తెలంగాణలో కాంగ్రెస్ కు ఓటు , ఆంధ్రలో జగన్ కు చేటా!

ఎగ్జిట్ పోల్స్ తో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సంబురాలు మొదలుపెట్టింది. ఆంధ్రా కాంగ్రెస్, టిడిపి వర్గాల్లో కూడా తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ సంబురంతా ఉన్నాయి. ఎందుకు?

Update: 2023-12-01 04:40 GMT
తెలుగు ముఖ్యమంత్రులు జగన్, కెసిఆర్

తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ మాత్రమే వచ్చాయి.

ఎగ్జిట్స్ పోల్స్ దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని,పూర్తి మెజారిటీ సాధించకపోయినా అతిపెద్ద పార్టీగా నయినా నిలుస్తుందని చెబుతున్నాయి. ఇది తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో కలకలం సృష్టించింది.

తెలంగాణలో నయితే, కాంగ్రెస్ పార్టీ సంబురాలు మొదలు పెట్టింది. పిసిసి అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ఏకంగా నేతలకు  పిలుపు ఇచ్చి అధికారంలోకి వస్తున్నట్లు పండగ చేసుకోండని చెప్పాడు.

అయితే, ఆంధ్రా కాంగ్రెస్. టిడిపి వర్గాల్లో ఇది పండగ సంబరం తీసుకువచ్చింది.

ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పాతాళంలో  ఉంది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయింది. ఈ పార్టీకి నాయకత్వం వహించేందుకు కూడా ఎవరూ ముందుకు రాని పరిస్థితి. సీనియర్ నాయకులంతా కనుమరుగయ్యారు. ఇలాంటి చోట కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నదంటే తమకు కూడా  మంచిరోజులు వస్తున్నట్లు తెగ సంబరపడిపోతున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ కు ఓటు, ఆంధ్రాలో జగన్ కు చేటు అంటున్నారు. తిరుపతి కాంగ్రెస్ నాయకుడు, ఎఐటియుసి చిత్తూరు జిల్లా నవీన్ రెడ్డి ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పునురుద్భవించింది. అక్కడ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరుగులేని శక్తిగా వచ్చింది. దీని ప్రభావం ఆంధ్రాలో తప్పక ఉంటుందని అన్నారు. తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వానికి, ఆంధ్రలో జగన్ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదని ఆయన అన్నారు.

“తెలంగాణలో సాగుతున్నది కెసిఆర్ కుటుంబ పాలన. ఇక్కడ సాగుతున్నది  జగన్ కుటుంబ పాలనే. ప్రభుత్వంలో, రాజకీయ పదవుల్లో అంతా ఆయన దూరపు బంధువులు, దగ్గిర బంధువులు. ఎక్కడచూసినా వాళ్లే కనబడతారు. ఇది రెడ్లకు స్వర్ణయుగం అంటే ఎలా? అదే రకంగా  అవినీతి. యువకులకు ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు. పథకాలు అమలు చేసినంత మాత్రాన ఓట్లు పడతాయన్నగ్యారంటీ లేదు. ఓటర్ల మనోభావాలు ముఖ్యం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో తీర్పు కూడా తెలంగాణాలో లాగానే ఉంటుంది,” అని నవీన్ రెడ్డి అన్నారు.

“ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చి రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత నిచ్చాము అని ప్రభుత్వ  పెద్దలు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం,” అని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పునరాగమణం దక్షిణాది లో మొదలయిందని, అది ఆంధ్ర దాకా వస్తుందని నవీన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

“కర్నాటక నుంచి కాంగ్రెస్ గాలివీస్తాంది.అది తెలంగాణకు వచ్చింది. అక్కడి నుంచి ఆంధ్రాకు రావడం ఏమంత కష్టం కాదు. కాంగ్రెస్ పునరాగమనాన్ని ఎవరూ ఆపలేరు. దీనికి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ సాక్ష్యం, “ అని నవీన్ అన్నారు.

ఒక్కొక్క సారి పథకాలు పనిచేయవు అని మాజీ ఐఎఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలలో పనిచేసి రిటైరయిన ఈ 1981 బ్యాచ్ అధికారి ఒక ఆసక్తికరమయిన విషయం వెల్లడించారు.  ఒకనాడు తెలుగు దేశం పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి విపరీతంగా ప్రయత్నించారు.చివరకు ఆయన అపుడు అమలులో ఉన్న ఉపాధి హామీ పథకం (Employment Assurance Scheme EAS) ఎంచుకున్నారు.

ఈ పధకానికి విపరీతంగా ఆరోజుల్లో నిధులు విడుదలచేశారు. ఈ డబ్బుంతా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు చేరుతుందని, వారంతా ఓటేస్తే చాలు గెలుస్తామని భావించారు. ఏమయింది, చివరకు విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోయింది. తెలుగుదేశం గెలించింది.

"పథకాల ఎన్నికోట్లు పంచినా ఒక్కొక్కసారి దాని ప్రభావం పనిచేయదు. ఇపుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, అదే మరొక సారి రుజువవుతంది. ఈ పరిస్థితి ఆంధ్రాలో కూడా రావచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం  కూడా సంక్షేమ పథకాల ద్వారా భారీగా డబ్బులు పంపిణీ చేసింది. ఇదే తమని గెలిపిస్తుందని భావిస్తున్నది. ఒక్కొక్క సారి అది పని చేయదు. తెలంగాణ ఎన్నికల సందేశాన్ని ఆంధ్ర ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా తీవాలి.  తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్ర ప్రజల మీద తప్పకపడుతుంది,”ఆయన ఆయన వ్యాఖ్యానించారు.

వైఎస్ ఆర్ కాంగ్రెస్ వర్గాల నుంచి తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ మీద ఎలాంటి వ్యాఖ్యలు వెలువడ లేదు. కొంతమందిని సంప్రదిస్తే, అవన్నీ ఎగ్జిట్ పోల్సే కదా, ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువయిన దృష్టాంతాలు కూడా ఉన్నాయి, ఫలితాలు వెలవడే దాకా అగాలని చెప్పారు.

అయితే, తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాత్రం తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్ర రాజకీయల మీద తీవ్రమయిన ప్రభావం చూపిస్తాయని అన్నారు. “ తెలంగాణ ప్రజలు మార్పు కోరుతున్నారు. ఆంధ్రప్రజలు కూడా మార్పుకోరుతున్నారు. తెలంగాణ మార్పుకు బాట వేసింది. అదే ఆంధ్రలో జరుగబోతున్నది,” అని కాల్వ శ్రీనివాసులు 'ది ఫెడరల్ -తెలంగాణ'  కు చెప్పారు.

“ప్రజల్లో ఒక ప్రచారం ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇద్దరు మంచి దోస్తులనేది ఈ ప్రచారం. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయితే, జగన్ కుమానసికంగా బలహీనపడతాడు. ఇక్కడ జగన్ ప్రజావ్యతిరేక పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులకు అది మరింత ఉత్సాహాన్నిస్తుంది,” అని కాలువ శ్రీనివాసులు అన్నారు.

Tags:    

Similar News