హస్తినలో అందుకేనా ఈ ఆలస్యం..
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అయినా.. పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో..
తెలంగాణ సీఎం ఎంపికపై ఏఐసీసీ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అయినా.. పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో పదవుల కేటాయింపుపై సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. విక్టరీ వెనక చాలా మంది సీనియర్ల కృషి ఉండడం వల్ల, వారికి కూడా సముచిత స్థానం కల్పించే యోచనలో అధిష్ఠానం ఉంది.
అసంతృప్తికి నో ఛాన్స్...
పదవుల కేటాయింపుతో నేతల అసంతృప్తి బయటపడే అవకాశం ఉంది. దానికి ఆస్కారం ఇవ్వకూడదన్న యోచనలో అధిష్ఠానం, పార్టీ పరిశీలకులు ఉన్నారు. అందుకే సీఎం అభ్యర్థి ఎంపికతో.. పార్టీలో విభేధాలు తలెత్తకుండా చూసేందుకుకసరత్తు చేస్తున్నారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోనున్నారు. సామాజిక సమీకరణాలను కూడా లెక్కలోకి తీసుకుంటారన్న వార్తలొస్తున్నాయి. కర్ణాటకలో పదవుల కేటాయింపు, ఆ తర్వాత పరిణామాలు మనకు తెలిసినవే.
ఆ ముగ్గురు కూడా అమోదించాలి..
ఈ రోజు సీఎం ఎవరన్నది తేలిపోనుంది. సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో నిన్న సీఎల్పీ సమావేశం పూర్తికాగానే పార్టీ పరిశీలకులు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లిపోయారు. సీఎం క్యాండిడేట్‌పై ఏకవాక్య తీర్మానంతో పాటుగా ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ముందుంచనున్నారు. ఆయన పార్టీ పరిశీలకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఆ నిర్ణయాన్ని పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక దృష్టికి తీసుకెళ్తారు. అక్కడ ఓకే చేశాక సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారు.
వాళ్లు వెళ్లింది క్లారిటీ కోసమేనా..
సీఎం పదవిని ఆశిస్తున్న వారిలో పార్టీ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ ఉన్నారు. వీరు ఏఐసీసీ చీఫ్‌ను కలిసి తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ రేవంత్‌కు సీఎం పదవి ఇస్తే..తమకు ఏ పదవులు ఇస్తారన్న వాటిపై కూడా క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది.
ప్రమాణ స్వీకారం సీఎం ఒక్కరే చేస్తారా ?
ఢిల్లీ నుంచి సీఎం ఎవరన్నది తేలితే మిగతా కీలక పదవులపై ఒక క్లారిటీ వస్తుంది. వాటి మీద మరోసారి సంప్రదింపులు జరపాల్సి వస్తే..సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, కేవలం సీఎం అభ్యర్థితోనే తొలుత ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలున్నాయి. తర్వాత క్యాబినెట్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని తెలుస్తోంది. ఓ క్లారిటీ రావాలంటే మాత్రం సాయంత్రం వరకు వేచిచూడాల్సిందే.