ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కొనసాగిన హస్తం హవా
x

ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కొనసాగిన హస్తం హవా

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం. 123 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. 12 వేల పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు.


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ అయింది. భారీ బందోబస్తు, భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ఈ కౌంటింగ్‌కు 12 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి కేంద్రాన్ని సీసీటీవీ నిఘాలో ఉంచారు. వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా డీజీపీ కార్యాలయ కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో మొత్తం పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 12,944 మంది బరిలో ఉన్నారు. వారంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిని అదృష్టం, అధికారం ఎంత వరకు వరిస్తాయన్నది ఈ కౌంటింగ్‌తో తేలుతుంది. ఏడు కార్పొరేషన్స్‌లో నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లలో 2,225 మంది అభ్యర్థులు పోటపడుతున్నారు. కరీంనగర్‌లో అత్యధికంగా 66 డివిజన్లకు 398 మంది ఎన్నికల పోరులో తలపడుతున్నారు. ఇక 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డుల్లో 10,719 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచారు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 314 మంది అభ్యర్థులు ఉన్నారు.

లెక్కింపు కేంద్రాలకు వచ్చే మార్గాలను కఠినంగా నియంత్రిస్తున్నారు. పాస్‌లు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. అల్లర్లు తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్‌తో నిఘాను మరింత పెంచారు. ఈ ఏర్పాట్లన్నింటిని రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగానే సిద్ధం చేసింది.

ఫిబ్రవరి 11న జరిగిన పోలింగ్‌లో పడిన ఓట్లను ఈరోజు లెక్కిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్నది ఈ కౌంటింగ్ ముగిసే సరికి తేలనుంది. కౌంటింగ్ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అన్ని వర్గాలు సహకరించాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు.

Live Updates

  • 13 Feb 2026 4:35 PM IST

    తెలంగాణా మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర స్థాయి ఫలితాలు (వార్డులు)

    మొత్తం: 2,582

    ప్రకటించినవి: 2,521

    కాంగ్రెస్: 1,314

    బీఆర్ఎస్: 701

    బీజేపీ: 258

    ఇతరులు: 248

  • 13 Feb 2026 4:33 PM IST

    సగంపైగా వార్డుల్లో కాంగ్రెస్‌ జోరు

    • తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది.

    • రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో మొత్తం 2,582 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు.

    • ఫలితాల్లో సగంపైగా వార్డులను కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది.

    • పలు పట్టణాల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ లభించింది.

  • 13 Feb 2026 4:33 PM IST

    ఆదిలాబాద్‌లో అత్యధిక వార్డులు బీజేపీ ఖాతాలో

    • ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో బీజేపీ అత్యధిక వార్డుల్లో విజయం సాధించింది.

    • మొత్తం 49 వార్డుల్లో 21 వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది.

    • కాంగ్రెస్‌ 11, బీఆర్‌ఎస్‌ 6 వార్డుల్లో గెలిచాయి.

    • ఇతర అభ్యర్థులు 11 వార్డుల్లో విజయం సాధించారు.

    • మున్సిపల్‌ పీఠంపై తుది సమీకరణాలు కీలకంగా మారనున్నాయి.

  • 13 Feb 2026 4:07 PM IST

    జగిత్యాల మున్సిపాలిటీలో స్వతంత్రుల హవా

    • జగిత్యాల మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థులు ఆధిపత్యం చాటారు.

    • మొత్తం 50 వార్డులకు గానూ కాంగ్రెస్‌ 12 వార్డుల్లో విజయం సాధించింది.

    • బీజేపీ 4, బీఆర్‌ఎస్‌ 4 వార్డుల్లో గెలుపొందాయి.

    • 14 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు.

    • 2 వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు.

    • స్వతంత్రులుగా పోటీ చేసిన జీవన్‌రెడ్డి అనుచరులు గెలుపొందడం స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

  • 13 Feb 2026 3:54 PM IST

    మూడు కార్పొరేషన్లు కాంగ్రెస్‌ ఖాతాలో

    • మంచిర్యాల, రామగుండం, నల్గొండ మున్సిపల్‌ కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది.

    • మంచిర్యాలలో మొత్తం 60 వార్డుల్లో కాంగ్రెస్‌ 41, బీఆర్‌ఎస్‌ 8, బీజేపీ 4, ఇతరులు 2 వార్డుల్లో గెలిచారు.

    • రామగుండంలో 60 వార్డుల్లో కాంగ్రెస్‌ 35, బీఆర్‌ఎస్‌ 13, బీజేపీ 1, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.

    • నల్గొండ కార్పొరేషన్‌లో మొత్తం 48 వార్డుల్లో కాంగ్రెస్‌ 26, బీఆర్‌ఎస్‌ 8, బీజేపీ 4, ఇతరులు 7 వార్డుల్లో గెలుపొందారు.

    • ఈ ఫలితాలతో మూడు కీలక కార్పొరేషన్లు కాంగ్రెస్‌ ఖాతాలో చేరాయి.

    ఇస్నాపూర్‌లో స్వతంత్రుల కోసం పోటీ.. తీవ్ర ఉద్రిక్తత

    • సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ ఏ పార్టీకి అందలేదు.

    • మొత్తం 26 వార్డుల్లో కాంగ్రెస్‌ 10, బీఆర్‌ఎస్‌ 12, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలిచారు.

    • మెజారిటీకి బీఆర్‌ఎస్‌ 2 సీట్లు, కాంగ్రెస్‌ 4 సీట్లు దూరంలో ఉన్నాయి.

    • స్వతంత్రులను ఆకర్షించేందుకు రెండు పార్టీల ప్రయత్నాలు వేగం పందుకున్నాయి.

    • అభ్యర్థులను క్యాంపులకు తరలించేందుకు యత్నాలు సాగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    • భారీగా పోలీసులు మోహరించారు.

    వర్ధన్నపేటలో రీకౌంటింగ్‌తో ఫలితం తారుమారు

    • వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట 12వ వార్డులో రీకౌంటింగ్‌తో ఫలితం మారింది.

    • మొదట 7 ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు.

    • రీకౌంటింగ్‌ అనంతరం 13 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించినట్లు రిటర్నింగ్‌ అధికారి వెల్లడించారు.

    • ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది.

    • ఫలితంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.

  • 13 Feb 2026 3:54 PM IST

    ఇస్నాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత

    • సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌ మున్సిపాలిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    • మొత్తం 26 వార్డుల్లో కాంగ్రెస్‌ 10, బీఆర్‌ఎస్‌ 12, స్వతంత్రులు 4 స్థానాల్లో విజయం సాధించారు.

    • మున్సిపల్‌ పీఠానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ ఏ పార్టీకి అందలేదు.

    • బీఆర్‌ఎస్‌ మెజారిటీకి 2 సీట్లు, కాంగ్రెస్‌ 4 సీట్లు దూరంలో ఉన్నాయి.

    • స్వతంత్ర అభ్యర్థులను క్యాంపులకు తరలించేందుకు రెండు పార్టీల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

    కొత్తగూడెం కార్పొరేషన్‌ సీపీఐ కైవసం

    • కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సీపీఐ ఆధిక్యం సాధించింది.

    • మొత్తం 47 డివిజన్లలో సీపీఐ 25 స్థానాలు గెలుచుకుంది.

    • కాంగ్రెస్‌ 25, బీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 1, సీపీఎం 1, స్వతంత్రులు 2 స్థానాల్లో విజయం సాధించారు.

    • కార్పొరేషన్‌ పీఠంపై తుది సమీకరణాలు కీలకంగా మారనున్నాయి.

    మెదక్‌ మున్సిపాలిటీలో హంగ్‌ పరిస్థితి

    • మెదక్‌ మున్సిపాలిటీలో హంగ్‌ ఫలితం నమోదైంది.

    • మొత్తం 32 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ 15, కాంగ్రెస్‌ 14, బీజేపీ 2, బీఎస్పీ 1 స్థానాల్లో గెలిచాయి.

    • చైర్మన్‌ ఎన్నికలో బీజేపీ, బీఎస్పీ పాత్ర కీలకంగా మారే అవకాశముంది.

  • 13 Feb 2026 3:19 PM IST

    కరీంనగర్‌ కార్పొరేషన్‌లో బీజేపీ దూకుడు

    • కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది.

    • కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి.

    • ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం బీజేపీ 23 డివిజన్లలో విజయం సాధించింది.

    • కాంగ్రెస్‌ 14 డివిజన్లను కైవసం చేసుకుంది.

    • మజ్లిస్‌ పార్టీ 5 డివిజన్లలో గెలుపొందింది.

    • బీఆర్‌ఎస్‌ 4 డివిజన్లలో విజయం సాధించింది.

    • ఇతర అభ్యర్థులు 4 డివిజన్లలో గెలిచారు.

    • మిగిలిన డివిజన్ల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

  • 13 Feb 2026 3:12 PM IST

    ఆలేరు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ జెండా

    • ఆలేరు మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది.

    • మొత్తం 12 వార్డుల్లో 7 వార్డులను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది.

    • బీఆర్‌ఎస్‌కు 3 వార్డులు దక్కాయి.

    • బీజేపీ 2 వార్డుల్లో విజయం సాధించింది.

    జమ్మికుంట కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత

    • కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

    • బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాధను కౌంటింగ్‌ శిబిరానికి వెళ్లకుండా కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకున్నట్లు సమాచారం.

    • ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.

    • పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

    • విజయం సాధించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఆ పార్టీ శ్రేణులు కారులో తీసుకెళ్లారు.

    పలు మున్సిపాలిటీల్లో హంగ్‌ పరిస్థితి

    • మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు తేలుతున్న కొద్దీ పలు చోట్ల హంగ్‌ పరిస్థితి ఏర్పడింది.

    • దేవరకద్ర, అలంపూర్‌, కోహీర్‌, కేసముద్రం, ఆసిఫాబాద్‌, అమరచింత, క్యాతనపల్లి, జనగామ, జిన్నారం, జమ్మికుంట, వేములవాడ, రాయికల్‌, ఆలియాబాద్‌, గద్వాల్‌, జహీరాబాద్‌ మున్సిపాలిటీల్లో హంగ్‌ నమోదైంది.

    • స్వతంత్రుల మద్దతు తుది ఫలితాలను ప్రభావితం చేసే అవకాశముంది.

  • 13 Feb 2026 3:11 PM IST

    వికారాబాద్‌లో స్పీకర్‌ కుమార్తె ఘన విజయం

    • వికారాబాద్‌ మున్సిపాలిటీలో 17వ వార్డులో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్తె గడ్డం అనన్య భారీ మెజారిటీతో గెలుపొందారు.

    • ఈ విజయం స్థానికంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

    సంగారెడ్డిలో భార్య ఓటమి తట్టుకోలేక భర్త అస్వస్థత

    • సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌ మున్సిపాలిటీలో ఘటన చోటుచేసుకుంది.

    • 16వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయలక్ష్మి ఓడిపోవడంతో ఆమె భర్త వెంకట్‌రెడ్డికి అస్వస్థత కలిగింది.

    • స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

    ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్‌కు చుక్కెదురు

    • టికెట్‌ దక్కక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన కామ్రే లక్ష్మీ 6 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

    • ఆమెను మచ్చిక చేసుకునేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ నాయకులను “టికెట్‌ ఇవ్వలేదు.. ఇప్పుడు ఎందుకు?” అంటూ నిలదీశారు.

    • ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశమైంది.

    వందశాతం వెబ్‌కాస్టింగ్‌ మంచి పరిణామం: నీలం సాహని

    • తెలంగాణ ఎన్నికల విధానాన్ని పరిశీలించామని ఏపీ ఎస్‌ఈసీ చీఫ్‌ నీలం సాహని తెలిపారు.

    • ఇక్కడ అమలు చేసిన పలు సాంకేతిక విధానాలను ఏపీలో కూడా అమలు చేస్తామని చెప్పారు.

    • రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్‌ ప్రశాంతంగా జరుగుతోందన్నారు.

    • సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని తెలిపారు.

    • 16వ తేదీన మేయర్‌, చైర్మన్‌ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.

    • సమాన ఓట్లు వచ్చిన పక్షంలో లాటరీ విధానం అమలు చేస్తామని స్పష్టం చేశారు.

    మహబూబాబాద్‌ కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద ఉద్రిక్తత

    • మహబూబాబాద్‌లో కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

    • మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

    • 4వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి గుగులోత్‌ జ్యోతి రమేష్‌ 135 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

    • అభ్యర్థిని క్యాంప్‌కు తరలించే ప్రయత్నాలపై వాగ్వాదం జరిగింది.

    • పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

    తెలంగాణలో 15 మున్సిపాలిటీల్లో హంగ్‌ పరిస్థితి

    • రాష్ట్రంలో ఇప్పటివరకు 15 మున్సిపాలిటీల్లో హంగ్‌ ఫలితాలు నమోదయ్యాయి.

    • జిన్నారం, జమ్మికుంట, ఆసిఫాబాద్‌, కోహీర్‌, అలంపూర్‌, జనగామ, ఇస్నాపూర్‌, జహీరాబాద్‌, కేసముద్రం, దేవరకద్ర, అమరచింత, అలియాబాద్‌, గద్వాల్‌ మున్సిపాలిటీల్లో స్పష్టత రాలేదు.

    • స్వతంత్ర అభ్యర్థుల పాత్ర కీలకంగా మారనుంది.

    • బెల్లంపల్లి మున్సిపాలిటీ కూడా హంగ్‌ దిశగా సాగుతోంది.

    నర్సాపూర్‌ మున్సిపాలిటీలో ఉత్కంఠ

    • మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మున్సిపాలిటీలో ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

    • మొత్తం 15 వార్డుల్లో 14 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి.

    • కాంగ్రెస్‌ 6, బీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి.

    • ఒక వార్డులో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో అధికారులు రీకౌంటింగ్‌ నిర్వహిస్తున్నారు.

  • 13 Feb 2026 1:21 PM IST

    • తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది.

    • ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల ప్రకారం పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది.

    • కాంగ్రెస్‌ గెలిచిన మున్సిపాలిటీలు: నేరేడుచర్ల, హుజూర్‌నగర్‌, హాలియా, కోదాడ, నందికొండ, చండూరు, భూత్పూర్‌, ధర్మపురి, భీంగల్‌, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్‌, మంథని, హుస్నాబాద్‌, మరిపెడ, డోర్నకల్‌, నారాయణఖేడ్‌, అశ్వారావుపేట, స్టేషన్‌ ఘన్‌పూర్‌, ఆందోలు-జోగిపేట, సదాశివపేట, హుజూరాబాద్‌, కొల్లాపూర్‌, మద్దూరు, పెబ్బేరు, మధిర.

    • బీఆర్‌ఎస్‌ గెలిచిన మున్సిపాలిటీలు: గడ్డపోతారం, ఇంద్రేశం, అయిజ, తొర్రూర్‌, ఇబ్రహీంపట్నం, తిరుమలగిరి.

    • ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ వడ్డేపల్లి మున్సిపాలిటీలో విజయం సాధించింది.

    • దేవరకద్ర, అలంపూర్‌, కోహీర్‌, కేసముద్రం, ఆసిఫాబాద్‌, అమరచింత, క్యాతనపల్లి, జనగామ, జిన్నారం, జమ్మికుంట, వేములవాడ, రాయికల్‌ మున్సిపాలిటీల్లో హంగ్‌ ఫలితాలు నమోదయ్యాయి.

    • హంగ్‌ పరిస్థితుల నేపథ్యంలో స్వతంత్రుల పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది.

Read More
Next Story