తొలి ఫలితం అప్పుడే.. ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. రేపు ఉదయం ఎనిమిది గంటలకు బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభం కానుంది.

Producer :  Chepyala Praveen
Update: 2023-12-02 06:47 GMT
EVM

ఉదయం 8.30 నుంచి ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. పది గంటల కల్లా తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. 11 గంటల కల్లా ఎలక్షన్ ట్రెండ్ తెలుస్తుంది. మధ్యాహ్నం రెండు గంటల కల్లా పూర్తిగా ఎన్నికల ఫలితాలు తెలిసిపోతాయి. ఒక్కో రౌండ్ లెక్కింపునకు సుమారుగా అరగంట పట్టనున్నట్లు సమాచారం.

ఎన్నికల కౌంటింగ్ కు రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ చుట్టుపక్కలా 15 కేంద్రాలున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం 1766 టేబుల్లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుల్లను కేటాయించనున్నారు. ప్రతి 500 బ్యాలేట్ ఓట్లకు ఒక్క టేబుల్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఈవీఎం కేంద్రాలు ఉన్న స్ట్రాంగ్ రూం ల వద్ద మూడంచెలా భద్రత ఉంది. కేంద్ర పారామిలిటరీ బలగాల అదుపులో ఈవీఎం ఉన్న స్ట్రాంగ్ రూం లు ఉన్నాయి.

గెలుపుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరికీ వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తరువాత కాంగ్రెస్ కు కాస్త మొగ్గు ఉన్నట్లు తెలిసినా బీఆర్ఎస్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ ను విశ్వసించడం లేదు. తమను జీహెచ్ఎంసీ, రంగారెడ్డి గట్టేక్కెస్తుందని గులాబీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎంఐఎం తో కలిసి 23 సీట్లను గెలుచుకున్నామని, ఇప్పుడే ఇదే ఫలితం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలుపు పై రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. లక్షకు లక్ష.. వంటి ఆఫర్లతో జోరుగా పందేలు కొనసాగుతున్నాయి. అడవుల జిల్లా ఆదిలాబాద్ లో ఈ బెట్టింగ్ లో ఓ మెట్టు పైకెక్కి ఎకరం భూమిని సైతం ఓపార్టీ కార్యకర్త పందెంలో పెట్టినట్లు తెలుస్తోంది. కొత్తగా పార్టీలో చేరిన ఓ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి చేపట్టి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు.

ఆయన గెలుస్తాడని ఎకరం భూమి పందెం కాసినట్లు గుప్పుమంది. దాంతో ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు కూడా ఎకరం భూమిని కాసినట్లు సమాచారం. మరోవైపు ఆంధ్రలో కూడా తెలంగాణ ఎన్నికల పై జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయట. ముఖ్యంగా గోదావరి జిల్లాలు దీనికి కేంద్రంగా ఉన్నాయట. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నాయకుల మెజార్టీపై బెట్టింగ్ రాకెట్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News