వార’స’లు గెలిచేనా..? పోటీ చేస్తే సరికాదు... పరువూ దక్కించుకోవాలి
పూర్వీకుల పరువు ప్రతిష్టలు కూడా వీరి జయాప జయాలపై ఆదారపడి ఉన్నాయి. లేదంటే ‘ఎంకి పెళ్లి సుబ్బిచావుకొన్చింది’ అన్నట్లుంటుంది.
"తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి" అన్నట్టంది రాజకీయపార్టీల తీరు. ఎన్నికల టైమ్‌లో పార్టీ అభ్యర్థిగా ప్రకటించే వరకూ ఒక టెన్షన్. ఆ తరువాత సీటు వస్తే.. ఇక కుస్తీకి సిద్ధం అవ్వాల్సిందే. సీటు రాలేదంటే ఒక పార్టీ ఫిరాయింపే. ఎవరైనా ఏదైనా పార్టీలో ఉంటున్నారంటే.. ఐదేళ్ల తరువాత తమకు పార్టీ గుర్తింపు ఇస్తుందనే. తనకున్న తాహతును బట్టి అసెంబ్లీకో, పార్లమెంటుకో, కౌన్సిల్‌కో పంపిస్తుందన్న గంపెడాశ. ఆశలు అడియాశలైతే ఇంకేముంది జంప్ జిలానీలే. మూడు దశాబ్ధాల క్రితం ఎన్నికల్లో పోటీ చేయాలంటే అభ్యర్థికి ప్రజల్లో పరపతి, గుర్తింపు సీటిస్తే గెలుస్తాడనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పడా పరిస్థితి లేదు. ఆర్థికబలం ఉంటే చాలు అభ్యర్థిగా ఆయా పార్టీలు ఓకే చేసేస్తున్నాయి. పదేళ్లుగా ఆపరిస్థితి కూడా దాటిపోయి... ఇప్పుడు కేవలం డబ్బుంటే సరికాదు. పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవారెవరైనా బంధువులై ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతుంటే అసలు విషయాన్ని మర్చిపోయేలా ఉన్నాం. తాజాగా ఎన్నికల్లో చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకోవడం* అన్నట్లు *వారస(సు)లు* పదుల సంఖ్యలో సీట్లు తెచ్చుకొని బరిలో నిలబడ్డారు. పోటీ చేస్తే సరిపోదు. గెలవాలి. ఆపైన ప్రజాసేవలో కొనసాగాలి. ఇదీ వరస. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎం.ఐ.ఎం పార్టీలు పార్టీలోని వారసులకు సీట్లు కేటాయించాయి. గతంతో ఆయా పార్టీలకు విశేషమైన సేవలందించిన వారంతా ఇప్పుడు ఒక్కొక్కరు రాజకీయాల నుండి నిష్క్రమిస్తున్నారు. అది వయస్సు పైబడటం కావచ్చు. లేదా ప్రస్తుత రాజకీయాలకు తాము ఇమడలేక తప్పుకోవాలని అనుకోవచ్చు.
ఇప్పుడు సీటు తెచ్చుకుంటే సరిపోదు. వారసత్వాన్ని నిలబెట్టే బాధ్యత కూడా వారిదే. ఓడిపోతే పార్టీ పరువే కాదు. తమ బంధువులు సంపాధించుకున్న గౌరవ మర్యాదలు గాల్లో కలిసిపోకూడదు. టిక్కెట్టయితే సంపాధించారు కానీ, గెలుపు ఓటములు మాత్రం వారి చేతుల్లో లేదన్న విషయం మర్చిపోరాదు. తెలంగాణ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఎం.ఐ.ఎం పార్టీల వారసులెవరన్నది చూద్దం.
నాలుగు దశాబ్ధాలపాటు కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులను చేపట్టిన కుందూరు జనార్థన్‌రెడ్డి 2023 ఎన్నికల నుండి తప్పుకున్నట్లే కనిపిస్తోంది. దీంతో ఆయన కొడుకు కె.జైవీర్‌రెడ్డి నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో జానారెడ్డి నోముల నర్సింహయ్య చేతిలో ఓడిపోయారు. జనారెడ్డి ఎక్కువ కాలం రాష్ట్ర మంత్రివర్గంలో వివిధ శాఖల మంత్రిగా పనిచేసి, కాసు బ్రహ్మానందరెడ్డి రికార్డును బ్రేక్ చేశారు. తండ్రి వారసుడిగా ఆయన పేరు నిలబెడతారా..? లేదా..? అన్నది ఇప్పుడు ప్రశ్న.
మహబూబ్‌నగర్ నుండి రెండు సార్లు ఎంపీగా ఉన్నజితేందర్‌రెడ్డి కొడుకు మిథున్‌రెడ్డి ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తును తేల్చుకోనున్నారు. అలాగే చాలా కాలం మహబూబ్‌నగర్ జిల్లా నుండి ప్రాతినిథ్యం వహించిన డీ.కే.అరుణ సమీప బంధువు డాక్టర్ పర్ణిక చిట్టెం రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయ అరంగేట్రం చేశారు. ఆమె నారాయణ్‌పేట్ నుండి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి డీ.కే.అరుణ మాత్రం ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారు. అరుణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నాగర్‌కర్నూల్ నుండి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు కూచుకుల్ల రాజేష్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం అంటేనే అందరికీ గుర్తకు వచ్చే నాయకుడు పీజేఆర్. ఆయనే పి.జనార్థన్‌రెడ్డి. ఎప్పుడు మురికివాడల్లోని ప్రజల కష్టనష్టాలను శాసనసభలో ప్రస్తావించి పేదలకు దైవంగా పేరు సంపాధించుకున్నారు. పీజేఆర్ పోటీ చేస్తున్నారంటేనే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం ఉండేది. జనార్థన్‌రెడ్డి ఆకస్మిక మరణంతో అక్కడ ఇప్పుడు ఆయన లేని లోటు కనిపిస్తూనే ఉంది. పీజేఆర్ మరణానంతరం కొడుకు పి.విష్ణువర్థన్‌రెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినా... వారసత్వాన్ని నిలబెట్టుకోలేకపోయారని బస్తీ వాసులు ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. దీంతో ఆయన మూడో కూతురు విజయారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఖైరతాబాద్ నుండి విజయారెడ్డి కాంగ్రెస్‌పార్టీ తరపున పోటీలో ఉన్నారు. ప్రస్తుతం విజయారెడ్డి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా కూడా ఉన్నారు.
కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కొడుకు సంజయ్ తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు. విద్యాసాగర్‌రావు, 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023 ఎన్నికల్లో ఆయన వారసుడికి సీటిప్పించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న 1994 నుండి వరుసగా విజయం సాధిస్తూనే వచ్చారు. 2009లో పి.శంకర్‌రావు (కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి) చేతిలో ఓటమిపాలైయ్యారు. 2018లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిపొంది, గుండెపోటుతో మరణించారు. 2023 ఎన్నికల్లో ఆయన కూతురు లాస్య నందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుండి తన భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు. లాస్య నందితపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఫలితంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
మంత్రి దయాకర్‌రావు స్వయానా అల్లుడు మదన్ మోహన్‌రావు ఎల్లారెడ్డి నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ... మామా అల్లుళ్ల సవాల్ అన్నట్లు దయాకర్‌రావు విజయావకాశాలపై ఉత్కంఠత కలిగిస్తున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి తెలంగాణ ఉద్యమంలో కీలక బాధ్యతలు చేపట్టిన కెప్టెన్ లక్ష్మీకాంతారావు సోదరుడు ఒడితెల ప్రణవ్‌రావు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ సంపాధించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జునరావు మనవడు జగదీశ్వర్‌గౌడ్ శేరిలింగంపల్లి నుండి పోటీ చేస్తున్నారు. ఇక మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మల్కాజిగిరి అసెంబ్లీ నుండి మైనంపాటి హనుమంతరావు బరిలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో హనుమంతరావు టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచారు. 2023 ఎన్నికల్లో తను కొడుకు రోహిత్ కు మెదక్ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. అందుకు బీఆర్ఎస్ ఒప్పుకోకపోవడంతో ఆ వెంటనే పార్టీ ఫిరాయించారు. ఢిల్లీ లాబియింగ్ తో తండ్రీ కొడుకులిద్దరికీ కాంగ్రెస్ పార్టీ నుండి టిక్కెట్ సంపాధించుకున్నారు. మైనంపాటి తనయుడు రోహిత్ ఇప్పుడ మెదక్ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు.
ఇప్పుడు వీరికి ప్రజామోదం లభిస్తుందా..? లేదా అన్నదే మరికొద్ది గంటల్లో తేలనుంది. వీరి భవిష్యత్తు మాత్రమే కాదు. వారి పూర్వీకుల పరువు ప్రతిష్టలు కూడా వీరి జయాప జయాలపై ఆదారపడి ఉన్నాయి. లేదంటే ‘ఎంకి పెళ్లి సుబ్బిచావుకొన్చింది’ అన్నట్లుంటుంది.