తెలంగాణ పోలింగ్ లో ఓటేసిన ప్రముఖులు

ప్రజలు ఓటు వేయడానికి ససేమిరా అన్నారు. గత ఎన్నికల్లో గెలిచిన తరువాత తమ గ్రామానికి రోడ్డు వేస్తామన్నఎమ్మెల్యే ముఖం చాటేయడంతో గ్రామస్తులు ఎదురుతిరిగారు.

Reporter :  The Federal
Update: 2023-11-30 13:28 GMT
Telangana Govt Chief Secretary Shanthi Kumari

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌ముఖులు పెద్ద‌సంఖ్య‌లో పాల్గొని ఓటు వేశారు. వీరిలో ప్ర‌భుత్వ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి వికాస్ రాజ్ ఆయ‌న‌ కుటుంబ సభ్యులతో క‌లిసి సనత్ న‌గర్ లోని నారాయణ కాలేజ్ పోలింగ్ బూత్ ఓటు వేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద‌యం నుండి పోలింగ్ మంద‌కొడిగా సాగుతోంద‌ని, పోలింగ్ శాతం పెర‌గాల‌న్నారు. ఓట‌ర్లు సాద్య‌మైనంత త్వ‌ర‌గా పోలింగ్ కేంద్రాల‌కు చేరుకొని ఓటు వేయాల‌న్నారు. కొత్త‌గా ఓటు హ‌క్కు వ‌చ్చిన వారు త‌మ ఓటు వేసి రాజ్యాంగ హ‌క్కుల‌ను వినియోగించుకోవాల‌న్నారు. మరోవైపు మాదాపూర్ లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాల పోలింగ్ బూత్ లో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ సతీమణితో కలిసి ఓటు వేశారు. నగర ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని రొనాల్డ్ రోస్ కోరారు.   రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్ , ప్రశాసన్ నగర్ , సిరికల్చర్ కమీషనర్ కార్యాలయం లోని 162వ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు వేసిన తెలంగాణ డీజీపీ. హైద‌రాబాద్‌లోని అంబ‌ర్ పేట‌లోగ‌ల జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజ‌నికుమార్ యాద‌వ్ ఆయ‌న‌ సతీమణితో కలిసి ఓటు వేశారు.

కొడంగల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. డిసెంబర్ 9న తొలి కేబినెట్ భేటీ: రేవంత్ రెడ్డి.  ప్రభుత్వ ఏర్పాటుపై టి.పీసీసీ ధీమాతో ఉంది. చీఫ్ రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 'ఆ రోజున సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. అనంతరం తొలి మంత్రివర్గ సమావేశంలో గ్యారంటీలపై చర్చిస్తాం. ఆ పథకాల అమలుపై తొలి సంతకం చేస్తామ‌ని ఓటు వేసిన త‌రువాత ప్ర‌క‌టించారు. కేసీఆర్ మరోసారి దొడ్డిదారిలో గెలవాలనే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కొడంగల్లో ఓటేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆయ‌న స‌తీమ‌ణి జ‌ముతో క‌లిసి క‌మ‌లాపూర్‌లోని సెంట్ర‌ల్ ప్రైమ‌రీ స్కూల్‌లో ఓటు వేశారు. ఎమ్మెల్సీ కవిత జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కూక‌ట్ ప‌ల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎల్లపల్లిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నారాయణపురంలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఓటు వేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో మంత్రి దయాకర్ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి అంబ‌ర్ పేట‌లో ఓటు వేశారు.

అక్క‌డ‌క్క‌డా ఆందోళ‌న‌లు .. ఈసీ ఆరా..!

తెలంగాణలో పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకోవ‌డంపై ఎలక్షన్ కమిషన్ ఆరా తీసింది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఘర్షణల‌పై డీజీపీతో సీఈవో వికాస్ రాజ్ మాట్లాడారు. పోలింగ్ ముగిసేంత వ‌ర‌కూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని డీజీపీని సీఈవో ఆదేశించారు. త‌క్ష‌ణ‌మే ఘర్షణలు అదుపు చేయాలని అధికారులకు సీఈవో ఆదేశించారు. జనగామ, కామారెడ్డి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, పాలేరులో ఘర్షణలు జ‌రిగాయి. కామారెడ్డిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జ‌రిగింది. స్థానికేతరుల వాహనాలు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నాయని బీఆర్ఎస్ ఆందోళన చేప‌ట్టింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మద్య వాగ్వాదం, తోపులాట జ‌ర‌గ‌డంతో ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.

సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ ఆర్టీసీ వైస్ ప్రెసిడెంట్ సజ్జనర్ కొండాపూర్ లోని చిరాక్ పబ్లిక్ స్కూల్ లోని 375వ పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా సజ్జనర్ గారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదన్నారు. మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని ఓటు హక్కు చాటుతుందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, విద్యావంతులు ఓటు వేయడాన్ని తమ బాధ్యతగా భావించి.. పోలింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఐదు సంవత్సరాల మన తలరాతను, రాష్ట్ర ప్రగతిని నిర్ణయించే ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రాష్ట్ర మంత్రి, బిఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలోని విద్యానగర్ చైతన్య స్కూల్ బూత్ నెంబర్ 95లో సతీమణి సునీత, కుమారుడు వేమన్ రెడ్డి, కూతురు లహరి ,కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు . నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా పాన్ గల్ రహదారిలోని బాలికల ఉన్నత పాఠశాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సతీమణి సింగిరెడ్డి వాసంతి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటేసిన బర్రెలక్క

తెలంగాణా రాష్ట్ర రాజ‌కీయాల‌ను కుదిపేసిన కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి శిరీష (బర్రెలక్క) ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో ఓటు వేశారు. హైకోర్టు ఆదేశాలతో ఆమె బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బర్రెలక్క కోరారు.

చెదురుమ‌దురు ఘ‌ట‌న‌ల‌పై చ‌ర్య‌లు : సీఈవో వికాస్ రాజ్‌

రాష్ట్రంలో చాలా చోట్ల నుంచి ఫిర్యాదులు అందాయ‌ని వాటిని పరిశీలిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్య నిర్వహణ అధికారి వికాస్ రాజ్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ మంద‌కొడిగా కొన‌సాగింద‌ని, ప‌లుచోట్ల అనూహ్యంగా పెరిగింద‌న్నారు. రూరల్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరిగిందని , ఇక అర్బన్ ప్రాంతాలలో పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.

రోడ్డేస్తేనే ఓటేస్తాం...! తిర‌గ‌బ‌డ్డ ఓట‌ర్లు

పార్టీ జ‌యాప జ‌యాపై బెట్టింగ్‌కు సిద్ధ‌మైన చోటా నేత‌లు

తెలంగాణ ఎన్నిక‌ల్లో స‌రికొత్త స‌మ‌స్య త‌లెత్తింది. నిర్మ‌ల్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం పెంబి మండ‌లంలోని మారుమూల అట‌వీ ప్రాంత‌మైన గుమ్మెన్న ఎంగ్లాపూర్‌లో ప్ర‌జ‌లు ఓటు వేయ‌డానికి స‌సేమిరా అన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత త‌మ గ్రామానికి రోడ్డు వేస్తామ‌న్నఎమ్మెల్యే ముఖం చాటేసి ప‌ని చేయ‌క‌పోవ‌డంతో గ్రామ‌స్తులు ఎదురుతిరిగారు. ఆందోళ‌న చేస్తున్న వారిని కాద‌ని ఎవ‌రైనా ఓటే వేస్తార‌ని పోలింగ్ స్టేష‌న్ ద‌గ్గ‌రే వంటావార్పుతో ఆందోళ‌న తీవ్రం చేశారు. అధికారుల ఎంత బ్ర‌తిమాలినా గుమ్మెన్న ఎంగ్లాపూర్ ప్ర‌జ‌లు బెట్టుదిగ‌లేదు. దీంతో మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కూ పోలింగ్ నిలిచిపోయింది. జిల్లా అధికారుల ఆదేశాల‌తో స్థానిక ప్ర‌భుత్వాధికారులు గ్రామ‌స్తుల‌తో చ‌ర్చ‌లు ప్రారంభించినా ఫ‌లితం క‌నిపించ‌లేదు. అయితే సాయంత్రం 4 గంట‌ల త‌రువాత ఓటే వేయ‌డం మొద‌లెట్టారు.

Similar News