిత్రా ఖరీదైన కానుకలు తీసుకున్నారని, ఆమె ఇండియాలో ఉండగా, దుబాయ్ లో పార్లమెంట్ లాగిన్ అయినట్లు తేలింది. దీనిపై మహూవా మిత్రుడు, న్యాయవాదీ జై అనంత్ దెహద్రాయ్, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ద్వారా ఎథిక్స్ కమిటీ కి ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరిపిన ఎథిక్స్ కమిటీ మహూవాను దోషిగా నిర్దారించి, నివేదికను లోక్ సభకు అందించింది. ఈ నివేదిక ఆధారంగా నేడు మహూవాపై బహిష్కరణ వేటు పడింది.

Tags:    

Similar News